YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

సీఏ విభిన్నమైనది...

సీఏ విభిన్నమైనది...

మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న ప్రైవేటు ట్రావెల్స్‌లో డ్రైవర్‌. పదో తరగతిలో ఉన్నపుడు మొట్టమొదటిసారిగా సీఏ కోర్సు గురించి విన్నాను. విజయవాడలో నేను చదివిన గౌతం పబ్లిక్‌ స్కూల్లో ఓ కార్యక్రమం నిర్వహించి ఈ కోర్సు గురించి వివరించారు. సమాజం గౌరవించే వృత్తుల్లో సీఏ ఒకటనీ; అవకాశాలూ, ఎదుగుదల విషయంలో ఎదురుండదనీ తెలుసుకున్నపుడు ఆసక్తి కలిగింది. తరగతి గది బోధనకే పరిమితం కాకుండా ఆర్టికల్‌షిప్‌ ద్వారా పొందే మూడేళ్ళ ప్రాక్టికల్‌ అనుభవం కుతూహలాన్ని పెంచింది. దీంతో మ్యాథ్స్‌, సైన్స్‌ సంబంధిత కోర్సులు నా గమ్యం కావనుకున్నాను.

కెరియర్‌లో దూసుకెళ్లడానికి సీఏ విభిన్నమైన మార్గమనిపించింది. టెన్త్‌ తర్వాత ఐఐటీ శిక్షణలో చేరాలని అమ్మానాన్న, ఉపాధ్యాయులూ ఆశించారు. కానీ భిన్నంగా, మిగతా కోర్సులకంటే కష్టమని చాలామంది భావించే సీఏనే ఎంచుకున్నాను. అందుకే సీఏ పునాది పటిష్ఠంగా ఉండటం కోసం విజయవాడ శ్రీ మేధావి జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ఎంఈసీ గ్రూపులో చేరాను. అక్కడే సీపీటీ, ఇంటర్‌లకు శిక్షణ పొందాను. 
సీఏ-సీపీటీలో 91 శాతం మార్కులూ, సీఏ ఇంటర్లో 70.43 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాను. సీఏ ఇంటర్‌ పరీక్షల కోసం సీఏ సంస్థ అయిన ఐసీఏఐ వారి మెటీరియల్‌ చదివాను. కోచింగ్‌ సంస్థ అందించిన నోట్సు, మెటీరియల్‌ను కూడా ఉపయోగించుకున్నా. మూడు నెలల సమగ్ర రివిజన్‌, ఆ సమయంలో ఇంటి దగ్గర రాసిన సెల్ఫ్‌ టెస్టుల ఫలితంగా మంచి మార్కులు పొందాను.

చివరకు ఫైనల్‌..! 
సీఏ-ఇంటర్‌ ఫలితాల ప్రకటన తర్వాత 2014 అక్టోబరులో విజయవాడలోని ఆడిట్‌ సంస్థ అయిన ఎం/ఎస్‌ ఎంఎన్‌రావు అండ్‌ అసోసియేట్స్‌, సీఏస్‌ దగ్గర ఆర్టికల్‌షిప్‌ శిక్షణలో చేరాను. నా గురువైన సీఏ తుమ్మల శివరామమోహనరావు గారు నన్నెంతో ప్రోత్సహించారు. అత్యుత్తమ ర్యాంకు కొట్టాలనే ప్రేరణ కలిగించారు. నాకు నిర్దేశించిన ప్రతి టాస్కునూ సమర్థంగా పూర్తిచేయగలిగాను. ఆర్టికల్‌షిప్‌ 2017 అక్టోబర్‌లో పూర్తయింది. ఆర్టికల్‌షిప్‌లో ఉండగా.. నిబంధనల ప్రకారం ఏప్రిల్‌ మధ్యకాలం నుంచి అక్టోబరు వరకూ ఆరునెలల పరీక్షల ప్రిపరేషన్‌ సెలవు తీసుకున్నాను. ఫైనల్‌ పరీక్షను తర్వాతి నెల్లోనే రాశాను. తొలి ప్రయత్నంలోనే అఖిలభారత స్థాయిలో నాలుగో ర్యాంకు పొందాను.

సొంతంగా అధ్యయనం.. 
ఆర్టికల్‌షిప్‌లో ఉన్నప్పుడు ఏ కోచింగ్‌ తరగతులకూ హాజరుకాకుండా ఐసీఏఐ మెటీరియల్‌లో  సాధ్యమైనన్ని సబ్జెక్టులను సొంతంగా చదవాలని నిశ్చయించుకున్నాను. సీఏ దూరవిద్యాకోర్సు కాబట్టి... తాజా అమెండ్‌మెంట్లు, కొత్త చట్టాల పరిజ్ఞానం సీఏ అర్హత వచ్చాక కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిందే. ఇలాంటివాటికి కోచింగ్‌ ఏముంటుంది!

