YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కృష్ణా టీడీపికి దిక్కెవరు..

కృష్ణా టీడీపికి దిక్కెవరు..

విజయవాడ, ఫిబ్రవరి 23, 
రాష్ట్రంలో కృష్ణా జిల్లా టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖ‌చ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇద్దరు మంత్రుల‌కు ఈ జిల్లాలో ప్రాధాన్యం ఉంటుంది. కీల‌క‌మైన దేవినేని ఉమా.. కొల్లు ర‌వీంద్ర, బోడే ప్రసాద్‌, కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, బ‌చ్చుల అర్జునుడు, కేశినేని నాని, గ‌ద్దె రామ్మోహ‌న్‌, బుద్ధా వెంక‌న్న, మండ‌లి బుద్ధ ప్రసాద్‌, కాగిత వెంక‌ట్రావు, బోండా ఉమా వంటి కీల‌క నాయకులు ఉన్నారు. కృష్ణా జిల్లా పార్టీకి ఎప్పుడూ కంచుకోట‌గానే ఉంటోంది. 2009లో ప్రజారాజ్యం, ఓ వైపు వైఎస్ ప్రభంజ‌నం ఉన్నా కూడా జిల్లాలో ఈ రెండు పార్టీల‌కు చెక్ పెట్టి టీడీపీ స‌త్తా చాటింది. ఇక 2014లోనూ ఆ పార్టీ స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వ‌ర‌కు తిరుగులేని స‌త్తా చాటింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం చ‌తికిల ప‌డ‌క త‌ప్పలేదు. ఇత‌ర జిల్లాల్లో మాదిరిగా.. పార్టీ ఓడిపోయినా.. నాయ‌కులు మాత్రం సైలెంట్ కాలేదు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని అధినేత చంద్రబాబు బాగానే ఆశ‌లు పెట్టుకు న్నారు. మ‌రీ ముఖ్యంగా ఏక‌గ్రీవాలపైనా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఏక‌గ్రీవాల్లో వైసీపీయే పై చేయి సాధించింది.పంచాయ‌తీ తొలి ద‌శ ఎన్నిక‌ల్లో అయినా టీడీపీ ఖ‌చ్చితంగా మెజార్టీ పంచాయ‌తీలు కైవ‌సం చేసుకుంటుంద‌నే అంద‌రూ అనుకున్నారు. తొలిద‌శ ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. మాత్రం టీడీపీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది. ఫ‌లితాలు రాక‌ముందు వ‌ర‌కు.. కూడా.. నాయ‌కులు భారీ ఎత్తున స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత మాత్రం.. కీల‌క నేత‌లు.. దేవినేని, వ‌ర్ల‌, బుద్దా వెంక‌న్న వంటివారు సైలెంట్ అయ్యారు. ఇక‌, క్క‌డి తొలి ద‌శ‌ ఫ‌లితాలు చూస్తే.. జిల్లాలో మొత్తం 234 పంచాయ‌తీల‌కు తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో వైసీపీ 168 చోట్ల విజ‌యం సాదించింది. ఇక‌, టీడీపీ కేవ‌లం 35 స్థానాల‌ను మాత్రం నిల‌బెట్టుకుంది. ఇత‌రులు.. 8 ద‌క్కించుకున్నారు. దీంతో టీడీపీ నేత‌ల నోళ్లు మూగ‌బోయాయి.ఇక‌, జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగా చూస్తే.. మాజీ మంత్రి దేవినేని ఉమా ప‌రిధిలోని మైల‌వ‌రం ప‌రిధిలో నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా ఉన్న మైల‌వ‌రం మండ‌లంలో 13 పంచాయ‌తీల‌కు గాను ఒక్కచోట కూడా టీడీపీ మ‌ద్దతు దారుల‌ను గెలిపించుకోలేక పోయింది. నియోజ‌క‌వ‌ర్గానికి గుండెకాయ లాంటి ఇబ్రహీంప‌ట్నం మేజ‌ర్ పంచాయ‌తీని ఏకంగా కాంగ్రెస్ కైవ‌సం చేసుకుంది. ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గంలోని జి. కొండూరు మండ‌లంలో 23 పంచాయ‌తీల‌కు 20 వైసీపీ ఖాతాలో ప‌డగా.. టీడీపీ రెండే రెండు స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. ఉమాను ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ అస్సలు టీడీపీకి సింగిల్ స‌ర్పంచ్ సీటు కూడా ఇవ్వలేదు. కేపీ చాలా క‌సితో ప‌నిచేశారు.