YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇండస్ట్రీస్ రీ లోకేషన్  చేయండి

ఇండస్ట్రీస్ రీ లోకేషన్  చేయండి

ఇండస్ట్రీస్ రీ లోకేషన్  చేయండి
విశాఖపట్టణం, జూన్ 23,
ఎల్‌.జి.పాలిమర్స్‌ నుంచి  నెల ఏడున లీకైన స్టైరీన్‌ విషవాయువు ఘటనానంతరం విశాఖ జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమలపై నిఘా పెరిగింది. విశాఖలోని 20 పరిశ్రమలపై జరిపిన అధ్యయన నివేదికను నిపుణుల బృందం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. హెచ్‌పిసిఎల్‌, దీనికి అనుబంధంగా నాలుగు ప్రాంతాల్లో ఉన్న పెట్రో ఉత్పత్తుల పరిశ్రమలపై నిపుణుల బృందం ఇప్పటికే అధ్యయనం చేసింది. కోరమాండల్‌, ఐఒసిఎల్‌, హెచ్‌పిసిఎల్‌ (వైట్‌ ఆయిల్‌), హెచ్‌పిసిఎల్‌ (బ్లాక్‌ ఆయిల్‌), హెచ్‌పిసిఎల్‌ విస్తరణ ప్రాజెక్టు, ఎన్‌టిపిసి, దివీస్‌, హిందూజా, మానుఫ్యాక్చరింగ్‌ స్టోరేజ్‌ ఇంపోర్ట్‌ ఆఫ్‌ హజార్డస్‌/కెమికల్స్‌ (ఎంఎస్‌ఐఐహెచ్‌) స్టోరేజీ పాయింట్లను ప్రముఖంగా నిపుణుల బృందం అధ్యయనం చేసి నివేదిక అందజేసింది. జనావాసాల మధ్య కోరమాండల్‌, హెచ్‌పిసిఎల్‌ ఉన్నాయని, హెచ్‌పిసిఎల్‌ డబుల్‌ విస్తరణ దిశగా వెళ్తోందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే, విశాఖకు గొప్ప పేరు ఆ ఇండిస్టీస్‌ వల్లనే వచ్చిందని వివరించారు.కొన్ని పరిశ్రమలను జనావాసాల మధ్య నుంచి తరలించేందుకు (రీ-లొకేషన్‌ ఆఫ్‌ ఇండిస్టీ) ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాకాని పక్షంలో కఠిన నిబంధనలను ఫార్మా, కెమికల్‌ ఇండిస్టీ, స్టోరేజీ పాయింట్ల వద్ద అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండు అంశాలపై పరిశ్రమ వర్గాలు, జిల్లా అధికార యంత్రాంగంతో ఈ నెల 30లోగా సమావేశం నిర్వహించడానికి రాష్ట్ర ఇండిస్టీ చీఫ్‌ కమిషనర్‌ కరికల్‌ వలెవన్‌ విశాఖ రానున్నారు. ఆ తర్వాత కార్యాచరణ (యాక్షన్‌ ప్లాన్‌) సిద్ధం చేయనున్నారు. విశాఖలో ప్రధానంగా జివిఎంసి, విఎంఆర్‌డిఎ పరిధిలోని 'రెడ్‌ కేటగిరి' పరిశ్రమలపై దృష్టి పెట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం ఎల్‌జి పాలిమర్స్‌లో మాత్రం పరిశీలన చేయలేదు. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కమిటీలు వేసినందున ఎల్‌జి మినహా జిల్లాలో పలు కంపెనీలకు ఈ బృంద సభ్యులు వెళ్లారు. ఎయిర్‌ పోర్టు వద్దగల ఎల్‌.జి.పాలిమర్స్‌ స్టైరీన్‌ స్టోరేజీ పాయింట్‌ను మాత్రం పరిశీలించినట్లు సమాచారం.జిల్లాలో 140 భారీ పరిశ్రమలు, 28 వేల వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. సుమారు మూడు లక్షల మంది శ్రామికులు (వర్క్‌ ఫోర్స్‌) ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. దీంట్లో, భారీ ప్రభుత్వరంగ పరిశ్రమల్లో లక్షమంది ఉండగా, మిగతా పరిశ్రమల్లు రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందే ప్రపంచ మార్కెట్‌ సంక్షోభానికి గురైందని, దీనికి తోడు కోవిడ్‌-19తో ఇది మరింత తీవ్రమైందని జిల్లా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. విశాఖ జిల్లాలో ఏటా (12 నెలలకు) పారిశ్రామిక ఉత్పత్తి గ్రాస్‌ వేల్యూ ఎడిషన్‌ (జివిఎ) రూ.28 వేల కోట్లు. తాజాగా రూ.5 వేల కోట్ల వరకూ నష్టం ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చిందని జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి షట్‌డౌన్‌ కావడం, హెచ్‌పిసిఎల్‌ విస్తరణ నిల్చిపోవడం, నావల్‌ ఆర్మ్డ్‌ ఆపరేషనల్‌ బేస్‌ (ఎన్‌ఎఒబి), సెయింట్‌ గోబెయిన్‌ (అచ్యుతాపురం)లో పనులు ఆగిపోవడం ఈ నష్టానికి ప్రధాన కారణమని జిల్లా పరిశ్రమ శాఖ తాజాగా నివేదికను తయారు చేసింది. దీనివల్ల హెచ్‌పిసిఎల్‌లో పది వేల మంది కార్మికులు, నావల్‌ ఆర్మ్డ్‌ ఆపరేషనల్‌ బేస్‌ (ఎన్‌ఎఒబి)లో ఆరు వేల మంది, సెయింట్‌ గోబెయిన్‌ (అచ్యుతాపురం)లో 1500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయాయి. పనిలేకపోవడంతో కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.

Related Posts