YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇసుక దోపిడీ

ఇసుక దోపిడీ

ఇసుక దోపిడీ
ఏలూరు, జూన్ 17
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఉండి, నరసాపురం, చేబ్రోలు, ఐ.పంగిడి మొత్తం ఏడు ఇసుక స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. 15 ఓపెన్‌ ర్యాంపులు ఉండగా, ఎనిమిది చోట్ల తవ్వకాలు సాగుతున్నాయి. గోదావరి లోపలికి వెళ్లి తవ్వి తెచ్చే ర్యాంపులు 27 ఉండగా 24 పని చేస్తున్నాయి. ప్రతిరోజూ 20 వేల టన్నుల వరకూ ఇసుక తవ్వకం సాగుతోంది. అయితే జనాలకు ఇసుక కష్టాలు మాత్రం తీరడం లేదు. అంతేకాకుండా ఇసుక సరఫరాలో ప్రభుత్వం తెచ్చిన మార్పులతో జనం లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకూ చెల్లించిన ధరకు, ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకు అసలు సంబంధం లేని పరిస్థితి ఏర్పడింది. అదేమంటే స్టాక్‌పాయింట్‌కు చేరవేసిన రవాణా ఛార్జీ సైతం వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం 18 టన్నులు ఇసుక బుక్‌ చేసుకుంటే.. టన్నుకు రూ.375 చొప్పున రూ.6,943, రవాణా ఛార్జీ కింద రూ.6,750 మొత్తం రూ.13,693 చెల్లించాడు. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి మరో వ్యక్తి 18 టన్నుల ఇసుక బుక్‌ చేసుకుంటే ఇసుక ఖరీదు రూ.6,750, హ్యాండ్లింగ్‌, రీచ్‌ డిపో ఛార్జీల కింద రూ.4,950, ఇంటికి చేర్చిన రవాణా ఛార్జీ కింద రూ.6,043 మొత్తం రూ.17,743 ఇవ్వాల్సి వస్తోంది. ఒక్కసారిగా 18 టన్నుల ఇసుకకు రూ.నాలుగు వేలకుపైగా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది టన్నుల ఇసుక బుక్‌ చేసుకున్నా గతంలో ధర కంటే రూ.నాలుగు వేలు అదనంగా అవుతోంది. దీంతో అంతా లబోదిబోమంటున్నారు.ఏ ర్యాంపు ఇసుకో తెలియని అయోమయంగతంలో ఇసుక బుక్‌ చేసుకునేటప్పుడు ఆన్‌లైన్‌లో జిల్లాలోని ఇసుక ర్యాంపుల వివరాలు కనిపించేవి. దీంతో ఇసుక కావాల్సిన వారు తమకు నచ్చిన ర్యాంపులో ఇసుక బుక్‌ చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం లేకుండాపోయింది. ఆన్‌లైన్‌లో ఇసుక ర్యాంపుల వివరాలు పూర్తిగా తొలగించేశారు. ఎంత ఇసుక కావాలి, ఎక్కడకు చేరాలి, నియోజకవర్గం వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏ ర్యాంపులో ఇసుక వస్తుందో.. ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో కొవ్వూరు, తాళ్లపూడితోపాటు సిద్ధాంతం వంటి ర్యాంపుల్లో ఇసుకపై జనం ఎక్కువ మొగ్గు చూపుతారు. నాణ్యతతోపాటు నిర్మాణానికి బాగుంటుందని భావిస్తారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండాపోయింది. ఇసుక ఇంటికి చేరిన తర్వాత చూస్తే నాణ్యత లేకపోవడంతో అంతా లబోదిబోమంటున్నారు. బంగారం ఖరీదు కంటే ఇసుక ఖరీదే ఎక్కువగా ఉందని జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో నిర్మాణ పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇసుక సరఫరా బాధ్యతను గ్రామ సచివాలయాలకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అదింకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అయినప్పటికీ స్టాక్‌పాయింట్ల పేరుతో ఇంత పెద్దఎత్తున ఇసుక ధర పెంచితే పరిస్థితి ఏమిటనే చర్చ సర్వత్రా సాగుతోంది. అంతేకాకుండా ఇసుక బుక్‌ చేస్తే 72 గంటల్లో ఇంటికి చేరే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేశారని, పది రోజులైనా ఇసుక చేరడం లేదని అంతా తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఇసుక సరఫరాలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇసుక ధర ఆకాశాన్ని తాకడంతో జనాలకు ఏంచేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. స్టాక్‌ పాయింట్‌కు చేర్చిన ఛార్జీ కొనుగోలుదారులే చెల్లించాలని మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇసుక పేరు చెబితే సామాన్యులు వణికిపోతున్న పరిస్థితి ఏర్పడింది.

Related Posts