జ‌గ్గయ్యపేటలో 16 పంచాయ‌తీలు ఉంటే 5 మాత్రమే టీడీపీకి ల‌భించాయి. ఇక టీడీపీకి ద‌శాబ్దాలుగా కంచుకోట‌గా ఉంటోన్న నందిగామ మండ‌లంలో మొత్తం 23 పంచాయ‌తీలు ఉంటే.. కేవ‌లం 3 చోట్ల మాత్రమే.. టీడీపీ ద‌క్కించుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వీరుల‌పాడు మండ‌లంలో వైసీపీ జోరు ముందు టీడీపీ కుదేలైంది. ఇక నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద 54 చోట్ల వైసీపీ స‌ర్పంచ్‌లు గెలిస్తే… టీడీపీ మ‌ద్దతుదారులు కేవ‌లం 15 స‌ర్పంచ్ స్థానాల‌తో స‌రిపెట్టుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు రంకెలు వేసిన బుద్ధా వెంక‌న్న, దేవినేని ఉమా లాంటి వాళ్ల గొంతులు ఇప్పుడు మూగ‌బోయాయి. ఏదేమైనా స్థానిక ఫ‌లితాలు కృష్ణా టీడీపీలో కీల‌క నేత‌ల‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. మిగిలిన ద‌శ ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో అయిన పార్టీ ప‌రువు నిలుస్తుందో ? లేదో ? చూడాలి.
మంగళగిరిలోనూ అంతేనా
స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుంది. దానిని ఎవరూ కాదనలేరు. సాధారణ ఎన్నికల సమయంలో ప్రజలు రాష్ట్ర పరిస్థితిని చూసి ఓటేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అభ్యర్థిని చూసి ఓటేస్తారు. పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలే అయినా మద్దతుదారులంటూ అన్ని పార్టీలూ తమ విజయాలను క్లెయిం చేసుకుంటాయి. అందులోనూ తప్పులేదు. కానీ సాధారణ ఎన్నికల్లో పట్టు ఉండాలంటే గ్రామస్థాయిలో బలం ఉండాలి. అందుకే ఏపీలో పంచాయతీ ఎన్నికలు అంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలూ తీసుకున్నాయి.ఇక నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నారా లోకేష్ ను ఇక్కడి ప్రజలు ఓడించారు. అయినా రాజధాని అమరావతి అంశం తనకు వచ్చే ఎన్నికల్లో కలసి వస్తుందని నారా లోకేష్ భావిస్తూ వస్తున్నారు. అందుకే మరోసారి మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నారా లోకేష్ రెడీ అవుతున్నారని ప్రచారం కూడా పార్టీలో నడుస్తుంది.అయితే ఇటీవల జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో మంగళగిరిలో నారాలోకేష్ కు మళ్లీ దెబ్బపడింది. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని 18 పంచాయతీలకు తొలిదశలో ఎన్నికలు జరగ్గా అందులో 14 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలవడం విశేషం. టీడీపీ కేవలం నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ ఫలితాలు నారా లోకేష్ కు వ్యక్తిగతంగా ఎదురుదెబ్బేనని పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.మంగళగిరికి ఇన్ ఛార్జిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. తాను ఇన్ ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలోనే అభ్యర్థులను గెలిపించుకోలేక పోతే పార్టీ అగ్రనేత గా మిగిలిన వారిని ఎలా ప్రశ్నిస్తారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అమరావతి రాజధాని ప్రభావం ఉంటుందని భావించి నారా లోకేష్ పంచాయతీ ఎన్నికలను లైట్ గా తీసుకున్నారని, అందుకే ఇటువైపు కూడా తొంగి చూడలేదంటున్నారు. మరోసారి మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయాలనుకుంటే ఆ నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టక తప్పదంటున్నారు. లేకుంటే మరోసారి పాత ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి.

Related Posts

0 comments on "కృష్ణా టీడీపికి దిక్కెవరు.."

Leave A Comment