YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలంలో లుకలుకలు

కమలంలో లుకలుకలు

హైదరాబాద్, ఫిబ్రవరి 4, 
బీజేపీలో అంతర్గత పోరు తీవ్రమవుతున్నది. పైకి వాతావరణం మంచిగానే కనిపిస్తున్నా.. నేతలు వేదికలను పంచుకుంటున్నా.. లోలోపల ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉన్నది. రాజకీయంగా తమ ప్రాభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పార్టీల నేతలు వెనకాముందు చూసుకోకుండా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారే కమలం పార్టీలో ఎందుకు చేరామురా బాబు? అని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీలో ఇమడలేక, బయటకు పోలేక సతమతమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ మోర్చాలలో కొన్ని జిల్లాలకే, కొందరు నేతల అనుయాయులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంపైనా మిగతా నేతలు గుస్సుమంటు న్నారు. కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు గాలం వేసి లాక్కుం టున్నా క్షేత్రస్థాయిలో బీజేపీకి అంత సినిమా లేదని ఆ పార్టీలోని లుకలుకలను బట్టి అవగతం అవుతున్నది. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్‌ మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నట్టు ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇవ్వలేదని పలువురు నాయకులు కార్యాలయాలపై దాడి చేయటం, పలు చోట్ల ఏకంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనంతో ఆ పార్టీలో వైషమ్యాలను పెంచింది. పార్టీ అగ్రనేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిక్కెట్లను అమ్ముకున్నారని కార్యకర్తలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. బండి సంజరు, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, అర్వింద్‌కుమార్‌ చురుకుగా వ్యవహరిస్తున్నా రాజాసింగ్‌ మాత్రం పెద్దగా కనిపించడంలేదు. 'కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు' అంటూ రాజాసింగ్‌ అనుచరులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెట్టడం ఆ పార్టీలోని విభేదాలను ఎత్తిచూపుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ సహ పర్యవేక్షకులుగా ఉన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డిని మీడియా సమావేశంలో పరిచయం చేస్తూ కాంగ్రెస్‌ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన నేతగా ఓ సీనియర్‌ నేత సంబోదించగా...'పార్టీలో చేరి ఏడాది దాటింది.. ఇంకా ఇటీవల ఏందయ్యా? ఓ రాష్ట్ర బాధ్యులుగా ఉన్న నేను కాంగ్రెస్‌ నేతనేం టి?' అంటూ సుధాకర్‌రెడ్డి వేదికపైనే ఒకింత అసహనం వ్యక్తం చేయడం పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదని అర్థమువుతున్నది. దళిత నేతగా తనకంటూ ఉన్న ప్రత్యేకతను మసకబార్చేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తు న్నారనే బాధలో మాజీ ఎంపీ వివేక్‌ ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల వికారాబాద్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ బీజేపీలో చేరటం, వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తానని మాట్లాడటం దీనికి బలం చేకూరుస్తున్నాయి. బీజేపీలో చంద్రశేఖర్‌, మోత్కు పల్లికి బండి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం వివేక్‌కు అస్సలు మింగుడు పడటం లేదని వినికిడి. పెద్దపల్లి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణకు, వివేక్‌కు, ఇతర నేతలకు మధ్య అస్సలు పడట్లేదు. సోమా రపు సత్యనారాయణ మళ్లీ పాతగూటికే చేరే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. పాలమూరు జిల్లాలో ఓ మాజీ ఎంపీకి, తాజా జిల్లా అధ్యక్షునికి అస్సలు పొసగడం లేదు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడినైనా తక్కువ చేసి చూడటంపై అలిగిన ఎర్ర శేఖర్‌ తన పదవికే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. అయితే, వెనువెంటనే అధిష్టానం జోక్యం చేసుకుని రాజీనామాను ఉపసంహరింపజేసినప్పటికీ ఆ జిల్లాలో ఆధిపత్య పోరు చాపకింద నీరులా ఉండటం గమనార్హం. నల్లగొండ జిల్లాలో కమలం పార్టీ పరిస్థితి మూడుముక్కలాటగా మారింది. ఇప్పటికే మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు, మరో నేత గ్రూపులు కట్టారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుత అధ్యక్షులు కంకణాల శ్రీధర్‌రెడ్డి కుటుంబానికి సీటు దక్కకుండా మిగతా రెండు గ్రూపులు వ్యూహరచన చేస్తున్నాయి. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేతను తెరపైకి తెచ్చే యత్నం చేస్తున్నారు.

Related Posts