YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అరుణాచలం:

అరుణాచలం:

ఆత్మ-నిగ్రహము
మనోబుద్దులను పాడు చేసే ప్రాపంచిక భోగముల వెనుక పడి పరిగెత్తకుండా, మనస్సు-ఇంద్రియములను నిగ్రహించటమే ఈ ఆత్మ-నిగ్రహము. విలాసభోగములచే మన వ్యక్తిత్వం విచ్చిన్నమై పోకుండా ఈ ఆత్మ నిగ్రహము కాపాడుతుంది.
ఇంద్రియ వస్తు విషయముల పై అనాసక్తి. ఇది, పైన ఉదహరించబడినటువంటి, బలవంతంగా మనల్ని మనము నిగ్రహించుకునే ఆత్మ-నిగ్రహము కంటే ఒక మెట్టు ఎక్కువది. అనాసక్తి అంటే, భగవత్ ప్రాప్తి పథంలో అడ్డంకిగా ఉన్న ఇంద్రియసుఖాల పట్ల రుచి లేకపోవటం.
అహంకార రహితముగా ఉండుట. అహంకారము అంటే "నేను", "నాకు", "నాది" అనే అంతర్గత స్పృహ. ఇది అవిద్య/అజ్ఞానమునకు సూచిక, ఎందుకంటే అది, మనలను మనం ఈ శరీరమే అని భావించే, శారీరిక స్థాయి నుండి జనిస్తుంది. దీనినే 'అహం చేతనా' అని కూడా అంటారు. (నేను అన్న స్పృహ నుండి జనించే గర్వము). అందరూ మహాత్ములూ నొక్కివక్కాణించి చెప్పేదేమిటంటే, భగవంతుడిని మన హృదయము లోనికి ఆహ్వానించాలంటే, మొదట మనలో ఉన్న గర్వమును నిర్మూలించాలి.
జబ మై థా తబ హరి నహిన్, అబ్ హరి హై, మై నాహీన్
ప్రేమ్ గలీ అతి సంకనరీ, యా మే ద్వే న సమాహీ (సంత్ కబీర్)
"'నేను' అన్న భావన ఉన్నప్పుడు, భగవంతుడు అక్కడ ఉండడు; ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, 'నేను' లేను. దివ్య ప్రేమ మార్గము చాలా ఇరుకైనది; దానిలో 'నేను' మరియు 'భగవంతుడు' ఇద్దరూ పట్టరు."
జ్ఞాన యోగ మార్గములో మరియు అష్టాంగ యోగ మార్గములో, ఈ యొక్క 'అహం చేతనా' భావన ను వదిలించుకోవటానికి విస్తృతమైన సాధనా ప్రక్రియలు ఉన్నాయి. కానీ, భక్తి యోగ మార్గములో, అది చాలా సునాయాసముగా వదిలిపోతుంది. మన 'అహం' అన్న పదానికి ముందర 'దాస' (సేవకుడు) అన్న పదం తగిలిస్తాము, దానితో అది దాసోహం (నేను భగవంతుడి సేవకుడిని) గా మారిపోతుంది. ఇక ఇప్పుడు 'నేను' ఏమాత్రం హానికారకం కాదు మరియు ఆత్మ-దృక్పథం అనేది భగవత్-దృక్పథం గా మారి పోతుంది.
