YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

సెకండియర్ విద్యార్ధుల సంగతేంటీ

సెకండియర్ విద్యార్ధుల సంగతేంటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 25, 
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్వాకంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకపోవడంతో ఫెయిలైన విద్యార్థులు పాస్‌ కావడానికీ, తక్కువ మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాయడానికి అవకాశం లేకుండా పోయింది. ఏటా వార్షిక ఫలితాలు విడుదలైన వెంటనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది కరోనా వైరస్‌ విజృంభించడంతో షెడ్యూల్‌ ప్రకారం ఆ పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించ లేదు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సులతోపాటు డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులకు నవంబర్‌, డిసెంబర్‌లో సెమిస్టర్‌ పరీక్షలను వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించాయి. అదే సమయంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డుకు అవకాశమున్నది. కానీ ఇంటర్‌ బోర్డు అలసత్వం ప్రదర్శించిందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. దీంతో ఫెయిలైన వారితోపాటు తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఇంటర్‌ బోర్డు విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజును వసూలు చేస్తున్నది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంతోపాటు ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. అంటే ఈసారి ఇంప్రూవ్‌మెంట్‌ సౌకర్యం లేనట్టేనని స్పష్టమవుతున్నది.రాష్ట్రంలో 2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 4,80,555 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 2,88,383 (60.01శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 1,92,172 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులందర్నీ రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసింది. ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కానివారు, మాల్‌ప్రాక్టీస్‌లో దొరికిన వారినీ ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థులకు ఆ నిర్ణయాన్ని వర్తింపచేయలేదు. దీంతో వారు తీవ్ర నిరాశ చెందారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులను ప్రభుత్వం పాస్‌ చేయకపోవడంతోపాటు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలనూ నిర్వహించలేదు. దీంతో తక్కువ మార్కులొచ్చిన వారు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఏ గ్రేడ్‌లో 1,64,245 మంది, బీ గ్రేడ్‌లో 78,610 మంది, సీ గ్రేడ్‌లో 31,962 మంది, డీ గ్రేడ్‌లో 13,566 మంది ఉన్నారు. అయితే 75 శాతం కంటే తక్కువ మార్కులొచ్చిన వారు బీ,సీ,డీ గ్రేడ్‌లో కలిపి 1,24,138 మంది ఇంప్రూవ్‌మెంట్‌ కోసం ఎదురుచూశారు. రాష్ట్ర ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకుండా వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు ఫెయిలైన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం పెనుభారం మోపింది. మే ఒకటి నుంచి జరిగే పరీక్షల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టులతోపాటు ద్వితీయ సంవత్సరంలో మొత్తం సబ్జెక్టులనూ రాయాల్సి ఉంటుంది. ఇంకోవైపు ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమలవుతున్నది. ఫెయిలైన వారు, తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు ఎంసెట్‌లో నష్టపోయే ప్రమాదమున్నది. తక్కువ మార్కులతో మెరుగైన ర్యాంకులు పొందలేరు. దీని వల్ల వారికి మంచి కాలేజీల్లో సీట్లను కోల్పోయే అవకాశమున్నది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జీవితాలతో అన్ని విధాలుగా చెలగాటమాడిందని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇంటర్‌ బోర్డు చర్యలు తీసుకోవాలి. ఫెయిలైన విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలి. ఎంసెట్‌లో వెయిటేజీ అమల్లో ఉన్నందున ఇంప్రూవ్‌మెంట్‌ నిర్వహించకపోవడం వల్ల కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశమున్నది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలి.

Related Posts