YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 క్వాయర్ గ్రామంగా దొడ్డవరం

 క్వాయర్ గ్రామంగా దొడ్డవరం

 క్వాయర్ గ్రామంగా దొడ్డవరం
కాకినాడ, మార్చి 26,
మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామం అరుదైన గుర్తింపు సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ‘క్వాయర్‌ ఆదర్శ గ్రామం’గా దీనిని ఎంపిక చేయనుంది. రాజమహేంద్రవరంలోని రీజనల్‌  క్వాయర్‌ బోర్డు సిఫారసు మేరకు కేంద్ర చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ ఈ గ్రామాన్ని ఎన్నుకుంది. దీనిని ఆదర్శగ్రామంగా ప్రకటించడం లాంఛనమే.  వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ గ్రామం కేంద్ర ప్రభుత్వం  పీచు ఉత్పత్తుల అభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పనకు భారీగా నిధులు కేటాయించనున్నారు.పీచు, పీచుతో తయారు చేసే తాళ్ల ఉత్పత్తిలో మామిడికుదురు మండలం అగ్రస్థానంలో ఉంది. తాళ్లే  కాకుండా పలురకాల పీచు ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. దక్షణాది కొబ్బరి పండించే రాష్ట్రాల్లో పీచుతో తయారు చేసే తాళ్ల ఉత్పత్తిలో మామిడికుదురు మండలం అగ్రస్థానంలో ఉంది. ఈ మండలంలో   పెదపట్నం, పెదపట్నంలంక, పాశర్లపూడి, బి.దొడ్డవరంలో తాళ్ల ఉత్పత్తి ఎక్కువ.ముఖ్యంగా బి.దొడ్డవరంలో మహిళలు పెద్ద ఎత్తున తాళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ గ్రామంలో జనాభా 2,023 కాగా,  706 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామంలో 108 తాళ్లు ఉత్పత్తి కేంద్రాలు విజయవంతంగా నడుస్తుండడం గమనార్హం. వీటి మీద ఆధారపడి సుమారు 250కి మందికి పైగా మహిళలు జీవనం సాగిస్తున్నారు.  ఇంతా చేసి ఈ గ్రామంలో కేవలం 580 ఎకరాల కొబ్బరి తోట మాత్రమే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి పీచును తెచ్చుకుని ఇక్కడ తాళ్లను తయారు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అధునాతన యంత్రాలను సైతం వినియోగించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇటీవల తిరుపతిలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ సహాయమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వద్ద ఆదర్శగ్రామం  ఎంపిక విషయంపై చర్చకు వచ్చింది. క్వాయర్‌ ఉత్పత్తిలో దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఆదర్శగ్రామంగా ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించిందని  మంత్రి చెప్పారు. ఈ సమయంలో స్థానిక రీజనల్‌ క్వాయర్‌ బోర్డు అధికారులు మామిడికుదురు మండలాన్ని ఆదర్శమండలంగా ఎంపిక చేసే అవకాశముందని, ఇక్కడ పీచు ఉత్పత్తి కేంద్రాలతోపాటు  బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పాశర్లపూడిలంకల్లో మహిళలు పీచుతాళ్లను ఉత్పత్తి చేసి స్వయం సమృద్ధి చేస్తున్నారనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు.మండలాన్ని క్వాయర్‌ ఆదర్శ మండలంగా ఎంపిక చేయాలని కోరగా, మంత్రి మాత్రం ఆదర్శ గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేయాలని సూచించారు. దీంతో అత్యధిక మోటరైజ్డ్‌ ర్యాట్‌లు ఉండి ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న  బి.దొడ్డవరాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయాల్సిందిగా రీజనల్‌ క్వాయర్‌ బోర్డు అధికారి మేడిద రామచంద్రరావుకు సూచించారు. గ్రామాన్ని ఎంపిక చేసిన తరువాత ఇక్కడ పీచు ఉత్పత్తి, పీచుతో తయారు  చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెట్‌ సదుపాయాలు కల్పించడం, గోడౌన్లు, శిక్షణ కార్యక్రమాలకు భవనాలు నిర్మించనున్నారు. దీని కోసం తొలివిడతగా రూ.కోటి వరకు కేటాయించే అవకాశముంది.  తరువాత దఫదఫాలుగా నిధులు మంజూరు చేస్తారు. క్వాయర్‌ అనుబంధంగానే కాకుండా గ్రామంలో జీవన ప్రమాణాలు మెరుగు పరిచే విధంగా ఇంటింటా కుళాయి, నాణ్యమైన రోడ్ల నిర్మాణం కూడా జరిగే అవకాశముంది.మౌలిక సదుపాయలు కల్పిస్తే దీని వల్ల గ్రామంలో పీచు ఉత్పత్తుల తయారీ మరింత ఊపందుకుంటుంది. బి.దొడ్డవరంతోపాటు సమీపంలో ఉన్న పెదపట్నం, పెదపట్నంలంక, అప్పనపల్లి  గ్రామాలతోపాటు మండలంలో ఇతర గ్రామాల్లో మహిళా కార్మికులు గరిష్టంగా లబ్ధిపొందనున్నారు. మార్చి నెలాఖరుతో కొత్త ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున, వచ్చే ఏప్రిల్‌లో క్వాయర్‌ బోర్డు రీజనల్‌  అధికారులు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఇక్కడే గ్రామంలో క్వాయర్‌ అభివృద్ధి, మౌళిక సదుపాయల కల్పనపై తుది నిర్ణయం తీసుకుని ప్రతిపాధనలను కేంద్ర చిన్న, మధ్య తరగతి  పరిశ్రమల శాఖకు పంపనుంది.

Related Posts