జన్మ, మృత్యు, జరా, వ్యాధుల యొక్క దురవస్థ ను సదా గుర్తుంచుకోవటం. ఒకవేళ బుద్ధికి - భౌతిక ప్రగతి లేదా ఆధ్యాత్మిక పురోగతి లలో ఏది ఎక్కువ ముఖ్యమో అనే అయోమయంలో ఉంటే - అప్పుడు దానికి ఆత్మ జ్ఞానమును సంపాదించుకునేందుకు కావలసిన ధృడ సంకల్పమును పెంపొందించుకోవడం కష్టముగా ఉంటుంది. కానీ బుద్ధి కి ఈ ప్రపంచం యొక్క వికృతం పట్ల నమ్మకం కలిగినప్పుడు, అది తన సంకల్పంలో ధృడంగా ఉంటుంది. ఈ ధృడ సంకల్పం పొందటానికి, ఈ భౌతిక లోకంలో, మన ఈ జీవితంలో విడదీయలేనివి గా ఉండే బాధలపై నిరంతర చింతన చేస్తుండాలి. బుద్ధుడిని ఆధ్యాత్మిక పథంలో పెట్టింది ఈ చింతనే. ఆయన ఒక రోగిని చూసి, "ఈ ప్రపంచంలో వ్యాధులు అనేవి ఉన్నాయి నేను కూడా ఏదో ఒకరోజు రోగగ్రస్త మవ్వాల్సిందే." అని అనుకున్నాడు. తరువాత ఒక వృద్ధుడిని చూసి, "ఇక్కడ వృద్ధాప్యం కూడా ఉంది. అంటే నేను కూడా ముసలివాడిని అయిపోవాలి ఒకరోజు." అని అనుకున్నాడు. ఆ తరువాత, ఒక చని పోయిన వ్యక్తిని చూసాడు , "ఇది కూడా జీవనం లో భాగమే, అంటే నేను కూడా ఒక రోజు చనిపోవాల్సిందే" అని తెలుసుకున్నాడు. బుద్ధుడి యొక్క బుద్ధి ఎంత గ్రహణశక్తిగలది అంటే, ఒక్క సారి వీటిని చూసినంతనే అవి ఆయనను ఈ ప్రపంచాన్ని త్యజించేలా చేసాయి. మనకు ఇంకా అంత కుశలత కలిగిన బుద్ధి లేదు కాబట్టి, ప్రపంచం యొక్క వికృతం అవగతం అయ్యే వరకూ, వీటి గురించి నిరంతరం చింతన చేస్తూనే ఉండాలి.
మమకార-ఆసక్తి రహితంగా ఉండుట: అంటే, ప్రాపంచికత్వం పట్ల అనాసక్తి తో ఉండటం. మనకు ఉన్నది ఒక్క మనస్సే మరియు మనం ఆధ్యాత్మిక లక్ష్యములను సాధించాలంటే మనము దానిని భౌతిక వస్తువిషయముల నుండి దూరంచేయాలి. సాధకుడు ప్రాపంచిక మమకార ఆసక్తులకు బదులుగా వాటి స్థానంలో భగవంతుని పట్ల ప్రేమ మరియు మమకారము ను స్థిరపరుస్తాడు.
భార్య (భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటినే పట్టుకునే ఉండకపోవటం. మనస్సుకి కొన్ని విషయముల పట్ల సునాయాసముగా మమకారానుబంధము ఏర్పడిపోతుంది. శారీరిక స్పృహలో, వ్యక్తి అప్రయత్నంగానే కుటుంబసభ్యులను, ఇంటిని - " నావారు, నాది" అనుకుంటాడు. ఇవన్నీ మనసులో తరచుగా తిరుగుతూనే ఉంటాయి మరియు వీటిపై ఆసక్తి మనస్సుని భౌతిక దృక్పథంలోనే కట్టివేస్తాయి. ఆసక్తి/మమకారం అనేది - కుంటుంబ సభ్యులు ఇలాగే ఉండాలి, ఆ విధంగానే ప్రవర్తించాలి అన్న ఆపేక్షను/కోరిక కలుగచేస్తుంది, మరియు ఈ ఆశలు తీరనప్పుడు, అది మానసిక క్షోభకు దారి తీస్తుంది. మరియు అనివార్యముగా, కుటుంబ సభ్యుల నుండి దూరమవ్వటం కూడా సంభవిస్తుంది, తాత్కాలికంగా వారు వేరే చోటికి వెళ్ళినప్పుడు, లేదా శాశ్వతంగా, వారు చనిపోయినప్పుడు. ఇవన్నీ అనుభవాలు మరియు భయాలు మనస్సు పై చాలా భారమును కలిగించి, దానిని భగవంతుని నుండి దూరంగా తీసుకువెళతాయి. కాబట్టి మనము నిత్య శాశ్వతమైన ఆనందాన్ని అన్వేషిస్తుంటే, మనం భార్య (భర్త), పిల్లలు, ఇల్లు వాటి వాటితో వ్యవహరించేటప్పుడు, మన మనస్సు వాటిల్లో చిక్కుకొని పోకుండా, ప్రాజ్ఞతతో ఉండాలి. ఒక నర్సు హాస్పిటల్లో తన విధి నిర్వర్తించినట్టు, లేదా, ఒక టీచర్ తన విద్యార్థుల పట్ల తన విధిని నిర్వర్తించినట్లు, మమకారాసక్తి లేకుండా, వారి పట్ల మన ధర్మ (కర్తవ్యము) నిర్వర్తించాలి.
