YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం

మన ఇతిహాసాలు.. 

Highlights

  • శ్రీరామనవమి'కి కల్యాణమెందుకు?
మన ఇతిహాసాలు.. 

సీతారాములు ఒక్కటైంది కల్యాణంతోనే. మరి ఈ సీతారామ కల్యాణం ఎలా జరిగింది? ఆనాడు వైభవంగా జరిగిన ఈ సీతారామ కల్యాణం నేటికి చైత్ర శుక్ల నవమినాడు భారతదేశం మొత్తం వైభవంగా జరగడం వెనుక ఆంతర్యం ఏమిటి? వాల్మీకి రామాయణంలో చైత్ర శుక్ల నవమినాడు కల్యాణం జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు. ఉత్తరఫల్గునీ నక్షత్రంలో సీతారామ కల్యాణం జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. మరి భద్రాచలం మొదలుకొని, భారతదేశం మొత్తం చైత్ర శుక్ల నవమి నాడు కల్యాణాన్ని ఎందుకు ఆచరిస్తారు? పుట్టినరోజు నాడు ఎవరైనా పెళ్లి చేస్తారా? సీతారామ కల్యాణం శ్రీరామ నవమినాడు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అంటే..
24వ మహాయుగంలో త్రేతాయుగంలో విళంబి నామ సంవత్సరంలో చైత్ర శుక్ల నవమి, మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు అవతరించాడు. అంటే ఇప్పుడు 28వ మహాయుగంలో కలియుగం జరుగుతోంది. ఇప్పటికీ సుమారు కోటి 81 లక్షల 47 వేల సంవత్సరాలకు పూర్వం శ్రీరామ అవతరణం జరిగింది. ప్రతి కల్పానికి రామావతారం ఉంది. ఈ శ్వేత వరాహ రాముడి చరిత్రే వాల్మీకి రామాయణంలో ఉంది. ఆనాడు అవతరించిన శ్రీరాముడు కల్యాణాన్ని మాత్రం మనం తప్పక చైత్రమాసంలోనే నవమి రోజున ఆచరిస్తాం. దీనికి కారణం లోకంలో సీతారాములను విడిగా పూజించకూడదనే సంప్రదాయం. శ్రీకృష్ణుడిని బాలకృష్ణుడుగా పూజించవచ్చును. వ్యష్టిగా ఆరాధించవచ్చు. కానీ, శ్రీరాముడిని, సీతను విడివిడిగా పూజించకూడదు. శ్రీకృష్ణుడి అవతారరోజు 'శ్రావణ బహుళ అష్టమి' . ఆ రోజున ఆయనకు జన్మోత్సవం చేస్తాం. కానీ , కల్యాణం చేయం. జన్మదినం నాడు కల్యాణం చేసేది ఇద్దరకు మాత్రమే. ఒకటి పార్వతీ పరమేశ్వరులకు, మరొకటి సీతారాములకు. శివరాత్రి లింగోద్భవం అయిన తర్వాత శ్రీశైలాది క్షేత్రాలలో శివకల్యాణం చేస్తారు. శివ, విష్ణువులకు భేదం లేని తత్వం శ్రీరామ తత్వం. రాముడు సాక్షాత్తు శివస్వరూపమే అందుకే నందీశ్వరుడు ఆంజనేయుడిగా అవతరించాడు. 
పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు సుప్రసిద్ధమైన జంటలు. వృద్ధ దంపతులను పార్వతీపరమేశ్వరులు అంటారు. యవ్వనంలో ఉంటే సీతారాములు అంటారు. మానవుల పేర్లలో కూడా సీతారాములను విడివిడిగా చెప్పరు. పురుషులకైతే సీతారామయ్య, సీతాపతి, శ్రీరామచంద్రమూర్తి అనీ, స్త్రీలకైతే సీతారామమ్మ, రామసీత అని పెట్టుకోవడాన్ని గమనించవచ్చు.

Related Posts