
బెంగళూరు, జూలై 3,
కర్ణాటకలో గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా యువత గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించి, కారణాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని కమిటీ పది రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. కొవిడ్ టీకాల ప్రభావం, ఇతర ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేయనున్నారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం 'హృదయ జ్యోతి', 'గృహ ఆరోగ్య' పథకాలను అమలు చేస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం...కర్ణాటకను హార్ట్ ఎటాక్ భయపెడుతుంది. గత కొన్ని రోజులుగా వరుసగా యువత గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతుంది. కర్ణాటక యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాల పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి కారణాలు గుర్తించి.. ఈ సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీని కూడా నియమించారు. గత నెలలో అనగా జూన్‌లో ఒక్క హసన్ జిల్లాలోనే ఇరవై మందికి పైగా గుండెపోటు కారణంగా మరణించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం నాడు కూడా 27 ఏళ్ల సంజయ్ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు.ఈ గుండెపోటు మరణాలకు గల కారణాలు, ఇందుకు పరిష్కారం చూపాలంటూ సీఎం సిద్ధ రామయ్య జయదేవ హృద్రోగ ఆసుపత్రుల డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్‌ను ఆదేశించారు. ఆయన నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీని గురించి ఎక్స్ వేదికగా సిద్ధ రామయ్య పోస్ట్ చేశారు. యువకుల్లో ఆకస్మిక మరణాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేశామని సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిని పరీక్షించి, సమస్యలను విశ్లేషించాలని కమిటీకి సూచించారు.కొవిడ్ టీకాల ప్రభావం, గుండె సంబంధిత సమస్యలపై అధ్యయనం కొనసాగుతోందని సీఎం వెల్లడించారు. హసన్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక మరణాల వెనుక గల కారణాలను గుర్తించి.. వాటిని నివారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం హృదయ జ్యోతి, గృహ ఆరోగ్య వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు.యువత, అమాయక ప్రజల జీవితాలు తమకు చాలా ముఖ్యమని సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హసన్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఆకస్మిక మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వాటిని నివారించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.డాక్టర్ రవీంద్రనాథ్ మార్గదర్శకత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కర్ణాటకలో ఒక్కసారిగా ఇన్ని గుండెపోటు మరణాలు నమోదు కావడం పట్ల జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.