YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

తులసి పూజలో రాధ

తులసి  పూజలో    రాధ

బాణ్డీవనం ఒక అద్భుత ఉద్యానవనం. దేవలోకంలోని అపూర్వ సుగంధభరిత పుష్పాలన్నీ ఈ సుందరోద్యానవనంలో  మనోహరంగా , ఆహ్లాదకరంగా విరబూసి కనిపిస్తాయి.  మల్లె, మాలతి, జాజి, ఇరువాక్షి, చంపకం అనే  విరులు వికసించే చెట్లతో, తీగలతో సువాసనలు వెదజల్లే ఆ వనం కళ్ళకి, భావాలకి విందు అనడంలో అతిశయోక్తి లేదు.  ప్రక్కనేవున్న యమునా నది పైనుండి వీచే చల్లని పిల్లగాలులు మనసుకు ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. అటువంటి ఆ అందమైన వనంలో సాయంకాలం సంధ్యా  సమయాన పూజకి పుష్పాలు సేకరించడానికి మహారాజా వృషభానుని పుత్రిక , బర్సనా రాజ్య యువరాణి రాధ ఆ వనములోనికి వచ్చింది. ఉద్యానవనంలోని అందాలు  పరికిస్తూ , పువ్వుల సెజ్జ పట్టుకొని వయ్యారంగా నడుస్తోంది. అప్పుడు యమునా నది పైనుంచి వీచే చల్లని గాలి వచ్చి ఆమెను స్పర్శించింది. గాలిలో తేలుతూ వచ్చిన పరిమళ పుష్పాలు ఆమె పాదాలపై పడ్డాయి. ఇది నిత్యం జరిగేదే. ఈ వనానికి రాధ తరచుగా వస్తూనే వుంటుంది.  ప్రతి సారి పుష్పాంజలి జరుగుతూనే వుంటుంది. కాని యీ సారి ఒక చిన్న వ్యత్యాసం కనిపిస్తోంది.  పిల్లగాలులతో పాటూ వీనులవిందైన వేణుగానం కూడా సమ్మోహనంగా, వినిపిస్తోంది. కూసే కోయిల, పరుగులెత్తే జింకలు, మయూరాలు ,వీచే గాలి  అన్నీ కూడా ఒక్కసారిగా  ఆ రాగ ఆలాపనకు పరవశం పొంది నిశ్చలంగా వుండిపోయాయి. అది విన్న రాధ హృదయం కూడా ఆనందంతో ఉర్రూతలూగింది.  తనను తాను మరచి పోయింది. తండ్రి అయిన వృషబానుని మరచి పోయింది. తన పరిసరాలన్నీ మరచిపోయింది. తను కన్యననే విషయం కూడా మరచి పోయింది. అంతెందుకు , తను రాధననే విషయమే మరచిపోయినది. ఆమె సున్నితమైన సుకుమార పాదాలు  ఆమెకి తెలియకుండానే వేణుగానం వినిపించే దిశగా కదిలాయి. అక్కడ నీల ఆకాశమే పరచుకొన్నట్లున్న ఒక అద్భుతమూర్తిని చూసింది. శిఖలో మెరిసే నెమలిపింఛము , తామరపుష్పాల వంటి నేత్రాలను చూచింది.  మన్మధుని మరిపించే మందహాసాన్ని చూసింది. సకల లోకాలు శరణు కోరే రెండు పాదాలను దర్శించినది. దర్శనమాత్రంచేతనే తనని తాను మరచింది. ప్రప్రధమంగా  తన జన్మ సార్ధకత పొందిన భావం కలిగి సంభ్రమంతో నిశ్చేష్టయైనది. ఆ కార్మేఘ వర్ణునికి తనకి పలు జన్మలబంధం నిశ్చయంగా వుండే వుంటుంది అన్నది రాధ అంతరంగం. అదే నిజమవకూడదా అనే ఆశతో, అక్కడే నిలబడి పోయినది రాధ. రాధ స్నేహితురాలు లలిత వచ్చి ఆమెను తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. అంతః పురంలోకి వెళ్ళినా రాధకి ఆహారం సహించ లేదు.  