YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కారడవిలో కొలువైన ఇష్టకామేశ్వరి

కారడవిలో కొలువైన ఇష్టకామేశ్వరి

ఆ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టి... ఏదయినా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. చతుర్భుజాలతో దర్శనమిస్తూ... భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలసి... పూజలు అందుకుంటున్న ఆ దేవతే ఇష్టకామేశ్వరి. ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్నా... నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని చెబుతారు ఇష్టకామేశ్వరిని దర్శించుకున్న భక్తులు. శ్రీశైలానికి ఇరవైకిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవిని చూడాలంటే కాస్త సాహసం చేయాలని అంటారు. కామేశ్వరి దేవి ఆలయం.... భారతదేశంలో ఒకేఒక్క చోట ఉండటం, అది శ్రీశైలంలోనే కావడం విశేషం. ఇక్కడ కామేశ్వరి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచింది. పార్వతీదేవి ప్రతిరూపంగా పిలిచే కామేశ్వరి సన్నిధి కర్నూలు-ప్రకాశం జిల్లాల సరిహద్దులో సముద్రమట్టానికి 2128 అడుగుల ఎత్తులో ఉంటుంది. చాలా చిన్న గుడిలో కొలువై ఉన్న ఈ అమ్మను దర్శించుకుని నుదుటన బొట్టు పెట్టి.... పెరుగన్నం, పొంగలిని నివేదిస్తే ఏ కోరి కైనా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారు స్వయంభువుగా కొలువైన ఈ మహిమాన్వితమైన క్షేత్రం వెనుక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. చారిత్రక నేపథ్యం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఎందరో యోగులూ సిద్ధులూ తపస్సు చేసేవారట. అలా అమ్మవారిని స్మరించుకునే వారికోసమే పార్వతీ స్వరూప మైన కామేశ్వరి ఇక్కడ వెలసిందని చరిత్ర చెబుతోంది. అయితే చాలామందికి తెలియకపోవడం వల్ల ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేదట. కాలక్రమంలో శ్రీశైలానికి వచ్చే భక్తులూ, యాత్రికుల ద్వారా ప్రపంచానికి ఈ ఆలయం గురించి తెలిసిందని అంటారు. అటవీ ప్రాంతం మధ్యలో కనిపించే ఈ చిన్న గుడి క్రీ.శ 8-10 శతాబ్దాల మధ్య కాలానికి చెంది ఉండొచ్చని అంచనా. ఇప్పటికీ చాలా చిన్నగా కనిపించే ఈ ఆలయ గోపుర నిర్మాణం కూడా శ్రీశైల మల్లికార్జున గర్భగుడి విమానాన్ని పోలినట్లుగా ఉండటం విశేషం. దీన్ని బట్టి ఇది చాళుక్యుల కాలం నాటి దేవాలయం కావొచ్చని అంటారు చరిత్రకారులు. శ్రీశైలానికి ఉత్తరవాహినిగా పాతాళ గంగ ఉన్నట్లుగానే ఇష్టకామేశ్వరి ఆలయానికి ఎదురుగా ఉత్తరదిశలో ఒక వాగు ఏడాది పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడున్న అమ్మవారి విగ్రహాన్ని పోలిన విగ్రహం భారతదేశంలో మరెక్కడా ఇంతవరకూ కనబడలేదన్నది ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. బొట్టు పెడతారు శక్తి క్షేతంగా, సిద్ధ క్షేత్రంగా వర్ధిల్లే ఈ ప్రాంతంలో కామేశ్వరీ దేవి ముకుళిత నేత్రాలతో, ధ్యానముద్రలో, చతుర్భుజాలతో, పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తుంది..... రెండు చేతుల్లో కలువపూలూ, ఒక చేతిలో రుద్రాక్ష, మరో చేత్తో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది. భక్తులు ఇరుగా ఉండే ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే కూర్చొని వెళ్లాలి. అలాగే వెళ్లి స్వయంగా అమ్మవారికి బొట్టు పెడతారు. ఇలాంటి సంప్రదాయం మరెక్కడా కనిపించదనీ... అమ్మవారి నుదుట కుంకుమ పెడుతున్నప్పుడు ఆ బాగం మెతగా ఉంటుందనీ చెబుతారు.ఈ ఆలయంలో కొన్ని తరాలుగా చెంచులే పూజారులుగా వ్యవహరించడం విశేషం. ఈ ఆలయ నిర్వహణకు అవసరమైన ధూపదీప నైవేద్యాలన్నీ శ్రీశైల దేవస్థానం నుంచే వస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులైన చెంచులు ఈ ఆలయాన్ని గుప్తనిధులు తవ్వే దుండగుల నుంచి కాపాడుకుంటుంటారు. ఎలా చేరుకోవచ్చంటే శ్రీశైలం నుంచి డోర్నాల మార్గంలో 11 కి.మీ. ప్రయాణించి అక్కడి నుంచి ఎడమ వైపు నెక్కంటి, పాలుట్ల అడవి మార్గంలో వెళ్లాలి. ఈ ప్రయాణం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక్కడకు ద్విచక్రవాహనాల్లో లేదా కార్లలో వెళ్లలేరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రోడ్డు గతుకులమయంగా ఉండి... వెళ్లడానికి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. నడిచి వెళ్లడం కూడా కష్టమే కాబట్టి శ్రీశైలం వరకూ వెళ్తే... అక్కడి నుంచి ప్రత్యేకంగా కొన్ని జీపులుంటాయి. అయితే.. దర్శనం అయ్యాక సాయంత్రం అయిదులోపు మళ్లీ తిరుగు ప్రయాణం చేయాలని చెబుతారు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts