YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 40 శాతానికి పరిమితమైన ఓఆర్

 40 శాతానికి పరిమితమైన ఓఆర్

 40 శాతానికి పరిమితమైన ఓఆర్
హైద్రాబాద్, జూన్ 19
టీఎస్‌ఆర్టీసీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, యాజమాన్యం తీరు మాత్రం మారట్లేదు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. తిరిగి మళ్లీ బస్సులు రోడ్డు ఎక్కే సమయానికి లాక్‌డౌన్‌ గండం వచ్చిపడింది. రెండు నెలలు బస్సులన్నీ మళ్లీ డిపోలకే పరిమితమయ్యాయి. వాస్తవానికి టీఎస్‌ఆర్టీసీ బస్సులు రోజుకు 18 లక్షల కిలోమీటర్లు తిరిగితే, ఆదాయం రూ.3.5 కోట్లు వస్తుంది. కానీ కరోనా భయాందోళనల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య 40 శాతానికి తగ్గింది. ప్రస్తుతం అంతర్‌ జిల్లా సర్వీసులు మాత్రమే తిరుగుతున్నాయి. పొరుగురాష్ట్రాలకు బస్సుల్ని తిప్పడంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ బస్సుల్ని తెలంగాణలోకి అనుమతించాలంటూ ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాసారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ నుంచి హైదరాబాద్‌కే ఎక్కువగా బస్సులు వస్తుంటాయి. కానీ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.జిల్లా సర్వీసుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 40 శాతం లోపే ఉంది. కోవిడ్‌-19 అమల్లో భాగంగా ఒక్కో బస్సులో కేవలం 20-25 మంది ప్రయాణికుల్ని మాత్రమే అనుమతిస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ డైరెక్టర్‌ ఒకరు తెలిపారు. కానీ ఇక్కడ కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రయివేటు మంత్రాన్నే జపిస్తుండటాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా సర్వీసులుగా తిరుగుతున్న బస్సుల్లో 50 శాతానికి పైగా అద్దె బస్సుల్నే తిప్పుతున్నారు. ఆర్టీసీ సొంత బస్సుల్ని డిపోలకే పరిమితం చేస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి రావల్సిన ఆదాయం అద్దె బస్సుల యాజమాన్యాలను పోషించడానికే సరిపోతున్నది. పైపెచ్చు డీజిల్‌ ధరలు పెరిగిన ప్రతిసారీ, ఆ వ్యత్యాసాన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సుల యాజమాన్యాలకు చెల్లిస్తున్నది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు మాత్రం ఈ వెసులుబాటు కల్పించలేదు. దీనివల్ల సంస్థకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోతున్నదిప్రయాణికులు కూడా అత్యవసరం అయితే తప్ప ఆర్టీసీ బస్సు ఎక్కట్లేదు. కనెక్టివిటీ ప్రయాణాలు లేకపోవడం కూడా ఓఆర్‌ తగ్గడానికి మరో కారణంగా కనిపిస్తున్నది. మరికొన్ని ప్రాంతాల్లో కోవిడ్‌-19 అమలు గురించి అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇటీవల వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న 50 సీట్ల సామర్ధ్యం ఉన్న చివరి బస్సులో 120 మంది ప్రయాణికులు ఎక్కారు. కండక్టర్‌ ఎంత వారించినా ప్రయాణికులు వినలేదు. తప్పనిసరై అలాగే వెళ్తున్న బస్సును చూసి, కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బస్సును ఆపి, డిపో మేనేజర్‌తో మాట్లాడి మరో బస్సును ఏర్పాటు చేశారు. రద్దీ రూట్లలో బస్సుల సంఖ్యను కుదించి, ఆదాయం కోసం కొందరు డిపోమేనేజర్లు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు రద్దీలేకుంటే రాత్రి ఏడు దాటితే బస్సు సర్వీసుల్ని రద్దు చేస్తున్నారు. 20 మందికంటే ఎక్కువ మంది ప్రయాణీకులు ఉంటేనే బస్సును ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. దీనితో ఉన్న ప్రయాణికులు ఇంకా ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూపులు చూడాల్సి వస్తున్నది.ఈ సమయంలో పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం ఓఆర్‌ పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. గతంలో 40-60 శాతం వరకు ఉండే ఓఆర్‌ ఇప్పుడు కొన్ని రూట్లు మినహాయిస్తే, మిగిలిన రూట్లలో వందశాతం ఓఆర్‌తో నడుస్తున్నాయి. 3,600 రూట్ల ద్వారా 77 శాతం ఓఆర్‌తో రోజుకు దాదాపు కోటిమంది ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగానే ఉంది.ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కానీ కొన్ని ప్రధాన రూట్లలో ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని కల్పించలేదు. బస్సుల్లో కండక్టర్‌ వద్దే తీసుకోమ్మనమని చెప్తున్నారు. విజయవాడ రూట్‌లో ఎలాంటి అన్‌లైన్‌ టిక్కెట్లు అందుబాటులో లేవని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ వంటి దూరప్రాంతాలకే ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని అమలు చేస్తున్నారు. 200 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు అన్‌లైన్‌ లేదు. ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయికి చాలా తేడా ఉంది. అధికారుల మాటలు నమ్మి బస్టాండుకు వెళ్తే...ప్రయాణీకులకు అప్పుడుకానీ తత్వం బోధపడట్లేదు. బస్సు ఉంటుందో లేదో అనే డైలమాలో పడాల్సి వస్తున్నది.

Related Posts