YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 విశాఖ మేయర్ పీఠంపై మల్లగుల్లాలు

 విశాఖ మేయర్ పీఠంపై మల్లగుల్లాలు

 విశాఖ మేయర్ పీఠంపై మల్లగుల్లాలు
విశాఖపట్టణం, మార్చి 24
విశాఖ మేయర్ సీటు అంటే మాటలు కాదు, 98 వార్డులు కలిగిన పెద్ద నగరం. ఏడాదికి దాదాపు అయిదు వేల కోట్ల బడ్జెట్ కలిగిన కార్పోరేషన్ అది. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృధ్ధి చెందుతున్న సిటీ. జగన్ అనుకున్నట్లుగా చేస్తే విశాఖ రాజధాని నగరం అవుతుంది దాంతో ఇబ్బడి ముబ్బడిగా నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఉన్న చోటనే మేయర్ అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ లెక్కే ఇంకా బాగుంటుంది. అటువంటి విశాఖ మేయర్ సీటు కోసం వైసీపీలో పెద్ద ఎత్తున పోరు సాగుతోంది. దాదాపుగా అరడజను మంది ఈ కుర్చీ ఎక్కేందుకు కాచుకుని కూర్చున్నారు. పదేళ్ళుగా రాజకీయాల్లో పనిచేస్తూ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తులను సైతం పోగొట్టుకున్న విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ వంశీక్రిష్ణకు జగన్ గత ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. చివరి నిముషంలో తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అలిగిన వంశీకి మేయర్ సీటును అధినేతే స్వయంగా హామీ ఇచ్చారని చెబుతారు. దాంతో ఇపుడు వంశీ తానే కాబోయే మేయర్ అని గట్టిగా చెప్పుకుంటున్నారు. అయితే ఆయనకు పోటీగా ఇపుడు కొత్త పేర్లు రావడంతో గుస్సా అవుతున్నారు.కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఇపుడు మళ్ళీ పార్టీలో వచ్చి చేరారు. ఆయన తనకు మేయర్ సీటు కావాలని అంటున్నారు. ఆ విధంగా హామీ ఇస్తేనే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తన బలాన్ని చూపిస్తానని, గంటాను ఎదిరిస్తానని చెబుతున్నారు. గంటా ఉత్తరం నుంచి గెలవడం వెనక తైనాల బలం చాలా ఉంది. వెలమ సామాజికవర్గానికి చెందిన తైనాల కీలక ఘట్టంలో పార్టీకి దెబ్బేసి గంటాను గెలిపించారు. దీంతో ఆయన రాకను ఇపుడు సొంత పార్టీ వైసీపీలోనే వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులు ఉన్నాయి. ఇందులో దాదాపుగా మెజారిటీ వార్డుల్లో వెలమల బలం ఉంది. అందుకే తైనాలను వైసీపీ పెద్దలు అక్కున చేర్చుకున్నారు.ఇక విశాఖ మేయర్ సీటుని చెరి రెండున్నరేళ్ళుగా పంచాలని వైసీపీలో ఒక ప్రతిపాదన నడుస్తోంది. సిటీలో వెలమలు, యాదవులు బలంగా ఉన్నారు. ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన వంశీ, తైనాలను బుజ్జగించి పార్టీని గెలిపించుకోవాలంటే ఈ పంపిణీ చేయాల్సిందేనని అంటున్నారు. అయితే దానికి వంశీ ఒప్పుకోవడంలేదట. అదే సమయంలో తొలి రెండున్నరేళ్ళు తనకే మేయర్ సీటు ఇవ్వాలని అపుడే తైనాల మడత పేచీ పెడుతున్నారట. అలాగైతేనే తాను కార్పోరేటర్ గా పోటీ చేస్తానని కూడా ఆయన చెబుతున్నారట. మొత్తానికి ఈ నాయకులకు నచ్చచెప్పలేక వైసీపీలో కొత్త గొడవలు అవుతున్నాయి. మరో వైపు పాతకాపులు, సీనియర్ నేతల వారసులు కూడా మేయర్ సీటుపైన కన్నేశారు. ఇంకా ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్లుగా ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచాక మేయర్ సంగతి తేల్చుకుందామని మరికొందరు నేతలు అంటున్నారు.

Related Posts