
హైదరాబాద్
తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై ఎవరు ఏం చేశారనే అంశంపై ఓపెన్ డిబేట్ కు సవాల్ విసరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరించారు. సీఎం ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టంగా ప్రకటించిన కేటీఆర్, ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ క్లబ్కు రావచ్చన్న వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విపరీతంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరే అవకాశా న్ని పరిగణనలోకి తీసుకుని, పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. కేటీఆర్ ముందుగా చెప్పినట్టు చింతమడక, కొడంగల్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఎక్కడైనా చర్చ జరపడానికి తాను సిద్ధమని ప్రకటించినప్పటికీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా ఎంపిక చేశారు. రాజకీయ చర్చ పేరుతో మొదలైన ఈ పరిణామం, పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.