ఎనిమిది సబ్జెక్టుల్లో ఐదింటి తొలి విడత అధ్యయనాన్ని ప్రిపరేషన్‌ సెలవులకు ముందే ముగించాను. మిగిలినవాటిని రెండు నెలల్లో పూర్తిచేశాను. అదే సమయంలో ఇగ్నో బీకాం పరీక్షలు కూడా రాసి, మొదటి ప్రయత్నంలోనే పాసయ్యాను. అన్ని 8 సబ్జెక్టుల పునశ్చరణకు (రివిజన్‌) నాలుగు నెలల సమయం ఉందప్పుడు. మొదటి రివిజన్‌ సమయంలో తయారుచేసుకున్న షార్ట్‌ నోట్్స, ఫ్లో చార్టులు స్వల్పసమయంలోనే తుది రివిజన్‌ పూర్తవటానికి ఉపయోగపడ్డాయి.

రివిజన్‌ షెడ్యూల్‌ ప్రణాళికలో, జవాబుల మూల్యాంకనంలో, తగిన సూచనలు ఇస్తూ ముందుకునడపటంలో నా గురువు చేసిన సాయం ఎంతో ఉంది! మూడువిడతల సమగ్ర పునశ్చరణా, రెండు సెట్ల మాక్‌ టెస్టులూ పూర్తిచేశాను. ఆర్టికల్‌షిప్‌ సమయంలో రోజుకు రెండేసి గంటల చొప్పున చదివినా, ప్రిపరేషన్‌ సెలవుల్లో మాత్రం రోజుకు 8 నుంచి 10 గంటలపాటు సన్నద్ధమయ్యాను. మొత్తం సన్నద్ధత, రివిజన్‌ షెడ్యూల్‌ సకాలంలో సమర్థంగా పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకున్నాను. ఆలిండియా ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికను అమలుచేశాను.ఆశించిన ఫలితం వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో చదివాను.

సీఏ ఫైనల్‌ కోసం ఐసీఏఐ అకడమిక్‌ ఇన్‌పుట్స్‌ మొత్తం (స్టడీమెటీరియల్‌, ప్రాక్టీస్‌ మాన్యువల్స్‌, రివిజన్‌ టెస్ట్‌ పేపర్లు, సజెస్టెడ్‌ ఆన్సర్స్‌ ఫర్‌ ప్రీవియస్‌ ఎగ్జామ్‌ పేపర్లు, మాక్‌ టెస్ట్‌ పేపర్లు అండ్‌ కాప్స్యూల్స్‌) చదివాను.

సీఏగా సమాజంలో మంచి పేరు తెచ్చుకుని, ప్రాక్టీసుకు అవసరమైన అన్నిరకాల నైపుణ్యాలూ నేర్చుకోవటం నా లక్ష్యం. ఫోరెన్సిక్‌ ఆడిట్‌, జీఎస్‌టీ అండ్‌ బ్యాంక్‌ ఆడిట్స్‌లో పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ కోర్సులు చేయాలని భావిస్తున్నాను.

సీఏ అభ్యర్థులకు నా సూచనలు 
నీ గణనీయ ఎదుగుదల, అవకాశాలను అందించే మంచి కోర్సుల్లో సీఏ ఒకటి. నిజమైన ఆసక్తి ఉంటేనే ఈ కెరియర్‌ను ఎంచుకోండి. నీ సీఏ కోర్సులో ఆర్టికల్‌షిప్‌ చాలా ప్రాముఖ్యమైంది. విద్యార్థి సీఏ ప్రొఫెషనల్‌గా మారేది ఈ దశలోనే! దీన్ని సమర్థంగా చేస్తే అది ఫైనల్‌ సన్నద్ధతకూ, తర్వాత వృత్తిపరంగా ఉపకరిస్తుంది. నీ ఫైనల్‌ కోసం ముందస్తు ప్రణాళిక వేసుకోవాలి. ఆర్టికల్‌షిప్‌ సమయంలోనే వీలైనన్ని  సబ్జెక్టులను చదివితే, సెలవులను సమగ్ర రివిజన్‌కు సమర్థంగా వినియోగించుకోవచ్చు. నీ వేసుకున్న ప్రణాళికను అమలుచేయటానికి పూర్తిగా కృషి చేయాలి. నీ అనుకున్న ర్యాంకును సాధిస్తామనే ఆత్మవిశ్వాసం చివరిదాకా నిలుపుకోవాలి.

Related Posts