YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విదేశీయం

చైనాపై సెనెట్ కొరడా

చైనాపై సెనెట్ కొరడా

చైనాపై సెనెట్ కొరడా
న్యూయార్క్, మే 23,
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంతపనీ చేశారు. గత కొన్ని వారాలుగా కరోనా వైరస్ సంబంధిత సమాచారంపై చైనా ఉద్దేశపూర్వక నిర్లక్ష్య ధోరణిపట్ల తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ వస్తున్న ట్రంప్ అమెరికాలోని చైనా కంపెనీలకు చుక్కలు కనబడే నిర్ణయానికి ఆమోదముద్ర వేయించుకున్నారు. చైనా దిగ్గజ కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్చేంజీల నుంచి తొలగించే తీర్మానానికి సెనేట్ ఆమోద ముద్రవేయడం ట్రంప్‌కు ఘనవిజయంగా భావిస్తున్నారు. పైగా మూడున్నర దశాబ్దాల తర్వాత చైనా విద్యార్థులు అమెరికాలో చదువుకునే, పరిశోధించే అవకాశాలను గణనీయంగా తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూండటంతో అమెరికా చైనా సంబంధాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్‌ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను తగ్గించేలా బిల్లును రూపొందించింది. చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కీలక బిల్లును ఆమోదింపచేసింది.
రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ సెనేటర్లు జాన్‌ కెన్నెడీ, క్రిస్‌ వాన్‌ హాలెన్‌ ప్రతిపాదించిన బిల్లును యూఎస్‌ సెనేట్‌ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో కుమ్మరించడం పట్ల చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్‌ ఫండ్‌లు, విద్యా సంస్ధల నిధులను సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా కంపెనీలను టార్గెట్‌గా చేసుకున్న ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలను చూస్తే.. విదేశీ ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడం లేదని కంపెనీలు స్పష్టం చేయని పక్షంలో వరుసగా మూడేళ్లు కంపెనీ ఆడిటింగ్‌ను పబ్లిక్‌ కంపెనీ అకౌంటింగ్‌ పర్యవేక్షక బోర్డు ఆడిట్‌ చేయకుండా, ఆయా కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజ్‌ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. కాగా, నియమాలకు అనుగుణంగా చైనా నడుచుకోవాలని తాను కోరుకుంటున్నానని సెనేట్‌లో బిల్లును ప్రతిపాదిస్తూ కెన్నెడీ పేర్కొన్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయిన కంపెనీలన్నీ ఒకే ప్రమాణాలను కలిగిఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్‌ వాన్‌ హోలెన్‌ అన్నారు.చైనా కంపెనీలపై కొరడా ఝళిపించే బిల్లును తీసుకురావడంతో జాక్‌మాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ నుంచి సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌ వంటి పలు చైనా కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు విఘాతం కలిగింది. ఈ బిల్లుతో రానున్న రోజుల్లో అమెరికన్‌ స్టాక్‌ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయిన చైనా కంపెనీలన్నింటికీ ఇబ్బందులు తప్పవని బీజింగ్‌కు చెందిన స్టాక్‌మార్కెట్‌ నిపుణులు, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ హల్క్స్‌ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న చైనా ఆడిటర్స్‌పైనా బిల్లు ప్రభావం చూపనుంది.ఇక అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల నుంచి కరోనా మహమ్మారిపై ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసికొట్టిన నేపథ్యంలో డ్రాగన్‌ కంపెనీలను టార్గెట్‌ చేస్తూ అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం.
చైనా విద్యార్థులు, పరిశోధకులు అమెరికాలో ఉన్నతవిద్యారంగంలో సులభంగా ప్రవేశిస్తూండటాన్ని రిపబ్లికన్ అతివాద నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాలను అమెరికా స్టెమ్ పేరుతో వ్యవహరిస్తుంటారు. లక్షలాది చైనా విద్యార్థులు గత మూడున్నర దశాబ్దాలుగా ఈ కోర్సులలో అధిక స్థానాలను సాధించి మాతృదేశానికి ఎనలేని ప్రయోజనం కలిగించారు. పైగా అమరికాలో చదువుకుంటూ అక్కడి ముఖ్యమైన శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని దొంగిలించి, నిఘా చర్యలకు కూడా పాల్పడుతున్నారని చైనా విద్యార్థులపై రిపబ్లికన్లు చాలాకాలంగా మండిపడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ చైనాపై కఠిన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో అమెరికాలోని 4 లక్షలమంది చైనా విద్యార్థులు, పరిశోధకులు మాతృదేశానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.అదేసమయంలో అమెరికాలో చదువుకోసం వస్తున్న భారత విద్యార్థులకు తాము సాదరస్వాగతం పలుకుతామని అమెరికా నేతలు ప్రకటిస్తున్నారు. గత సంవత్సరం 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా కాలేజీల్లో సీట్లు సాధించి ప్రథమ స్థానం పొందారు. కరోనా నేపథ్యంలో అనిశ్చితి, ఆందోళన ఏర్పడినప్పటికీ అమెరికాలో భారత విద్యార్థుల విద్యావకాశాలకు కొరత ఉండదని రిపబ్లికన్లు చెబుతుండటం గమనార్హం

Related Posts