YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శివో రక్షతు

శివో రక్షతు

త్రిమూర్త్యాత్మకమైన ఏకీకృత రూపము పరమాత్మ. సృష్థి కి పూర్వం ఉండే స్థితి. ఎప్పుడైతే పరమాత్మ సృష్థి కార్యం జరుపుదామనుకుంటాడో అప్పుడు తనని తాను పరమేశ్వరునిగా వ్యక్త పరుచుకుని బ్రహ్మ దేవుని సృజించి ఆయనకీ ఆ బాధ్యత అప్పచెపుతాడు. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుండి మానసపుత్రులను సృజిస్తాడు. వారే సనక సనందాదులు. వారు సర్వదా బ్రహ్మము నందు చరిస్తూ తాదాత్మ్యం చెంది ఈ సృష్టి కార్యక్రమం తమవల్ల కాదని నిరాకరిస్తారు. అప్పుడు బ్రహ్మ దేవతలను సృష్ఠించి మైధున సృష్థి కి ప్రజాపతులను సృష్తిస్తాడు. వారి ద్వారా భూలోకం అందులో మానవ సృష్థి ప్రారంభం అయింది. ఈ మానవ సృష్థి కి ప్రాతిపదిక పూర్వ జన్మ కర్మ ఫలం. జీవుని ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మలననుసరించి ఈ జన్మ ఉంటుంది. పూర్వజన్మల వాసనా క్షయం కోసం భగవంతుడు మానవ ఉపాధి కలిపిస్తాడు. 84 లక్షల జీవరాశులలో మానవ ఉపాధి ఒక్కటే భగవన్నామం చెప్పగలదు మంచి చెడుల విచక్షణ చేయగలడు. మిగిలిన జీవులన్నీ తిర్యక్కులు. అంటే వెన్నుపాము అడ్డంగా ఉండే జీవులు. మానవునకు ఒక్కనికే పుట్టినప్పుడు వెన్నుదండం అడ్డంగా ఉండి పెరిగే కొద్దీ నిలువుగా మారి పరిణతి చెందే ప్రాణి. ఇటువంటి సృష్థి కార్యాన్ని నియంత్రిచే వాడు విష్ణువైతే లయం చేశేవాడు శివుడు. శివుడు అరూపీ రూపీ. అంటే ఏ రూపము లు లేనివాడు అన్నిరూపములు తానే అయినవాడు. మనం శివార్చన ప్రారంభ దశలో మూర్తి రూపంలో ప్రారంభించి లింగ రూపాన్ని పూజిస్తాము.. ఈ లింగరూప పరమేశ్వరుని పంచముఖ పరమేశ్వరునిగా పూజిస్తాము. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. నాలుగు దిక్కులా నాలుగుముఖాలు ఉండగా ఊర్ధ్వ దిక్కున అయిదవ ముఖం ఉంటుంది. సర్వ కాల సర్వావస్థలలో మానవునికి ముక్తి హేతువు" శివాయ నమః " శివ పంచాక్షరీ మంత్రం మానసికంగా సగర్భ జపం ఉత్తమం. ఈ శివ పంచాక్షరీ మంత్రం యజుర్వేదంతర్గతమైన రుద్ర నమకం లో పంచమ ప్రపాఠకం లో నిక్షిప్తమైన మహా దివ్య మంత్రం. దీనిని అనుసంధానించుకుని జపం మననం ధ్యానం చేసుకోవచ్చు. దీనికి అలవాటు పడితే మహాదేవునితో మనస్సు లయమై మోక్షానికి హేతువవుతుంది. మనస్సు ఎప్పుడైతే మహాదేవుని వశమవుతుందో బంధం నుండి విడివడి మోక్షం వైపు పయనం ప్రారంభం అవుతుంది. ఇదే మానవ జన్మ పరమార్ధం. భగవదారాధనలో సగుణోపాసన నిర్గుణోపాసన అని రెండు విధాలుగా ఉంటుంది ప్రారంభదశలో సగుణోపాసన వల్ల మనస్సు మూర్తి ధ్యానం మీద నిలిచి ఉంటుంది. దీనిని ఆలా చేస్తూ ఉంటే నిర్గుణం వైపు మనస్సు మరలుతుంది. ఇది ఆధ్యాత్మికతలో ఒక మార్గం. ఈ సృష్థిలో ఉన్న బ్రహ్మ పదార్ధం ఒక్కటే దానినే కొందరు శివుడిని విష్ణువని  అని ఆరాధించు కుంటారు. శివమ్ అంటే శుభం మంగళం శాంతం. మానవుడు తన గ్రహదోషాలు శివారాధన ద్వారా పోగొట్టుకోగలడు. లింగారాధన అన్నిటికంటే విశిష్టమైనది. సప్తధాతువులలో పార్థివలింగారాధన శివునికి అత్యంత ప్రియమైనది. బిల్వదళాలతో ప్రదోష సమయంలో చేసే శివారాధన అత్యంత విశిష్టమైనది. మహాభారతం లో అశ్వథామ వ్యాసభగవానుని, తన బ్రహమశిరోనామకాస్త్రం ఎందువలన కృష్ణార్జునలను ఏమి చేయలేక పోయిందని అడుగగా, వ్యాసభగవానుడు కృష్ణార్జునులు ఇరువురు నిత్యం లింగారాధన జరపడం వలన వారికి ఆ రక్ష కలిగిందని చెపుతాడు. శివారాధనవల్ల మనిషి శీఘ్రంగా తన ధ్యానం లో పండి తురీయావస్థకు చేరుకోగలుగుతాడు మనిషికి దరిద్రం, అపమృత్యుభయం అనారోగ్యం, శత్రుభయం ఎప్పటి వరకు ఉంటాయంటే శివారాధన ప్రారంభించే వరకు మాత్రమే. ఒకసారి శివారాధన ప్రారంభిస్తే, అన్నీ పటాపంచలై పోతాయి. శివునికి సోమవారం, ఆర్ద్రా నక్షత్రం, ప్రదోష సమయం, విశేషించి కార్తీకమాసం. ఈ పుణ్యప్రద దినాలలో శివపరివారం ఉన్నచిత్రపటం కి పూజచేసుకుంటే. ఈ ఇంటిల్లిపాదికి శివపరివార రక్ష లభిస్తుంది. ఆ ఇంటివారికి ఈ విశ్వానికి తల్లితండ్రులైన గౌరిశంకరుల కృప లభిస్తుంది. ముఖ్యంగా ఆఇంటిలో వాస్తుదోషాలు ఉపశమించి అందరూ సౌమనస్కులై కలివిడిగా ఉంటారు.
శివో రక్షతు.

Related Posts