అనుకూల లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల సమ-భావన తో ఉండటం. పగలు-రాత్రి లాగా సుఖదాయకమైన లేదా కష్టదాయకమైన పరిస్థితులు పిలవకుండానే వస్తుంటాయి. అదే జీవితం. ఈ ద్వందములకు అతీతముగా ఎదగాలంటే, మనయొక్క ఆధ్యాత్మిక బలాన్ని, ప్రపంచం పట్ల వైరాగ్యం ద్వారా పెంచుకోవాలి. జీవితంలో వ్యతిరేక పరిస్థితులలో కూడా చలించకుండా ఉండే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి మరియు ఏదో విజయం సాధించామని గర్వపడే భావనని కూడా విడిచిపెట్టాలి.
నా (కృష్ణుడి) పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి . వైరాగ్యం అంటే కేవలం మనస్సు తప్పుడు దిశలో వెళ్ళటం లేదు అని. కానీ జీవితం అంటే ప్రతికూల పరిస్థితులను కేవలం నివారించటమే కాదు. శ్రేయస్కర విషయాలలో కూడా నిమగ్నమవ్వటమే జీవితం. నిజంగా కోరతగిన జీవిత లక్ష్యము అంటే దానిని భగవంతుని యొక్క చరణారవిందముల వద్ద అంకితం చేయటమే. కాబట్టి , శ్రీ కృష్ణుడు దానిని ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు.
ఏకాంత ప్రదేశాల యందు ఇష్టత. ప్రాపంచిక జనులలా కాకుండా, భక్తులు, ఒంటరితనాన్ని అధిగమించటానికి ఇతరుల సాంగత్యాన్ని కోరుకోరు. వారు సహజంగానే ఏకాంతాన్ని ఇష్టపడుతారు; వారి మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వారు సహజంగానే, ఆధ్యాత్మిక తలపులలో మరింత నిమగ్న మవ్వటానికి ఏకాంత ప్రదేశాలని ఇష్టపడుతారు.
లౌకిక ప్రాపంచిక సమాజం పట్ల విముఖత. భౌతిక ప్రాపంచిక మనస్సుకు సూచిక ఏమిటంటే అది ప్రాపంచిక మనుష్యులు మరియు ప్రాపంచిక విషయాల గురించిన మాటల్లో ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో పురోగతి కోరుకునేవారు సహజంగానే వీటి పట్ల అయిష్టత పెంచుకుని, ప్రాపంచిక సమాజానికి దూరంగా ఉంటారు; అదే సమయంలో, భగవత్ సేవ కోసం, ప్రాపంచికత్వంలో పాలుపంచుకోవలసి వస్తే, భక్తుడు దానిని స్వీకరిస్తాడు మరియు మానసికంగా దానిచే ప్రభావితం కాకుండా ఉండే సామర్ధ్యాన్ని పెంచుకుంటాడు.
ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరముగా ఉండుట. ఏదేని విషయమును కేవలం సిద్ధాంతపరంగా (theoretically) మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. ఒకనికి కోపము అనేది మంచిది కాదు అని తెలిసి ఉండవచ్చు, కానీ దానికి పదే పదే వశమై పోతూ ఉండవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవనంలో ఆచరణలో పెట్టటం నేర్చుకోవాలి. గంభీరమైన సత్యాలని ఒక్కసారి వినటం ద్వారా ఇది సాధ్యం కాదు. వాటిని విన్న తరువాత, వాటిపై పదేపదే చింతన చేయాలి. దివ్య ఆధ్యాత్మిక యదార్ధాలపై నిరంతర చింతన యే ఇక్కడ శ్రీ కృష్ణుడు చెప్తున్న ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరత్వం.
