YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆస్తి-పాస్తులు తెలంగాణ

స్మార్ట్ గా పనులు (కరీంనగర్)

స్మార్ట్ గా పనులు (కరీంనగర్)

స్మార్ట్ గా పనులు (కరీంనగర్)
కరీంనగర్, డిసెంబర్ 17  : ఆకర్షణీయ నగరం అంటూ ఎంతో ఊరిస్తూ ప్రారంభించిన పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకున్నాయి.. రెండేళ్ల కిందట కరీంనగర్‌ ఎంపికైనా పనులు చేసేందుకు ప్రణాళికలు చేయడానికే చాలా సమయం పట్టింది. నెలల తరబడి జాప్యం చేయడంతో ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరిగాయి.. ఎట్టకేలకు అభివృద్ధిపై దృష్టి సారించారు. కరీంనగర్‌ ఆకర్షణీయ నగర పరిధిలో మెరుగైన వసతులు, కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవడానికి చర్యలు ప్రారంభించారు. దీనికోసం రూ.1878 కోట్లతో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కేంద్రం ఆమోదం పొందారు. ప్రాధాన్యత క్రమంలో అంచనాలు తయారు చేశారు. మొదటి విడతలో 21 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటివరకు ఒకే ఒక్క పని రూ.18 లక్షలతో కమాన్‌ చౌరస్తాకు మెరుగులు దిద్ది పూర్తి చేశారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా నగరంలో అభివృద్ధి పనులు చేసేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు తయారు  చేశారు. అందులో భాగంగా రూ.472.68 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. వీటిలో రూ.266 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయి.. రూ.217 కోట్లతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, పార్కుల సుందరీకరణ, రోడ్లు, మురుగు కాల్వ పనులు ప్రారంభించారు. మిగతా పనులు కాంట్రాక్టర్లకు అప్పగించి మొదలు పెట్టాల్సి ఉంది. ఆకర్షణీయంగా నగర ప్రధాన రహదారులను తీర్చిదిద్దడానికి వీలుగా స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులు రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. పనులు వేగంగా చేపడుతుండటంతో త్వరగానే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ప్యాకేజీ-1, 2లో 20 రహదారులు ఉండగా ఒకేసారి మొత్తం పనులు ప్రారంభించలేదు. ప్యాకేజీ-1లో మూడు రహదారులు, ప్యాకేజీ-2లో రెండు రహదారులు, ప్యాకేజీ-3లో హౌసింగ్‌బోర్డు కాలనీలో 13.18 కిలోమీటర్ల పొడవునా రోడ్డు, మురుగు కాల్వల పనులు కొనసాగుతున్నాయి. టవర్‌సర్కిల్‌ ప్రాంతాన్ని అమృత్‌సర్‌ తరహాలో అందంగా, పర్యాటకంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా దానికి అనుకొని ఉన్న రెండు కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించి పనులు ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం, ఆచార్య జయశంకర్‌ చౌరాస్తా పనులు పూర్తిచేసేలా పనులు చకచకా చేపడుతున్నారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా రోడ్లు, మురుగు కాల్వల పనులకు అడ్డంకులు తప్పడం లేదు. ప్రధానంగా రోడ్డుకు ఆనుకొని ఉన్న ఆక్రమణలు, రోడ్డుపైనే ఉన్న విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పనులు వదిలేస్తున్నారు. తవ్వి కొంతమేర వదిలేస్తుండటంతో ఇంటి యజమానులకు, రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోంది. మురుగు వాసనతో అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల వీధుల్లో ఉన్న డ్రైనేజీల్లోనే మురుగు నిలుస్తోంది. అడ్డుగా ఉన్న వాటిని వెంటనే తొలగిస్తే పనులు మరింత వేగంగా సాగనున్నాయి. రూ.కోట్లు ఖర్చు చేసి ఆకర్షణీయ పనులు ప్రారంభించిన అధికారులు.. పనులను పక్కాగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. పనులను నగరవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. ఎక్కువగా సీసీతో పనులు జరుగుతుండగా ప్లాంట్‌లో ఎలాంటి ఇసుక, కంకర, సిమెంటు వాడుతున్నారనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వివిధ దశల్లో నాణ్యత పరిశీలించాలి. ముఖ్యంగా క్యూరింగ్‌ చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Related Posts