
నిమ్స్ లో ఎదురు చూపులు
హైదరాబాద్, ఫిబ్రవరి 16,
పేదల కార్పొరేటు ఆస్పత్రిగా పేరుగాంచిన నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో వైద్య సేవల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఆర్ధోపెడిక్, కార్డి యాలజీ, న్యూరాలజీ, రుమటాలజీ, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాల్లో చికిత్స కోసం వచ్చే రోగులు ఓపీ కార్డు కోసమే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఇక ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే వారి బాధ వర్ణణాతీతం. ఆదిలాబాద్‌కు చెందిన లక్ష్మి.. కీళ్ల నొప్పులతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. ఊరి నుంచి దాదాపు ఆరు గంటల ప్రయాణం చేసి ఆస్పత్రికి చేరుకోగా సమయం అయిపోయింద న్నారు. రాత్రంతా ఆస్పత్రిలోనే చలిలో ఉండి.. తెల్లవారుజామున వరుసలో నిలబడి టోకెన్ తీసుకుని వైద్యున్ని సంప్రదించాల్సి వచ్చింది. నిమ్స్ రమటాలజీ ఓపీ సేవలు పొందాలంటే మూడు, నాలుగు రోజులు పడుతోంది. ఈ విభాగంలో రోజూ ఉదయం 7 గంటల వరకే టోకెన్ ఇస్తారు. అది ఉంటేనే ఓపీ కార్డు ఇస్తున్నారు. టోకెన్ తీసుకునేందుకు ఒక రోజంతా జాగారం చేయాల్సి వస్తోంది. ఇక వైద్యులను కలిసేందుకు గంటల పాటు ఆరుబయట ఎదరు చూడాల్సిందే. ఇది ఒక్క రమటా లజీ చికిత్స కోసం వచ్చే రోగుల పరిస్థితే కాదు, నిమ్స్ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి.. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీ) ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితే. అంతేకాదు, నిమ్స్‌లో బెడ్లు, స్ట్రెచ్చర్లు, వీల్‌చైర్ల కొరత విపరీతంగా ఉంది. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నా దానికి తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవ డంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి విభాగంలో వీల్‌చైర్ల కోసం వెతుక్కోవడం, బతిమలా డుకోవాల్సి వస్తోంది. అయినా దొరక్కపోవడంతో చేసేదేమీ లేక కొంతమంది రోగిని ఎత్తుకుని పోతున్నారు. కనీసం వృద్ధులు, నడువలేని పరిస్థితిల్లో వచ్చిన వారికి కూడా సేవలు దొరకడం లేదు. ఓపీ విభాగంలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఎమర్జెన్సీ లో పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.అత్యవసర సమయంలో వైద్యం కోసం నిమ్స్‌కు వస్తున్న రోగులకు సరైన వైద్యం అందడం లేదు. నిమ్స్ జనరల్ ఎమర్జెన్సీకి నిత్యం సుమారు 25-50 మందికి పైగా రోగులు వస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు మొదలుకుని గుండెపోటు, పక్షవాతానికి గురైన బాధితులు సైతం అత్యవసర చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ వార్డు ముందు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ వార్డులో రోగిని పడుకోబెట్టడానికి కూడా కనీసం పడక దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర విభాగం గ్రౌండ్ ఫ్లోర్‌లో 40, మొదటి అంతస్తులో 50 పడకలున్నాయి. ఇక 18 వరకు ట్రాలీలు ఉంటాయి. కాగా అత్యవసర విభాగానికి కొద్ది రోజులుగా రెట్టింపు సంఖ్యలో రోగులు వస్తున్నారు. రోగులను బట్టి సర్జికల్, మెడికల్, క్రిటికల్, న్యూరో, కార్డియాలజీ ఇలా పలు విభాగాలకు వెంట వెంటనే పంపించాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు వ్యాధి నిర్ధారణలో ఆలస్యం జరుగుతుండటంతో రెండు, మూడు రోజుల వరకు ఎమర్జెన్సీలోనే ఉండాల్సి వస్తోంది. దాంతో కొత్తగా వచ్చే రోగులకు పడకలు దొరకడం లేదు. అత్యవసర విభాగంలోకి ప్రవేశం లభించినా ట్రాలీ లోనే గంటల పాటు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విభాగం నుంచి ఓ రోగిని పంపిస్తేనే మరో రోగికి బెడ్ దొరుకుతుంది. దాంతో చాలామంది వెనుదిరిగి ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.రోగిపరిస్థితి అత్యంత విషమంగా ఉన్నా ఎమర్జెన్సీ ముందు వేచి చూడాల్సి రావడంతో చాలామంది రోగులు వెనుదిరిగి ప్రయి వేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఎమర్జెన్సీకి వచ్చే వారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు, గుండెపోటు తదితర సమస్యలతో వచ్చే వారే ఉంటారు. అత్యంత పేరుగాంచిన ఆస్పత్రి కావడంతో ఆయా జిల్లాల నుంచి నేరుగా ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇక్కడ బెడ్ల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న రోగుల్లో ఎవరైనా జనరల్ వార్డులకు వెళ్తే తప్పా బయట ఉన్న వారికి చికిత్స లభించం లేదు.