
కరోనా విరుగుడుకు టీకాస్త్రం సిద్ధమవుతున్నది. వారంపదిరోజుల్లో వ్యాక్సిన్ (టీకా) అందుబాటులోకి రానుండడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మొదటిదశలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు పారిశుధ్య సిబ్బంది, విభాగం అధికారులకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి జాబితా రూపొందించే ప్రక్రియ చురుగ్గా సాగుతుండగా..ఎవరికి ఎప్పుడు ? ఎక్కడ ? ఇవ్వాలన్న దానిపై కసరత్తు జరుగుతున్నది. త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఈ లెక్కన జీహెచ్‌ఎంసీ, జలమండలి పరిధిలోని ఏడు విభాగాలకు చెందిన వారిని వ్యాక్సినేషన్‌కు ఎంపిక చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో 29 వేల మందితో జాబితా సిద్ధం కాగా, జలమండలిలో మరో 7 వేల మంది ఉన్నారు. ఈ రెండు విభాగాలకు సంబంధించే దాదాపు 36 వేల మందికి మొదటి దశలో కొవిడ్ టీకా వేయనున్నారు. అధికారులు సిబ్బందికి సంబంధించి జాబితాను సిద్ధం చేయగా... వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉండాలనే దానిపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. సంబంధిత సిబ్బంది ఆధార్, పాన్ కార్డుల వంటి గుర్తింపు కార్డులతోపాటు శాఖాపరమైన ఐడెంటిటీ కార్డు, డ్రైవర్లు అయితే డ్రైవింగ్ లైసెన్సు తదితర వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించనున్నారు. ఎంపిక తర్వాత ఎప్పుడు, ఏ కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకోవాలనే సమాచారంతో ఎస్‌ఎంఎస్ పంపించడంతోపాటు స్లిప్‌లు కూడా అందజేయనున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత వేలికి సిరా వేయనున్నారు. తద్వారా వ్యాక్సినేషన్ రెండోసారి చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఓ అధికారి చెప్పారు.జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న అసిస్టెంట్ మెడికల్ అధికారులు – 17,జోనల్ మెడికల్ అధికారులు – 01,పారిశుద్ధ్య సిబ్బంది - 18,550,శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు – 948,శానిటరీ జవాన్స్ – 284,శానిటరీ సూపర్‌వైజర్స్ – 22,శానిటరీ ఇన్‌స్పెక్టర్లు – 06,హెల్త్ అసిస్టెంట్లు – 06,స్వచ్ఛ ఆటో టిప్‌ర్ డ్రైవర్లు, హెల్పర్లు - 5,000,స్వచ్ఛ సీఆర్‌పీలు - 2,152,ఇంజినీర్లు – 04,రవాణా ఇంజినీర్లు – 40,రవాణా డ్రైవర్లు – 995,రవాణా సిబ్బంది - 1,548