YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఐసోలేషన్ పై తర్జనభర్జనలు

ఐసోలేషన్ పై తర్జనభర్జనలు

న్యూఢిల్లీ, జనవరి 9, 
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. లండన్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు 250 మందితో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకోగా.. కోవిడ్ పరీక్షలు, క్వారంటైన్ నిబంధనల్లో చివరి నిమిషంలో జరిగిన మార్పుల వల్ల గందరగోళం ఏర్పడింది. దీంతో ప్రయాణికులను విమానాశ్రయంలోనే అర్ధరాత్రి వరకు నిలిపివేశారు.సవరించిన నిబంధనలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కాసేపటికి ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేయించుకోవాలని, నెగెటివ్ వచ్చినా ఏడు రోజులు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లోను, మరో వారం రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అలాగే, చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్నవారు కూడా అదనంగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేయించుకోవాలి.. విమానాశ్రయంలో 10 గంటల వరకు గడపడానికి సిద్ధంగా ఉండాలి అని సూచించారు. ఈ నిబంధనలపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి బయటకు వచ్చిన ఓ వీడియోలో పోలీసులు, విమానాశ్రయ అధికారులు ఉండే డెస్క్ చుట్టూ గుమిగూడిన ప్రయాణికులు అసహనం ప్రదర్శించారు.అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రయాణికుడు ‘మేము ఇకపై ఈ నిర్బంధాన్ని ఎంత మాత్రం సహించబోం’ అన్నాడు. ‘ఇక్కడ నుంచి బయటకు వెళ్లే హక్కు మాకు ఉంది’ అంటూ ఓ మహిళా ప్రయాణికురాలు మండిపడ్డారు. ఘర్షణ కొనసాగుతుండగా.. ప్రయాణికులపై డెస్క్ వద్ద ఉన్న ఓ మహిళా అధికారి అరవడం, చూపుడు వేలు చూపించి వార్నింగ్ ఇచ్చారు.కొందరు పోలీసు అధికారులు ప్రయాణికులను శాంతింపజేయడానికి ప్రయత్నిచగా, మహిళా అధికారి హెచ్చరిస్తూ లోనికి వెళ్లిపోయారు. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై జనవరి 31 వరకు నిషేధం పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరినా.. కేంద్రం స్పందించలేదు. దీంతో గందరగోళానికి కారణమైన తాజా నిబంధనలపై కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సవరించిన నిబంధనలను వెల్లడించారు. నిబంధనల్లో మార్పుల గురించి తమకు తెలియజేయలేదని ప్రయాణికులు అంటే.. ప్రీ-ఫ్లైట్ ప్రకటనలు చేశారని, కొత్త మార్గదర్శకాల కారణంగా 20 మంది ప్రయాణం రద్దుచేసుకున్నారని ఎయిరిండియా పేర్కొంది.రెండు వారాల నిషేధం తర్వాత లండన్ నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 222 మంది నెగెటివ్‌గా వచ్చింది. మరో 32 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇద్దరికి పాజిటివ్ రాగా.. వారి నుంచి నమూనాలను సేకరించి జన్యు పరీక్షలకు పంపారు.

Related Posts