YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

రెండు మార్పులతో సెకండ్ వన్డే టీమ్

రెండు మార్పులతో సెకండ్ వన్డే టీమ్

రెండు మార్పులతో సెకండ్ వన్డే టీమ్
ముంబై, ఫిబ్రవరి 7
న్యూజిలాండ్ టూర్‌లో తొలి పరాజయాన్ని చవిచూసిన భారత్ జట్టు.. బదులు తీర్చుకునేందుకు తహతహలాడుతోంది. హామిల్టన్ వేదికగా గత బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ చేతిలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోగా.. ఆక్లాండ్ వేదికగా శనివారం ఉదయం 7.30 గంటల నుంచి రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల ఈ సిరీస్‌‌పై ఆశలు నిలవాలంటే..? ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో.. భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
1. పృథ్వీ షా
హామిల్టన్ మ్యాచ్‌తో భారత్ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఓపెనర్ పృథ్వీ షా.. అంచనాల్ని అందుకోలేకపోయాడు. గత ఏడాది గాయం, డోపింగ్ టెస్టులో ఫెయిలై 8 నెలలు నిషేధం ఎదుర్కొన్న ఈ చిచ్చర పిడుగు.. రీఎంట్రీలో భారత్-ఎ, దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారించాడు. దీంతో.. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడగానే.. పృథ్వీ షాకి సెలక్టర్లు ఛాన్సిచ్చారు. కానీ.. తొలి వన్డేలో 21 బంతులాడిన పృథ్వీ షా.. 20 పరుగుల వద్దే వికెట్ చేజార్చుకున్నాడు.
2. మయాంక్ అగర్వాల్
గత ఏడాది టెస్టుల్లో నిలకడగా రాణించిన మయాంక్ అగర్వాల్‌కి రోహిత్ శర్మ గాయపడగానే అనూహ్యరీతిలో వన్డే జట్టులో చోటు లభించింది. కానీ.. హామిల్టన్ వన్డేలో 31 బంతులాడిన ఈ ఓపెనర్ 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి టీమ్‌కి మెరుపు ఆరంభమిచ్చినా.. దాన్ని భారీ స్కోరుగా మలచడంలో మయాంక్ ఫెయిలయ్యాడు.
3. విరాట్ కోహ్లీ
ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకి తొలి వన్డేలో 51 పరుగులతో ఆ కొరత తీర్చుకున్నాడు. కానీ.. లెగ్ స్పిన్నర్‌ బౌలింగ్‌లో వికెట్ చేజార్చుకునే కోహ్లీ బలహీనత మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో రెండు సార్లు వికెట్ చేజార్చుకున్న కోహ్లీ.. హామిల్టన్ వన్డేలో లెగ్ స్పిన్నర్ ఇస్ సోధీ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేక బౌల్డయ్యాడు.
4. శ్రేయాస్ అయ్యర్
భారత్ జట్టు నెం.4 నిరీక్షణకి తెరదించిన శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు టీమ్‌లో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్నాడు. తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో కలిసి శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన శ్రేయాస్ అయ్యర్.. వ్యక్తిగతంగానూ 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 103 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో శ్రేయాస్‌కి ఇదే తొలి శతకంకాగా.. మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం అతడ్ని బాధించే అంశమే.
5. కేఎల్ రాహుల్
టీమిండియాలో పాత్ర ఏదైనా.. అత్యుత్తమ ప్రదర్శనని కనబరుస్తున్న కేఎల్ రాహుల్‌కి వన్డే సిరీస్‌లో ఫినిషర్‌ రోల్‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పగించాడు. తొలి వన్డేలో నెం.5లో ఆడిన రాహుల్ 64 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి ఆఖరి వరకూ అజేయంగా నిలిచాడు. భారత్ జట్టు 347 పరుగుల మెరుగైన స్కోరు చేయగలిగిందంటే..? ఆఖర్లో రాహుల్ మెరుపులే కారణం. ఇక కీపర్‌గానూ అతను సమర్థంగా రాణిస్తున్నాడు.

