YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆస్తి-పాస్తులు ఆంధ్ర ప్రదేశ్

ఉగాదినాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు

ఉగాదినాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు

ఉగాదినాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు
ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి
అనంతపురం,  జనవరి 10 
అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం తపోవనం, ఏఎస్‌ఆర్‌ నగర్‌లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే చోటు చేసుకున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల వ్యవధిలోనే సంక్షేమ శకానికి నాందిపలికామని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి హామీల అమలు అంటూ హంగామా చేసేవారన్నారు. కానీ తాము మాత్రం మొదటి రోజు నుంచే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నామన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఇప్పటికే 80 శాతం అమల్లోకి తెచ్చామన్నారు. నవరత్నాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు అందించి దేశంలోనే సరికొత్త చరిత్రను సీఎం జగన్‌ లిఖించారన్నారు. సొంత ఆటో ఉన్న వారికి రూ.10 వేలు, నేతన్నలకు రూ.24 వేలు, రైతు భరోసా కింద అన్నదాతలకు రూ.13500, అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.10 వేలు.. ఇలా అనేక రకాలుగా లబ్ధిచేకూర్చామని గుర్తు చేశారు. ఉగాది నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. నారాయణపురం పంచాయతీలో రూ.5.70 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో రూ.25 కోట్లతో డ్రెయినేజీ, రోడ్లతో పాటు 11 గ్రామ సచివాలయాల నిర్మాణాలను రూ.4.4 కోట్లతో చేపడుతున్నామని చెప్పారు. మార్చిలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలకు మంచి చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి, డీఈ భాస్కర్‌రెడ్డి, మండల ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, స్పెషలాఫీసర్‌ సురేష్‌బాబు, సెక్రటరీ నరసింహారెడ్డి, ఈఓ అలివేలమ్మ, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Related Posts