
న్యూఢిల్లీ జనవరి 20
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో తొలిసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సోమవారం నాడు కరోనా లక్షణాలతో బాధ పడుతున్న ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తేలింది. దీంతో కేంద్రం అప్రమత్తమై ప్రత్యేక బృందాన్ని లక్షద్వీప్‌కు పంపింది. అయితే కొచ్చి నుంచి జనవరి 4వ తేదీన ఓ ప్రయాణికుడు నౌకలో లక్షద్వీప్ వెళ్లాడు. అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఆ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతనితో సన్నిహితంగా ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు. 31 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 14 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 14 మందితో కలిసి తిరిగిన మరో 56 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.