పరమ సత్యము కొరకై ఆధ్యాత్మిక అన్వేషణ . జంతువులు కూడా శారీరిక క్రియలైన తినటం, నిద్రించటం, మైథునం మరియు రక్షించుకోవటం వంటి పనులను చేస్తాయి. కానీ, భగవంతుడు ప్రత్యేకంగా మనుష్యులకు జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తి ఇచ్చాడు. అది, శారీరిక సుఖాలను విలాసంగా అనుభవించటానికి ఇవ్వబడలేదు, "నేను ఎవరిని?", "నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?", "నా జీవిత లక్ష్యము ఏమిటి?", "ఈ ప్రపంచం ఎలా సృష్టించబడినది?", "ఆ సృష్టి కర్తకి నాకు ఉన్న సంబంధము ఏమిటి?" "నా జీవన ప్రయోజనాన్ని ఎలా సఫలం చేసుకోవాలి?" అన్న ప్రశ్నలపై చింతన చేయటానికి ఆ శక్తి ఇవ్వబడినది. తత్త్వపరమైన సత్యాన్వేషణ మన ఆలోచనను పశుస్థాయి నుండి ఉన్నతంగా చేసి, మరియు మనలను భగవత్ ప్రాప్తి ఉపదేశమును వినటం మరియు చదవటం దిశగా తీసుకువెళుతుంది.
ఈ పైన వివరించబడిన సుగుణములు, అలవాట్లు, ప్రవర్తన మరియు ద్రుక్పథం మనలను జ్ఞానము, వివేకము పెంచుకునే దిశగా తీసుకువెళుతాయి. వీటికి వ్యతిరేకమైనవి అహంకారము, కపటత్వము, హింసాప్రవృత్తి, ప్రతీకారము, మోసము, గురువు పట్ల అమర్యాద, శరీరమనస్సుల అపరిశుభ్రత, చంచలత్వము, ఆత్మనిగ్రహం లేకుండుట, ఇంద్రియ వస్తువిషయాల పట్ల లాలస, దురభిమానము, భార్య (భర్త), ఇల్లు, పిల్లలు వంటి వాటిపై యావ, మొదలగునవి. ఇటువంటి స్వభావం ఆత్మ-జ్ఞాన ఎదుగుదలను కుంటుపడేస్తుంది. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని అజ్ఞానము మరియు చీకటి అని అంటున్నాడు.
*కోరికల కర్మాగారము*           
మనిషిలోని మనసు చాలా చంచలమైంది. దాని యాంత్రికతకు అంతం లేదు. మనిషి బాల్యం నుంచి ఏవేవో వాంఛలకు అలవాటుపడతాడు. ఒకదాని తరవాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది. జీవితాంతం అలా మనసు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. నిజానికి మనిషి తనలోని మనసును గురించి అవగాహన కల్పించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం. ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్లు వినడం మానేస్తే సరి. మనసు నిండా కోరికలు, ఆలోచనలను నింపకూడదు.
మనసును స్థిమితపరచడం ఎలా? కోరికల్ని నియంత్రించడం ఎలా?--
ఇందుకోసం మనిషి సాధన చేయాలి. మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి. అందులోని చెడును తెలుసుకోవాలి. మానవత్వాన్ని, దైవత్వాన్ని అవగాహన చేసుకోవడంవల్ల కోరికల ఉద్ధృతి తగ్గుతుంది. సరిగ్గా అప్పుడు మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోవాలి. మనలో ఏం జరుగుతుందో గమనించడం అవసరం. మనసులోకి ప్రవేశిస్తున్న ప్రతి వాంఛను, ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండి, అలాంటి గమనిక కొనసాగినప్పుడు మనసు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది. ఆ తరవాత మన మనసులోకి మనం ప్రవేశించగలం. సాధారణంగా మనసు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికో ప్రయోజనం కల్పించి, మరొకదానితో పోల్చడం చేస్తుంది. అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా, నిర్వ్యామోహంగా మనసు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి. నిశ్చలమైన స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనకు కోరికలు ఉండవు. ప్రయోజన ఆపేక్షా ఉండదు. ఆశలు, భయాలు కలగవు.  ఈ స్థితిని నిలుపుకోవడం ఎలా??