నిద్ర రాలేదు. తేనె చేదుగా ,పాలు పులుపు గా అనిపించాయి. వేణుగాన మోహనుని మందహాసం ఆమె మనోఫలకంపై మెదలుతూ, మనసును కలవరపెట్టింది. ఆవేదని పెంచుతున్నది. తనకి తెలియకుండా కళ్ళు మూతలు పడినా కలగా కృష్ణుని మందహాసమే కనిపించి రాధ హృదయం విరహానికి గురి అవుతున్నది. రాధ బాధ చూసిన ఆమె చెలికత్తెలు లలిత, విశాఖలు కూడా ఆమె బాధకు కలత చెందారు. ఆ సమయంలోనే రాధ మనసులో భక్తి అనే యోగాగ్ని  పెంచడానికి కృష్ణుడు వేద మంత్రమైన  వేణుగానం వినిపిస్తూ అక్కడికి వచ్చాడు. చంద్రబింబం వంటి కృష్ణుని వదనం కిటకీలో నుండి చూసిన రాధ జన్మ సాఫల్యాన్ని పొందినది.  ఆ సుందర వదనాన్ని ఇంక ఒక్క క్షణం కూడా మరచిపోరాదని సంకల్పించినది రాధ. భక్తితో కృష్ణుని రూపాన్ని మనసులో నింపుకున్నది. చెలికత్తె లలితకి రాధాదేవి తీవ్ర  వేదన అర్ధమైనది . తక్షణమే రాధకోసం , కృష్ణుని వద్దకు రాయబారానికి వెళ్ళింది. లలిత వచ్చిన విషయం తెలుసుకున్న యశోదా తనయుడు యిలా అన్నాడు." లలితా! రాధా నేను  బ్రహ్మానంద స్వరూపమైన ఏకాత్ములము. వేరు వేరు రూపా‌లతో వున్నా నిజానికి  మేమిద్దరమూ ఒకటే. నాలో రాధ, రాధలో నేను కలసిపోయేవున్నాము. మేము ఏనాడూ విడిపోవడమనేది లేదు.  మా యిద్దరిని ఒక్కరిగా భావించి శ్రధ్ధా భక్తులతో  పూజించిన వారికి  వైకుంఠం ప్రాప్తిస్తుంది.  ప్రతిఫలం ఆశించకుండా చేసే భక్తులు , తాపసులు చేసే కర్మలకి నేను ఆనందిస్తాను. రాధ సదా  భక్తి తత్పరతతో నన్నే తలచుకుంటూ ఉన్నత స్ధానానికి చేరుకున్నది.. ఇంక కర్మయోగం ద్వారా ఆమె నన్ను పొందగలదు. వ్యాకుల పడవలసినది ఏమీ లేదు".
"కాని స్వామి!  భక్తి మార్గంలో వున్న రాధ  మిమ్మల్ని కర్మయోగం ద్వారా పొందగలగడం ఉన్నతమైన మార్గమా ? భక్తి యోగాన్ని అవమానపరచినట్టు కాదా ? " అని  లలిత న్యాయమైన ప్రశ్న వేసింది. లలిత ప్రశ్న లకి నవ్వుతూనే బదులిచ్చాడు ఆ  దీనదయాళుడు.
" మానవలోకానికి  నేను చేరే  మార్గాలను రానున్న కాలంలో  (భగవద్గీత లో) ఉపదేశిస్తాను . ఉపదేశించినవాడే దానిని ఆచరించకపోతే లోకం ఆచరిస్తుందా ?  అందుకే శ్రీ కృష్ణుని గా ఉపదేశించే నేను, రాధగా ఆచరణలో పెడతాను. ప్రధమంలోనే చెప్పాను . మాలో తరతమ భేధములు  లేవని ." " శ్రీ కృష్ణుని లీలలు చతుర్ముఖునికే  , అర్ధం కానప్పుడు, సామాన్య కన్యను నేనేమి గ్రహించగలను..అర్ధం చేసుకోవడం కష్టమే. కాని కృష్ణా! రాధని ఫలితం ఆశించని కర్మయోగమార్గాన్న నిన్ను పూజించమని చెప్తాను. ఇప్పుడు వెళ్ళి వస్తా." అని  చెప్పి  కృష్ణుని వద్ద సెలవు తీసుకుని రాధ వద్దకు వెళ్ళింది  లలిత. రాధ లలిత చెప్పిన విధంగానే వ్రతాలు,.  ి. ఆమె చేసే వ్రతం సామాన్యమైనది కాదు.. శ్రీ కృష్ణుని చేరడానికి తులసి దేవిని ప్రార్ధిస్తూ కఠోర దీక్షా వ్రతం ఆరంభించింది.  