YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

బిజినెస్ సిటీగా శంషాబాద్

బిజినెస్ సిటీగా శంషాబాద్

హైదరాబాద్, ఏప్రిల్ 20, 
శంషాబాద్‌కు అన్నీ కలిసివస్తున్నాయి. నగరంలో ఎక్కడాలేని విధంగా ఎయిర్‌పోర్టు, రైలు మార్గం, జాతీయ, అంతర్జాతీయ రోడ్లు ఉన్నాయి. వీటికి తోడు త్వరలోనే మెట్రో రైలు మార్గం సైతం అందుబాటులోకి రానున్నండటంతో ఎయిర్‌ పోర్టు పరిసరాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. అన్నిరకాలుగా రవాణాసౌకర్యం ఉండటంతో జాతీయ, అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు మొదలుపెడితే శంషాబాద్‌ మరో బిజినెస్‌ డిస్ట్రిక్‌గా మారనున్నది.ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్‌ రింగురోడ్డును నిర్మించిన హెచ్‌ఎండీఏ శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. శంషాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు ఇంటర్‌చేంజ్‌ సమీపంలో సుమారు 300లకు పైగా ఎకరాల్లో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి తోడు తెలంగాణ పరిశ్రమల శాఖ మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్‌ సిటీ, హార్డ్‌వేర్‌ పార్కు, శ్రీశైలం జాతీయ రహదారిపై ఫార్మాసిటీ, శంషాబాద్‌-షాబాద్‌ మార్గంలోని చందనవెళ్లిలో మరో పారిశ్రామిక వాడ, బెంగళూరు జాతీయ రహదారిలోని కొత్తూరు, తిమ్మాపూర్‌, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో శంషాబాద్‌ పరిసర ప్రాంతాలు భవిష్యత్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా మారనున్నాయి. నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్‌ శరవేగంగా విస్తరించడానికి గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ కీలకంగా మారింది. అదేతరహాలో దక్షిణ భాగంలో ఉన్న శంషాబాద్‌ ప్రాంతంలో సరికొత్త వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను విస్తరించేందుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి.ఔటర్‌ రింగు రోడ్డు పెట్టుబడులకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఉన్న 19 ఇంటర్‌చేంజ్‌లు కేంద్రంగా హెచ్‌ఎండీఏ రకరకాల వ్యాపారాలకు అవకాశం కల్పిస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో ప్రధానంగా శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌ వద్ద సుమారు 300ఎకరాల్లో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు హబ్‌ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే సరుకు రవాణా రంగంలోనే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థలో శంషాబాద్‌ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత నెలకొంది. దీంతో ఈ ప్రాంతంలో రోడ్డు, రైలు, విమాన మార్గం మూడు ఒకే చోట కలిసి ఉండటంతో హెచ్‌ఎండీఏ మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు హబ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నది.శంషాబాద్‌కు కుడి, ఎడమలుగా రెండు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అమెజాన్‌ క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించింది. ఇప్పటికే చందన వెళ్లి పారిశ్రామిక వాడలో సుమారు 500ఎకరాల్లో ఒక డేటా సెంటర్‌ను అమెజాన్‌ ఏర్పాటు చేస్తుండగా, అదేవిధంగా ఫార్మాసిటీ సమీపంలో మరో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. అయితే రోడ్డు, రైలు, విమానయాన మార్గాలు ఒకే చోట ఉండటంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు సంస్థలు లాజిస్టిక్‌ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, డెలివరీ వంటి సంస్థలు సరుకు రవాణాకు సంబంధించి భారీ విస్తీర్ణంలో గోడౌన్‌లను నిర్మించి లాజిస్టిక్‌ సేవలను నిర్వహిస్తున్నాయి.ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈవీ పాలసీ (ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌) లో భాగంగా మహేశ్వరం, చందనవెళ్లిలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇచ్చి పలు కంపెనీలు ఇక్కడ ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసేలా ఒప్పందాలు చేసుకుంది. ఇందుకోసం వందలాది ఎకరాలను సిద్ధం చేసి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించింది.శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒకవైపు హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి, మరో వైపు శ్రీశైలం హైవే ఉంది. ఈ రెండు జాతీయ రహదారుల వెంబడి పలు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వీటిలో తుక్కుగూడ, మహేశ్వరం వద్ద హార్డ్‌వేర్‌ పార్కు, ఈ సిటీ, కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ, చందనవెళ్లి, కొత్తూరు, తిమ్మపూర్‌ వంటి పారిశ్రామిక వాడలు, ఇటీవల హైతాబాద్‌-చందనవెళ్లి ప్రాంతంలో మరో పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ పారిశ్రామిక వాడల్లో పలు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించగా, మరి కొన్ని కంపెనీల పనులు పురోగతిలో ఉన్నాయి.

Related Posts