YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఊర్మిళాదేవి కథ

ఊర్మిళాదేవి కథ

రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.
’14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే… ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,’ అని ఎవరో గుర్తుచేశారు. ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ”14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,’ అని అడిగారు. ”మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,” అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ”లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!” అని పరిహాసంగా అడిగారట రాములవారు. ”అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,” అని బదులిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా.. ఆయన ప్రసన్నులయ్యారు. ”తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!” అన్నారట రాములవారు. రాములవారి అనుగ్రహానికి ఊర్మిళకళ్లు చెమ్మగిల్లాయి. కానీ ”ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,” అని వేడుకుందట ఊర్మిళ. ”కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను.నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,” అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయంకనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.
ఓం నమో నారాయణాయ

Related Posts