ఒక వ్యక్తి నాటిన తులసి మొక్క, భూమి మీద  ఆకులు, పువ్వులు, వెన్నులు  అని పెరుగుతూ వున్నంతకాలం అతని వంశంలో వారందరూ  వైకుంఠంలో శ్రీ హరి సేవలో 2000 వేల కల్పాలు తరిస్తూవుంటారు. పత్రాలను  పుష్పాలను స్వామికి సమర్పించడం వలన పొందే ఫలితం, ఒకే ఒక తులసీ దళం సమర్పించినందువలన పొందుతారు. ఏ ఇంట్లో తులసి వనం వుంటుందో  అదే ఒక పవిత్ర  క్షేత్రం  అవుతుంది. బంగారు, వెండి దానం చేయడం వలన కలగే పుణ్యం, ఒక తులసి మొక్కను నాటి భగవంతుని పూజిస్తే కలుగుతుంది. తులసి వనం వున్న గృహంలో యముని మీద వీచిన గాలి కూడా ఆ గృహంలోకి రాదు.  తులసి దళాన్ని  శిరస్సున ధరించినవారి చెంత యముడు  చేరడానికి భయపడతాడు.  ఇలా ఎంతైనా తులసి ప్రశస్తిని  కీర్తిస్తూనే వుండవచ్చును.  ఇటువంటి మహిమలు కలిగిన తులసిని  పూజించడమే నారాయణుని చేరే మార్గమని చెలులైన, లలిత,  చంద్రరాణా చెప్పగా రాధ నియమ నిష్టలతో తులసీ వ్రతం ఆరంభించినది. కేతకీ వనంలో, వంద అడుగుల  వలయాకార భూమిలో  నవరత్నాలతోను , చింతామణులతోను అలంకరించిన కోటలో, అభిజిత్ ముహూర్తాన తులసీ దేవిని నాటి  గర్గమహర్షిని గురువుగా స్వీకరించి వ్రతం ఆరంభించినది  రాధదేవి. ఆశ్వీయుజ శుక్లపక్ష పౌర్ణమి నుండి  ,చైత్ర మాస పౌర్ణమిదాకా  నిరాటంకంగా వ్రతం సాగింది.  ఒక్కొక్క మాసం ఒక్కొక్క రసంతో తులసిని సేవించింది రాధ. కార్తిక మాసం పాలతో, మార్గశిర మాసంలో చెఱుకు రసంతోను , పుష్య మాసంలో ద్రాక్ష రసంతోను,  మాఘ మాసంలో మామిడి పండ్ల రసంతోను, ఫాల్గుణ మాసంలో పళ్ళరసాలలో పటిక బెల్లం కలిపిన రసంతోను, చైత్రమాసంలో పంచామృతాలతోను పూజించింది. ఈ విధంగా వ్రతం  చేసిన రాధ  విధి విధానంగా వైశాఖ మాసం , కృష్ణ పక్ష పాడ్యమి నాడు  ఉత్సవం జరిపి వ్రతం సంపూర్ణం చేసింది.  రెండు లక్షలమంది మాధవ భక్తులకు, యాభై ఆరు రకాల పిండివంటలతో విందు భోజనం  పెట్టి , వస్త్రాభరణాలను దానం చేసి ఘనంగా వ్రతం ముగించే సమయాన  దేవతలు పుష్ప వర్షం కురిపించగా గంధర్వులు గానం చేస్తూండగా , నాలుగు హస్తాలతో, శ్రీ కృష్ణుని వంటి నీల మేఘఛ్ఛాయతో, పట్టు పీతాంబరం ధరించి , గరుత్మంతుని మీద తులసీ దేవి ప్రత్యక్షమైనది. ఆ దేవీ సాక్షాత్కారంతో  రాధ జన్మసాఫల్యం పొందిన భావంతో దేవి పాదాలకి వందనం చేసి శరణాగతి పొందినది.  రాధను  ఆలింగనము చేసుకున్న తులసి దేవి "రాధా!  నా అనుగ్రహంతో , నీవు సదా శ్రీ కృష్ణునితోనే వుంటూ యేనాడు కృష్ణుని వదలని సమున్నత స్థానాన్ని పొందుతావు. పాలలోనెయ్యి లా  నువ్వులలో నూనె వలె, ఏ భేధం లేకుండా మీరిద్దరు  కలసిమెలసేవుంటారు.  ఈ తులసి నీకు అనుగ్రహిస్తున్న వరం " అని ఆశీర్వదించి తులసిదేవి  అంతర్ధానమయింది. శ్రధ్ధాసక్తులతో తనని పూజించిన భక్తులకు సునాయాసంగా వరాలిచ్చే తులసీ దేవి గురించి ఎంతని వర్ణించగలం ? గర్గ సంహితంలో, బృందావన కాండంలో, తులసి పూజ అనే 16 వ అధ్యాయంలో ఈ కధ వున్నది. ఈ కధని చదివిన వారు విన్న వారికి కూడా శుభాలు కలుగుతాయని నారద మహర్షి తెలిపారు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts