YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

చలితో కమ్మేస్తున్న కరోనా

చలితో కమ్మేస్తున్న కరోనా

హైదరాబాద్, నవంబర్ 21, 
అసలే కరోనా కాలం....మరో పక్క రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. దీంతో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు వాతావరణ పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారే అవకాశాలున్నట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చలికాలం అనేది వైరస్‌ల వృద్ధికి, వ్యాప్తికి అనుకూలమైనదని చెబుతున్నారు వైద్యులు. ఒక పక్క కరోనా పాండమిక్‌ కొనసాగుతుండడం, మరోపక్క ఉష్ణోగ్రతలు పడిపోతుండడం వల్ల స్వైన్‌ఫ్లూ వంటి వైరస్‌లు విజృంభించే అవకాశాలు లేకపోలేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రారంభంలో మర్కజ్‌కు సంబంధించిన కరోనా రోగుల్లో ఇద్దరికి కరోనాతో పాటు స్వైన్‌ఫ్లూ కూడా నిర్ధారణ జరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ ఆ కేసులను చాలా ప్రతిష్టాత్మకంగా ట్రీట్‌చేసి రోగులను రక్షించినట్లు వైద్యాధికారులు వివరించారు. ఒకే రోగికి  రెండు వైరస్‌లు సోకితే పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి ఇలా రెండు వైరస్‌లు వచ్చిన సందర్భాలున్నాయని అవికూడా మర్కజ్‌ కేసుల్లోనే కనిపించినట్లు వైద్యనిపుణులు తెలిపారు. స్వైన్‌ఫ్లూ, కరోనా రెండు కూడా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లే కావడంతో పాటు వాటి లక్షణాలు కూడా సరిసమానమేనంటున్నారు వైద్యనిపుణులు. అయితే కరోనా కంటే స్వైన్‌ఫ్లూ ప్రమాదకరమైనప్పటికీ స్వైన్‌ఫ్లూ వైరస్‌కు పూర్తిస్థాయి చికిత్సతో పాటు టీకాలు కూడా అందుబాటులో ఉండడంతో భయపడాల్సిన పనిలేదంటున్నారు వైద్యులు. అయితే రెండు వైరస్‌ల లక్షణాలు ఒకేలా ఉండడంతో ఏది స్వైన్‌ఫ్లూనో ఏది కరోనానో నిర్ధారణ కోసం రెండు పరీక్షలు చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘ఆర్ధోమిక్సో’ అనే కుటుంబానికి చెందిన స్వైన్‌ఫ్లూను  వైద్యపరిభాషలో హెచ్‌1ఎన్‌1గా  పరిగణిస్తారు. ప్రస్తుతం దీన్ని సీజనల్‌ ఫ్లూగా పరిగణిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా జలుబు,ముక్కు కారడం,తీవ్ర జ్వరం,దగ్గు,ఒంటినొప్పులు,తలనొప్పి,తుమ్ము, దగ్గు వంటివి స్వైన్‌ఫ్లూ లక్షణాలు. ఈ వ్యాధి కరోనా మాదిరిగానే రోగి తుమ్మడం లేదా దగ్గడం ద్వారా మరొకరికి వ్యాప్తిచెందుతుంది. ప్రధానంగా ఇది గాలి ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందుతుంది. స్వైన్‌ఫ్లూకు సంబంధించి ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్‌ దవాఖానల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులున్నాయి. స్వైన్‌ఫ్లూ చలికాలంలోనే అధికంగా వస్తుంది. అయితే రెండు సంవత్సరాలుగా ఈ కేసుల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలోని సర్వేలెన్స్‌ విభాగం అధికారులు తెలిపారు. వైరస్‌లో ఏర్పడుతున్న పరివర్తనాల కారణంగా వైరస్‌ తీవ్రత తగ్గిపోవడమే కాకుండా వైరస్‌ను తట్టుకునే హెర్డ్‌ ఇమ్యూనిటీ నగర ప్రజల్లో ఏర్పడినట్లు తెలిపారు. అందుకే ఈ వైరస్‌ను ప్రస్తుతం సీజనల్‌ ఫ్లూగానే పరిగణిస్తున్నట్లు సర్వేలెన్స్‌ అధికారి డా.శ్రీహర్ష తెలిపారు. స్వైన్‌ఫ్లూకు సంబంధించి గడిచిన రెండు నెలల్లో ఒక్క కేసు కూడా నమోదైన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం కరోనా పాండమిక్‌ కావడం, దానికి తోడు చలి తీవ్రంగా ఉండడంతో వైరస్‌ వచ్చే అవకాశాలు మాత్రం లేకపోలేదని హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఏదైన వస్తువును తాకిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కరోనా నియమాలు పాటిస్తే స్వైన్‌ఫ్లూ నుంచి రక్షణ పొందవచ్చన్నారు

Related Posts

0 comments on "చలితో కమ్మేస్తున్న కరోనా"

Leave A Comment