6. శివమ్ దూబే
హామిల్టన్ వన్డేలో ఆరో స్థానంలో కేదార్ జాదవ్‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడించగా.. అతను 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ.. ఆల్‌రౌండర్ కోటాలో జాదవ్‌ని తీసుకున్న కోహ్లీ మ్యాచ్‌లో కనీసం ఒక్క ఓవర్ కూడా అతనితో వేయించలేదు. దీంతో.. ఐదుగురు బౌలర్లే బౌలింగ్ చేయగా.. అదనపు బౌలర్‌ (శివమ్ దూబే) ఉండింటే..? బాగుండేదనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో.. రెండో వన్డేకి జాదవ్‌పై వేటు వేసి ఆల్‌రౌండర్ శివమ్ దూబేని తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఖరి టీ20లో తడబడిన దూబే ఒకే ఓవర్‌లో 34 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే.. అతను నేర్చుకునే దశలో ఉన్నాడు కాబట్టి.. మరికొన్ని అవకాశాలివ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
7. రవీంద్ర జడేజా
న్యూజిలాండ్ గడ్డపై బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్న రవీంద్ర జడేజాకి.. బ్యాటింగ్‌లో మాత్రం ఎక్కువగా అవకాశాలు లభించడం లేదు. తొలి వన్డేలో బ్యాటింగ్‌కి రాని జడేజా.. 10 ఓవర్లు వేసి 64 పరుగులిచ్చాడు. అయితే.. రెండో వన్డేలో జడేజాని బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుకు పంపాలని కూడా టీమిండియాలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
8. కుల్దీప్ యాదవ్
టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని కుల్దీప్ యాదవ్‌కి తొలి వన్డేలో అవకాశం దక్కగా.. అతను తేలిపోయాడు. 10 ఓవర్లు వేసిన కుల్దీప్.. 8.40 ఎకానమీతో ఏకంగా 84 పరుగులిచ్చేశాడు. భారత్ జట్టు మ్యాచ్‌లో ఓడిపోవడానికి కుల్దీప్ పేలవ బౌలింగ్‌తో పాటు అతను వదిలేసిన క్యాచ్ కూడా ఓ కారణమని విమర్శలు వచ్చాయి. కానీ.. రెండో వన్డేలో అతనికి మరో అవకాశమివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
9. జస్‌ప్రీత్ బుమ్రా
వెన్ను గాయం తర్వాత మ్యాచ్‌ల్ని గెలిపించే ప్రదర్శనని జస్‌ప్రీత్ బుమ్రా కనబర్చలేకపోతున్నాడు. తొలి వన్డేలో 10 ఓవర్లు వేసిన బుమ్రా 5.30 ఎకానమీతో పొదుపుగానే బౌలింగ్ చేసినా.. ఏకంగా 13 పరుగులు వైడ్స్ రూపంలో ఇవ్వడం ఇప్పుడు టీమిండియాలో కంగారు పెంచుతోంది. ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో అతని మునుపటి బౌలింగ్ పదును కనిపించడం లేదు. దీంతో.. కీలకమైన రెండో వన్డేలోనైనా.. అతను లయ అందుకోవాలని భారత్ ఆశిస్తోంది.
10. మహ్మద్ షమీ
కివీస్‌తో టీ20 సిరీస్‌లో మెరుగ్గా బౌలింగ్ చేసిన షమీ.. తొలి వన్డేలో తేలిపోయాడు. 9.1 ఓవర్లు వేసిన షమీ.. ఏకంగా 63 పరుగులిచ్చేశాడు. ముఖ్యంగా.. రాస్ టేలర్ ఎదురుదాడి ప్రారంభించగానే.. మరింత లయ తప్పి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో.. రెండో వన్డేలో షమీ మళ్లీ గెలిపించే ప్రదర్శన చేయాలని భారత్ ఆశిస్తోంది.
11. నవదీప్ సైనీ
భారత్ జట్టుకి బుమ్రా తరహాలో ప్రధాన అస్త్రంగా మారుతాడని ఆశిస్తున్న యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి రెండో వన్డేలో ఛాన్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి వన్డేలో ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ 9 ఓవర్లు వేసి 8.89 ఎకానమీతో 80 పరుగులిచ్చాడు. టీమ్‌లోనే అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచిన ఠాకూర్‌పై రెండో వన్డేకి వేటు కత్తి వేలాడుతోంది.
కివీస్‌తో రెండో వన్డేకి భారత్ తుది జట్టు (అంచనా)
పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ

Related Posts