YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రిజిస్ట్రేషన్ కోసం తిప్సలు

రిజిస్ట్రేషన్ కోసం తిప్సలు

రిజిస్ట్రేషన్ కోసం తిప్సలు
వరంగల్, మార్చి 10
శాఖలో ప్రస్తుతం భారత్‌ స్టేజ్‌(బీఎస్‌)-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ సందడి నెలకొంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-6 వాహనాలను మాత్రమే రిజిస్టర్‌ చేయాలనే ఉత్తర్వులు వెలువడటంతో బీఎస్‌-4 వాహనాల యజమానులు రవాణాశాఖ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ తుది గడువు ఈ నెల 31వ తేదీతో ముగిసిపోనున్నందున తమ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఆరాట పడుతున్నారు. దీంతో రవాణాశాఖ కార్యాలయాలు మేళాను తలపిస్తున్నాయి. బీఎస్‌-4 వాహనాలు, వాటి యజమానులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం ప్రతి రవాణాశాఖ ఆఫీసులో వాహనదారులు పోటెత్తారు. తమ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ సాధారణంపై నూరుశాతానికి పైగా పెరిగింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం బీఎస్‌-6 పెట్రోల్‌, డీజిల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా తయారీ కంపెనీలు వాహనాల ఇంజిన్లలో మార్పులు చేశాయి. ప్రయోగాత్మకంగా ఇప్పటికే రాష్ట్రంలో బీఎస్‌-6 పెట్రోల్‌, డీజిల్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. మార్చి 31వ తేదీతో బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం డీలర్ల వద్ద విక్రయానికి పెద్ద సంఖ్యలో బీఎస్‌-4 వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోగా బీఎస్‌-4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ముందుకొచ్చే వారు ఇబ్బంది పడకుండా రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ఈ శాఖ కమిషనర్‌ బుధవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల రవాణాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బీఎస్‌-4 కలిగిన మోటరు సైకిళ్లు, కార్లు, ఇతర కమర్షియల్‌ వెహికిల్స్‌ అన్నింటికీ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ ఉండదనే విషయాన్ని వాహనదారులకు తెలియజేయాలని చెప్పారు. బీఎస్‌-4 వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తమ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రవాణాశాఖ వెసులుబాటు కల్పించింది. రిజిస్ట్రేషన్‌ సమయంతోపాటు రోజువారీగా కేటాయించే స్లాట్లను కూడా పెంచింది. రవాణాశాఖ కార్యాలయాల్లో సాధారణంగా ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. శుక్రవారం నుంచి ఈ సమయాన్ని సాయంత్రం ఐదు గంటల వరకు రవాణాశాఖ పొడిగించింది. ఆర్టీవో, యూనిట్‌ కార్యాలయాల పరిధిలో రోజువారీగా వివిధ సేవల కోసం కేటాయించే సమయాల (స్లాట్స్‌)ను రెండింతలు చేసింది. ఉదాహరణకు వరంగల్‌ రంగశాయిపేటలో పనిచేస్తున్న రూరల్‌ జిల్లా ఆర్టీవో కార్యాలయంలో రవాణాశాఖ అధికారులు ఇన్నాళ్లు రెగ్యులర్‌గా వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రతిరోజు 90 నుంచి 120 స్లాట్స్‌ కేటాయించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. సుమారు 250 వాహనాలకు రవాణాశాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. వీటిలో ఐదారు బీఎస్‌-6 వాహనాలు ఉంటే మిగతావన్ని కూడా బీఎస్‌-4 వాహనాలే కావటం విశేషం. ఉదయం 10:30 గంటలకు ముందే బీఎస్‌-4 వాహనాల యజమానులు తమ వాహనాలతో ఈ కార్యాలయానికి చేరుకున్నారు. ఆఫీసు ఆవరణ బీఎస్‌-4 వాహనాలతో నిండిపోయింది. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన బీఎస్‌-4  వాహనాలు కార్యాలయం బయట కూడా బారులు తీరాయి. వాహనాల యజమానులు స్లాట్‌ బుక్‌ చేసి ఫొటో దిగేందుకు ఆఫీసులో కౌంటర్‌ వద్ద గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ఇన్నాళ్లు వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఒక కౌంటర్‌ ఉంటే మంగళవారం రెండో కౌంటర్‌ కూడా పనిచేసింది. రెండు కౌంటర్లలో సుమారు 250 వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగింది. షోరూం నుంచి తెచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా రవాణాశాఖ అధికారులు బీఎస్‌-4 వాహనాల చాసెస్‌, ఇంజిన్‌ నంబర్లను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ జనరేట్‌ చేశారు. సందట్లో సడేమియా మాదిరిగా ఆర్టీవో కార్యాలయంలో కొందరు ఇదే అదనుగా బీఎస్‌-4 వాహనాల యజమానులను కలిసి అన్నీ తామే చూసుకుంటామని చెప్పి వసూళ్లకు తెగబడ్డారు. ఒక్కో బీఎస్‌-4 వాహనానికి రేటు ఫిక్స్‌ చేసి వసూళ్లు చేశారు. ఆర్‌సీ కార్డు(స్మార్ట్‌కార్డు) కూడా రిజిష్టర్‌ పోస్టు ద్వారా కాకుండా తాము నేరుగా అందజేస్తామని చెప్పారు. దీంతో బీఎస్‌-4 వాహనాల యజమానులు ఏజెంట్లు అడిగిన డబ్బు ఇచ్చి వారికి తమ వాహనాల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించారు.

Related Posts