వస్తున్న ఆలోచనలను గమనించాలి. వాటిని గమనిస్తే చాలు- మనసు పరిధిలోకి వ్యక్తిగతమైన శక్తి అపరిమితమవుతుంది. అప్పుడు మనసును వ్యక్తిగత పరిధినుంచి తప్పించడమే మనం చేయాల్సిన పని. నెమ్మదిగా ముందుకు సాగాలి. ఈ ఆలోచన లేని ఏకాగ్రతను ధ్యానం అనవచ్చు. నెమ్మదిగా నిశితంగా మనలోని మనసును గమనించడంవల్ల ఏ ఘర్షణ లేకుండానే మనోభూమిక నుంచి వెలుపలికి రావచ్చు. మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలనా పెరిగే కొద్దీ- ఆలోచనలు, కోరికలు సమసిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం- మనల్ని మనం తెలుసుకోవడం! ఇవి తెలివితేటలతో సాధించేవి కాదు. మన స్వప్రేరణతో అనుభవించవలసిందే. మనసు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? సాధ్యమే, కాని సాధన చాలా కష్టం. ఎందుకంటే నిరాపేక్షతో మనసును గమనించడం మనకు అలవాటు లేని పని. మన నరాల నిర్మాణం అందుకు సహకరించదు. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడి లేవు. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం. ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదు. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది. మనశ్శాంతిని, ప్రశాంతిని, ఆనందాన్ని ప్రసాదించే శుద్ధ చైతన్యాన్ని అన్వేషించాలి.
సంపూర్ణ అవగాహనతో మన సమస్త శక్తులను వెచ్చించి కృషి చేయాలి. సరే! మరి ఈ యాంత్రిక మానసిక క్రియలను ఎలా వదిలించుకోవాలన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదు. మౌలికంగా ప్రస్తుత స్థితినుంచే సాధన ప్రారంభించాలి. మనసు చర్యలను నెమ్మది నెమ్మదిగా గమనిస్తూ ఉండాలి. ఉత్తినే గమనించండి చాలు. ఆలోచనా ప్రవాహం నెమ్మదిస్తుంది. ఉద్ధృతి తగ్గుతుంది. రానురాను మనసు మనల్ని వశపరచుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉంటుంది. విచక్షణ, ఆలోచన, వాంఛ లేనప్పుడు ఆలోచనలు నిలిచిపోతాయి. ఎంత అధికశక్తిని ఏకాగ్రతపై వెచ్చించగలమో, అంతగా భౌతికమైన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు ఆలోచించకుండానే బాహ్యాన్ని మరిచి పరాన్ని గమనించగలుగుతాం. ఆ పైన మనసు చైతన్యమై ప్రస్ఫుటమవుతుంది. మనసనేది కోరికల కర్మాగారం. ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే. మన గురించి మనం అర్థం చేసుకొన్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది. అప్పుడే మనసు చేసే పెత్తనం నుంచి మనం చైతన్యం, స్వేచ్ఛ పొందగలుగుతాం. ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. మనసును హృదయంతో జతచేయాలి. అప్పుడు  మన ప్రతిభ బయటకొస్తుంది.ఎల్లెడెలా ఆధ్యాత్మికానందం మన సొంతమవుతుంది.                                    
బ్రహ్మవిద్య – దాని ఔన్నత్యం”
విధ్యలలోకేల్ల శ్రేష్టమైనది , అతిరహస్య మైనదియగు బ్రహ్మవిద్యను భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ ఈ విధముగా తెలిపినారు 
దేనిని తెలుసు కొనినచో ఆశుభరూపమగు ఈ సంసార బంధమునుండి నీవు విదివడుదువో  అట్టి అతి రహస్యమైన , అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అర్జనుని ముందర పెట్టుకొని సమస్త మానవాళికి ప్రభోదించినారు “ గుహ్యతమం “ అనిచేప్పుట వలన ఈ భోధ రహస్యముయొక్క పరాకాష్టను సూచించు చున్నది. ఈ బ్రహ్మవిద్య పొందే అధికారము సమర్ధ వంతుడైన మనుజునికే కలదు. 
