YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

టెలికం రంగానికి బెయిల్ అవుట్

టెలికం రంగానికి బెయిల్ అవుట్

టెలికం రంగానికి బెయిల్ అవుట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25
 టెలికం రంగానికి అత్యవసర సాయాన్ని అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. తక్షణ సహాయ చర్యలపై చర్చించేందుకు టెలికం విభాగం (డాట్‌)తోపాటు ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు ఢిల్లీలో సమావేశమయ్యారు. టెలికం విభాగంలో జరిగిన ఈ సమావేశం గంటకుపైగా సాగింది. టెలికం రంగాన్ని ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలపై ఈ భేటీలో చర్చించి పలు ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తున్నది. టెలికం రంగం మునుపెన్నడూ ఎరుగనంత తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని, ఈ సంక్షోభం నుంచి పరిశ్రమను గట్టెక్కించేందుకు పన్నులు, లెవీలను తగ్గించాలని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ గతవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి నీతి ఆయోగ్‌తోపాటు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సైతం హాజరైనట్టు సమాచారం. అయితే ఈ భేటీలో చర్చించిన అంశాలపై అధికారులు నోరు విప్పడంలేదు. ఈ వివరాల గురించి మాట్లాడేందుకు టెలికం విభాగ కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ కూడా అందుబాటులో లేరు. కేంద్ర ప్రభుత్వానికి టెలికం సంస్థలు రూ.1.47 లక్షల కోట్లు బకాయి పడిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ బకాయిల్లో లైసెన్సు ఫీజుల కింద రూ.92,642 కోట్లు, స్పెక్ట్రమ్‌ వినిమయ చార్జీల కింద మరో రూ.55,054 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. మొత్తం బకాయిల్లో వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌, ఎయిర్‌టెల్‌ బకాయిలే దాదాపు 60 శాతం మేరకు ఉన్నాయి. ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే టెలికం సంస్థలను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం సమతుల్యత పాటిస్తూ టెలికం రంగం బాగోగులు చూసేందుకు ప్రయత్నిస్తున్నది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూనే సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ‘త్రీ ప్లస్‌ వన్‌' (మూడు ప్రైవేట్‌రంగ సంస్థలు, ఒక ప్రభుత్వరంగ సంస్థ) విధానాన్ని అనుసరిస్తూ టెలికం రంగంలో పోటీని కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి దాదాపు రూ.35 వేల కోట్ల ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సిన ఎయిర్‌టెల్‌ ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు చెల్లించింది. మిగిలిన బకాయిలను మార్చి 17 లోగా చెల్లిస్తామని ప్రకటించింది. గత కొన్ని నెలల్లో పలు మార్గాల ద్వారా 300 కోట్ల డాలర్ల నిధులను సమీకరించిన ఎయిర్‌టెల్‌.. ఏజీఆర్‌ బకాయిల సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతున్నది. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.53 వేల కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు కేవలం 7 శాతం (రూ.3,500 కోట్లు) మాత్రమే చెల్లించిన వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ పీకల్లోతు కష్టాల్లోకి దిగజారే అవకాశం ఉన్నది.

Related Posts