YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నిరాశలో మామిడి రైతులు

నిరాశలో మామిడి రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మామిడి రైతులు నిరాశలో కూరుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడి మందగించడమే వారి ఆవేదనకు కారణం. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో మామిడి రైతులకు ఆశించిన ఫలితం దక్కడంలేదు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 46,500 ఎకరాల్లో మామిడి సాగవుతోంది.  తిరుమలాయపాలెం, కూసుమంచి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి మండలాల పరిధిలో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. బంగినపల్లి, రసాలు, తోతాపురి రకాలను బాగా పండిస్తున్నారు రైతులు. సాధారణంగా ఎకరాకు మామిడి దాదాపు 3 నుంచి 4 టన్నులు దిగుబడి వస్తుంది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఈ సీజన్‌లో పూత ఆలస్యమైనా పెద్ద ఎత్తునే వచ్చింది. దీంతో ఎకరాకు రెండు టన్నులు మించి దిగుబడి వచ్చే పరిస్థితలేదు. స్థానికంగా పండించిన మామిడిని ఉత్తరాది ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంటారు. ఇప్పటికే ఇతర ప్రాంతాలకు వెళ్లే మామిడి దిగుబడి తక్కువగా ఉండడంతో ఇంకా మార్కెట్లు ప్రారంభంకాలేదు. దీంతో రైతుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది.

 

సాధారణంగా మార్చిలోనే మామిడి దిగుబడి ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ వచ్చేసరికి కోతలు పూర్తయితే  రైతు నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ప్రతికూల వాతావరణం వల్ల పూత ఆలస్యమైంది. ఫలితంగా ఏప్రిల్‌ నెలాఖరు, మేలోగానీ కాయలు వస్తున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులు వల్ల కాయలు రాలిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఉంటుండడంతో రైతులు మామిడి పంటపై ఆశలు వదిలేసుకుంటున్నారు. మామిడి తోటలను నరికేస్తూ ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పలువురు రైతులు జామ, నిమ్మ తదితర పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రతికూల వాతావరణమే కాక చీడపీడల ఉద్ధృతీ మామిడి దిగుబడిని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండడంలేదని రైతులు వాపోతున్నారు. అప్పులు ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

Related Posts