శుద్ధ చిత్తుని యందే బ్రహ్మ జ్ఞానము ప్రవేశించును – అసూయ , ఈర్ష్య , ద్వేషాలతో , రగిలే మలిన చిత్తునియందు ప్రవేశించదు.  దంభ ,ధర్పాది దుర్గుణములు తొలగించుకొని నిర్మలముగా నున్నప్పుడే బ్రహ్మజ్ఞానము ప్రాప్తించును. అసూయ అనునది దుర్గుణములకు రాజు లాంటిది.  అది ఒక వేరుపురుగు వంటిది.  వేరుపురుగు చేట్టునంతయు గుల్లచేయునట్లు అసూయ జీవునియందు ప్రవేశించినచో అతడంత వరకు చేసిన సాధన అంతయు ఒక్క త్రుటిలో భ్రష్టము కాగలదు. కనుకనే పరమార్ధ రంగమున ఎంతయో సాధనచేసినవారుకూడా ఒక్కొక్కప్పుడు ఈ అసూయా రాక్షసికి బలియై తమ సాధన సర్వస్వాన్ని గోల్పోయి పతనమొందు చున్నారు    అట్టి అసూయను పోగొట్టుకొని అర్హతను పొందినవారికి సద్గురువులు,  అతి రహస్యములైన అంశము లన్నింటిని బహిర్గతములు చేయుదురు. జనన మరణ రూప ఆశుభమునుండి విడివడుటయే యగును. పుట్టుక , చావు ,దు:ఖము ,రోగము , ముసలితనము మొదలగు ఆశుభములతో గూడుకోనిన ఈ భయంకర సంసారమునుండి అది జనులను విముక్తులుగా జేయును. కావున దు:ఖమును పోగొట్టుకొన దలంచువాడు ఈ బ్రహ్మ విజ్ఞానమును తప్పక సంపాధించవలెను.
జనులు ఈ సంసారమును జూచి ఏమో గొప్పగ తలంచుకోనుచున్నారు,  కాని శ్రీ కృష్ణ పరమాత్మ దాని నంతయు, “ అశుభముగ ” వర్ణించెను, ఏలయనిన అది అంతయు అసత్యమై , దృశ్యరూపమై , ఆత్మేతరమై , క్షణికమై , నశ్వరమైయున్నది. అశుభమును నాశ్రయించినవాడు ఆశుభమునే పొందును. శుభమును ఆశ్రయించినవాడు శుభమునే పొందును.  ఈ ప్రపంచమున ఆత్మయోకటియే , దైవ మొకటియే శుభము. కావున దానినే ఆశ్రయించవలెను.  అందువల్ల అశుభమునుండి అతడు విముక్తిని బడయగలడు. ఈ ప్రకారముగా జ్ఞాన విజ్ఞానముల నాశ్రయించు వారికి కలుగు ప్రత్యక్ష పలితము సంసారదు:ఖ రాహిత్యము , నిరతిశయ ఆత్మానందము ప్రాప్తి అయివున్నది.  కాబట్టి విజ్ఞులేల్లరు అనుభవ పూర్వక బ్రహ్మ తత్వము నేరంగి బ్రహ్మవిద్యలో కొనసాగండి.
ఈ బ్రహ్మవిద్యను ప్రత్యక్షముగా తెలుసుకొనవచ్చును. అనుభూత మొనర్చుకోవచ్చును. ఇది ప్రత్యక్ష పలమునే కలుగ జేయునుగాని పరోక్ష పలమునుగాదు. ఏలయనిన , ఏక్షణమున సాధకు డీ బ్రహ్మవిద్యను అనుభూత మొనర్చు కొనుచున్నాడో.  ఆ క్షణముననే అతడు సాక్షాత్ బ్రహ్మమే యగుచుండుట కనబడుచున్నది.  కావున ఇది పలితమును కలుగ జేయునో , లేదో , యనుసందేహమునకు ఆస్కారములేదు. సుసుఖం “ ఈ బ్రహ్మ విద్యను ఆచరించుట చాల తెలికయని చెప్పబడినది. మనస్సు నందలి దుస్సంస్కారములను , వాసనాజాలమును ప్రయత్న పూర్వకముగా తొలిగించుకొనినచో , ఇక స్వస్వరూప సాక్షాత్కారము నందు ఎలాంటి పరిశ్రమయులేదు. కనుకనే శాస్త్రములందీ ఆత్మానుభూతి పుష్పములను నలుపుతకంటేను,  శ్వాసను పీల్చుట కంటెను గూడ సులభమని వచింప బడినది.  బ్రహ్మానుభవము అతిసులబమైనది.  ఈ ప్రకారముగా భగవానుడు గీతయందు సాధకులకు ధైర్యమును గోల్పుచున్నాడు. ఈ విద్య ధర్మములకు మూలమున్ను , సనాతనమున్ను ,అవ్యయమును , అయివున్నదనియు చెప్పబడెను. దానియందు శ్రద్ధలేనివారు దైవమును భోందజాలరనియు, సంసార కూపముననే తిరుగాడుచుందురనియు వచించుచున్నారు.  