YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

పవన్ తో సఖ్యతకే టీఆర్ఎస్ మొగ్గు..

 పవన్ తో సఖ్యతకే టీఆర్ఎస్ మొగ్గు..

. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన బలం పరిమితం అయినా కూడా వచ్చే  ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేస్తే ఎంతో కొంత ప్రభావం చూపించటం మాత్రం ఖాయం. ఈ విషయం తెలుసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పవన్ తో సఖ్యతకే మొగ్గుచూపుతోంది. దీనికి తోడు పవన్ తో జట్టుకడితే ఓ సినీ గ్లామర్ కూడా ఉన్నట్లు అవుతుందని యోచిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కెసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్ కూడా పవన్ విషయంలో ‘సాఫ్ట్’ ధోరణితోనే ముందుకు సాగుతున్నారు. గతంలో పవన్ పై కెసీఆర్, కవితలు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర  ఓట్లు కీలకం అయినందున పవన్ తో పొత్తు వల్ల ఎంతో కొంత ప్రయోజనం పొందవచ్చని..ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా పవన్ వల్ల ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఓ పది సీట్ల వరకూ కోరవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఎలాగూ పవన్ ఏపీలోనూ మొత్తం సీట్లలో పోటీచేసే పరిస్థితి కన్పించటం లేదు. పవన్ కోరుతున్న సీట్లలో హైదరాబాద్ లోని సనత్ నగర్ సీటు ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పోలండ్ రాయభారి ఆడమ్ బురాకోవస్కీ తోపాటు ఆ దేశ బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. అసలు ఇఫ్పటివరకూ పెద్దగా ఎలాంటి నిర్ధిష్ట కార్యకలాపాలు ప్రారంభించని జనసేన అధినేతతో పోలండ్ రాయభారి, ఆ దేశ బృందం భేటీ అవ్వటం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయీంశంగా మారింది. ఈ భేటీని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించిన వారిలో  వరంగల్ కు చెందిన రాజు రవితేజ ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జనసేన పార్టీలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే జనసేన కోరుతున్నట్లు టీఆర్ఎస్ పది సీట్లు కేటాయిస్తుందా? లేక ఏమైనా కోత పెడుతుందా? అన్న విషయం తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. టీఆర్ఎస్ తో జనసేన దగ్గరవుతున్న విషయాన్ని  గుర్తించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే ఎటాక్ ప్రారంభించింది.

Related Posts