YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

కరోనా భయంతోనే క్లాసులు

కరోనా భయంతోనే క్లాసులు

జిల్లాలో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం స్కూళ్లు ప్రారంభించినా పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకపోవడం కూడా కారణంగా చెప్పొచ్చు. స్కూళ్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ వంటివి ఎక్కడా కానరాని పరిస్థితి నెలకొంది. స్కూళ్లు శుభ్రపరిచే సమయంలోనే ఎటువంటి జాగ్రత్తలూ లేవు. కేవలం సాధారణ రోజుల్లో శుభ్రం చేసినట్లు మాత్రమే చేశారు. కేవలం స్కూళ్లకు వెళ్లే దారుల్లో బ్లీచింగ్‌ చల్లి మమ అనిపించారు. దీంతో ఏదైనా తేడా వస్తే ఏమిటనే పరిస్థితి తల్లిదండ్రులను వెంటాడుతోంది. దీంతో రెండురోజులుగా స్కూళ్లు నడుస్తున్నా 20 శాతం మంది విద్యార్థులు కూడా హాజరుకాని దుస్థితి నెలకొంది. తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్‌, డిగ్రీ వరకూ విద్యాసంస్థలన్నీ తెరుచుకున్నా రోజువారీ హాజరు 20 నుంచి 25శాతం మాత్రమే ఉంటుంది. 9, 10 తరగతులకు రోజువిడిచి రోజు క్లాసులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే రెండు తరగతులకూ ప్రతిరోజూ మధ్యాహ్నం వరకూ తరగతులు నిర్వహించాలని అనధికారికంగా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీఅయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు సైతం భయపడుతున్న పరిస్థితి నెలకొంది. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు సైతం మధ్యాహ్న భోజనం తినేందుకు ఇష్టపడటం లేదు. దీనికితోడు ఏలూరు, నల్లజర్ల పరిసర ప్రాంతాల స్కూళ్లకు భోజనం అందించాల్సిన ఏక్తాశక్తి ఫౌండేషన్‌ ముఖం చాటేయడంతో ప్రదానోపాధ్యాయులు వంటమ్మలను బతిమాలి మధ్యాహ్న భోజనం పెట్టిస్తున్న పరిస్థితి ఉంది. ఇంటికి వెళ్లిపోతున్న పరిస్థితి కొనసాగుతోంది. స్కూల్‌ వద్ద ఒక శానిటైజర్‌ బాటిల్‌ పెట్టడం మినహా ఎటువంటి జాగ్రత్తలూ కానరాకుండాపోయాయి. కరోనా టెస్టులుసైతం జిల్లాలో కేవలం 60 శాతం మంది విద్యార్థులకే జరిగాయి. అది కేవలం ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికే. ఇప్పుడు పరీక్షలు చేయించుకోని విద్యార్థులు సైతం వస్తున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన విద్యార్ధులకు సైతం ప్రత్యేకంగా వైద్య సేవలు వంటివి ఏమీ అందడం లేదు. ఇంటి దగ్గరే సొంతంగా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. జిల్లాలో ప్రతిరోజూ దాదాపు 500 కేసులు నమోదవుతున్నాయి. మూడు వేలకుపైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు జరగడం లేదు. కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు అనేది దాదాపుగా కనుమరుగైపోయింది. కంటైన్‌మెంట్‌ జోన్లు లేకపోవడంతో ఇంట్లో ఒకరు కరోనాతో బాధపడుతున్నా ఆ ఇంటికి సంబంధించిన సభ్యులు బయట తమ పనులు కొనసాగిస్తున్నారు. ఈ కారణంగానే జిల్లాలో కరోనా ఉధృతి ఎక్కువగా కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇంట్లో కరోనా బాధితులు ఉన్నా ఆ ఇంటికి సంబంధించిన విద్యార్థులు స్కూల్‌కు హాజరయ్యే పరిస్థితి ఉంది. దీంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలో శ్రీ చైతన్య వంటి సంస్థలు ఇంకా స్కూళ్లు తెరవలేదు. కొన్ని ప్రయివేటు స్కూళ్లు తెరిచినా హాజరు 30 శాతం మాత్రమే ఉంటున్నట్లు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం స్కూల్‌ బస్సులు తిప్పేందుకు యాజమాన్యాలు జంకుతున్నాయి. బస్సులో పిల్లలను భౌతిక దూరం పాటించేలా అదుపు చేయడం కష్టమని భావిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెద్దగా ఉండటం లేదు. తెరిచిన ప్రయివేటు స్కూళ్లలో సైతం కోవిడ్‌ నిబంధనలు పెద్దగా అమలుకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిపై డిఇఒ రేణుకను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.కార్పొరేట్‌ కాలేజీలతోపాటు పలు కాలేజీలు హాస్టల్‌తో కూడిన చదువులు చెబుతున్నాయి. వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నా స్పష్టమైన ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. ఆరో తేదీ నుంచి తమ పిలల్లను హాస్టళ్లకు పంపించాలని యాజమాన్యాలు ఫోన్లు చేస్తున్నాయి. మామూలుగానే స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ తరుణంలో హాస్టల్‌కు పంపాలంటే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. హాస్టల్‌లో ప్రతిగదిలోనూ 20 నుంచి 30 మంది ఉంటారు. మాస్క్‌, భౌతికదూరం వంటివి పాటించడం సాధ్యం కాదు. ఒక్కరికి తేడా వచ్చిన విద్యార్థులంతా ఇబ్బందిపడే పరిస్థితి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులకు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం హాస్టళ్లకు ఏవిధంగా అనుమతి ఇస్తుందని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రభుత్వం ఆలోచించకపోతే తీవ్ర ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.సమిశ్రగూడెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ప్రస్తుతం 25 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నారు. హైస్కూల్‌ విద్యార్థులు పక్క గ్రామాల నుంచి సైతం వస్తారు. కరోనా భయంతో తల్లిదండ్రులు పంపండం లేదు. పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.పది రోజులు చూసి పంపుదామని ఆలోచిస్తున్నామని పేరంట్స్ చెబుతున్నారు.

Related Posts