ధర్మమునందు శ్రద్ధలేనట్టి మనుజులు నన్ను పొందని వారై మృ త్యురూపమైన సంసార మార్గామునందే తిరుగు చున్నారు.  లౌకిక రంగమునందు గాని , పరమార్ధ రంగమునగాని ప్రతి కార్యమునందును శ్రద్ధ చాల అవసరము. ఒకనికి ఒక వస్తువునందుకాని , ఒక కార్యమందుగాని ఎంతెంత శ్రద్ధ యుండునో అంతంత చక్కగా ఆ వస్తువు పలించుచుండును.  ఆ కార్యము నెరవేరు చుండును. కనుకనే బ్రహ్మ జ్ఞానమునందు ఎవనికి శ్రద్ధ ఉండునో అతడు శ్రద్ధాపూర్వకంగా దానిని సాధనా చేసి నన్ను చేరగలరనియు. అట్లు శ్రద్ధ లేనివారు తన్నుపొంధజాలనివారై మృ త్యురూపమగు సంసారముననే పది తిరుగుదురని సెలవిచ్చెను. కావున విజ్ఞులగువారు చక్కగా యోచించుకొని , దు:ఖప్రధమగు సంసారమార్గమున పడక, ఆనంద ప్రధమగు ధైవసాక్షాత్కారమునకు బడయుటకు  శ్రద్దయను ఈ సుగుణమును చేపట్టి బ్రహ్మ విద్యను చక్కగా అనుష్టించి తరించవలెను. లోకమున సామాన్య కార్యములగు వంట , సేద్యము మున్నగునవి, చక్కగా జరుగుతకే ఎంతయో శ్రద్ధ అవసరమై యుండ ఇక బ్రహ్మ విధ్యాసాధనమున వేరుగా చెప్పవలెనా ?
సామాన్యముగ కొందఱు జనులు భోగావిలాసములకు లోనై,  ఈ సంసారమును స్వర్గ తుల్యముగా బావించుచుందురు.  అమృత ప్రాయముగా దానిని వర్ణించుదురు.  కాని సర్వజ్ఞుడగు పరమాత్మ దానిని మృత్యు రూపముగా వర్ణించెను. అదియే దాని నిజరూపము. మాయా ప్రబావముచే ఈ సంసారము పైకి “ డాబు “ గా కనిపించినను లోన మృత్యు రూపమే కలిగియున్నది.
పవిత్రత అనే అంతరజ్యోతిని ఎల్లప్పుడూ ధరించి దైనందిన కార్యాలను నిర్వర్తించాలి. భగవంతుని ఉనికి నిశ్శబ్ధంలోనే ప్రస్ఫుటమవుతుంది. ఆ మౌనం బాహ్యమైనది కాదు, అంతరంగం యొక్క నిశ్శబ్ధస్థితి. మనలో చంచలత్వం, అనిశ్చితి ఉన్నంత వరకూ పావనత్వపు ప్రతిబింబం మన నుండి వెలువడదు. అటువంటప్పుడు అంతఃశోధన సాధ్యపడదు. మన హృదయం అన్ని అలజడుల నుండి విముక్తిని పొందగలిగినప్పుడే మనకు భగవంతుని ఉనికి తాలూకు కిరణాల స్పర్శ తెలుస్తుంది. అప్పుడే మనలో నూతనంగా పవిత్రతా వెల్లువ యొక్క ఆవిర్భావం జరుగుతుంది.
స్థిరచిత్తం.కార్యదీక్ష
జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలు పెట్టిన పనిని పూర్తిచెయ్యాలంటారు మన పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమిది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం పనుల్ని సఫలం చేస్తాయి.
ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.
ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు మరియు మత్స్యయంత్రం ఛేదనకు పూనుకొన్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు.. రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.
అలాగే మనకు కూడా,,,,    కార్యదీక్ష,,, తత్పరత సామర్థ్యం తో పాటు, సమయస్పూర్తి తో నిర్ణయాలు  తీసుకునే పరిజ్ఞానం కూడా ఉంటే  విజయం తథ్యం

Related Posts