YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సంక్షేమమే... తారక మంత్రమా...

సంక్షేమమే... తారక మంత్రమా...

సంక్షేమమే... తారక మంత్రమా...
విజయవాడ, మే 23,
జగన్ ఒక పధ్ధతి ప్రకారం తన పాలన సాగిస్తున్నారని చెప్పాలి. ఆయన అభివృధ్ధిని కాస్త వెనక్కి పెట్టి అయినా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు. సంక్షేమంతోనే తన రాజకీయ జీవితానికి క్షేమమని, అదే శ్రీరామరక్ష అని కూడా భావిస్తున్నారు. అందుకే కరోనా వచ్చినా, ఎటువంటి విపత్తు ఎదురైనా కూడా జగన్ అకుంఠిత దీక్షతో తాను అనుకున్న విధంగా పధకాలకే ఖజానా సొమ్ము తీసి ఖర్చు పెడుతున్నారు. ఇప్పటిదాకా జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు, జులైలో చేపట్టబోతున్న పట్టాల పంపిణీ మరో ఎత్తు అంటున్నారు. ఇది నిజంగా దేశంలోనే రికార్డు అంటున్నారు. ఇది కనుక విజయవంతంగా జగన్ చేపడితే మాత్రం ఏపీలో తిరుగులేని నేతగా జనం గుండెల్లో ఆయన శాశ్వతంగా ఉంటారని అంటున్నారు.నిజంగా దేశంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఇప్పటిదాకా చాలా చోట్ల జరుగుతూనే ఉంది. కానీ ఇపుడు జరిగేది మాత్రం దేశమంతా చూసేలా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఒక లక్ష రెండు లక్షలు కాదు, ఏకంగా పాతిక లక్షల ఇళ్ల పట్టాలకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. అంటే ఏపీలో మొత్తం కుటుంబాలు కోటీ 75 లక్షలు ఉంటే అందులో సగానికి పైగా కుటుంబాలకు భారీ లబ్ది అందించేలా ఈ పట్టాల పంపిణీ ఉండబోతోంది అన్న మాట. ఒక కుటుంబంలో కనీసం నలుగురు సభ్యులను వేసుకున్నా కోటి మందికి డైరెక్ట్ గా జగన్ లబ్ది అందబోతోంది అన్న మాట.కేవలం పట్టాలు ఇవ్వడమే కాదు వారికి నాలుగేళ్ళ కాల వ్యవధిలో ఇళ్ళు కూడా కట్టించి శాశ్వతమైన గూడుని అందించడం అంటే మాటలు కాదు, ఇదే కనుక జరిగితే ఏపీలో ఇళ్ళు లేని వారు అసలు ఉండరు. జగన్ సర్కార్ ఆలోచన కూడా అదే. తాను సీఎంగా ఉండగా ఇల్లు లేని నిరుపేదలు ఉండరాదు అన్నది సంకల్పంగా పెట్టుకుని ఇంత పెద్ద యాగానికి సిధ్ధపడుతున్నారు. ఇది జగన్ చేసి పట్టాలను పంచితే పేదలకు ఆయన ఆరాధ్య దేవుడిగా మిగిలిపోతారు. వారి జగన్ ఫోటోను ఇంట్లో పెట్టుకోవడమే కాదు, జగన్ కే ఎప్పటికీ ఓటు వేయడమూ ఖాయమే. ఎందుకంటే వారికి రుణం తీర్చుకునే అవకాశం అదొక్కటే కాబట్టి.ఏపీలో రాజకీయం చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కంటే దీటుగా, దూకుడుగా జగన్ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. ఇపుడు ఇళ్ల పట్టాలు ఇచ్చి పాతిక లక్షల ఇళ్ళు కట్టిస్తే ప్రతిపక్షాలు పూర్తిగా కొట్టుకుపోవడం ఖాయమన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఏపీలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్ల షేర్ ని దక్కించుకున్న జగన్ 2024లో దాని మరింతగా పెంచుకోవాలని, విపక్షాన్ని నామమాత్రం చేయాలని ఆలోచనలతో ఉన్నారు. అందుకే ఆయన ప్రతీ ఒక్క స్కీం ని తన మానస పుత్రికగా భావించి జనాలకు చేరుస్తున్నాడు. ఇపుడు ఇళ్ల పట్టాల పంపిణీ జగన్ కి బాగా ఇష్టమైన పధకం. అందుకే తన తండ్రి వైఎస్సార్ జయంతి వేళ ఈ పధకాన్ని ఆయన శ్రీకారం చుడుతున్నారు. ప్రతీ జిల్లాలో ఖాళీగా ఉన్న స్థలాలన్నీ పేదలు పంచడం ద్వారా కొత్త రకం రాజకీయానికి, సంక్షేమ రాష్ట్రానికి జగన్ తెర తీయనున్నారు.

Related Posts