YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆక్సిజన్ సరఫరా చేస్తున్న స్టీల్ ప్లాంట్

ఆక్సిజన్ సరఫరా చేస్తున్న స్టీల్ ప్లాంట్

విశాఖపట్టణం, ఏప్రిల్ 22, 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గొంతునులిమేపని మోడీ ప్రభుత్వం చేస్తున్నా.... కోవిడ్‌ రోగుల ప్రాణాలు కాపాడే పని ఉద్యోగులు చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థగా ఆక్సిజన్‌ సరఫరాచేసి కోవిడ్‌ రోగుల ప్రాణాలను కాపాడే బాధ్యతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ కోవిడ్‌ ఆస్పత్రులకు 100 టన్నులకుపైగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న స్టీల్‌ప్లాంట్‌, మహరాష్ట్రకు 140 నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ పంపించేందుకు సిద్ధపడింది. స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి అవసరాలకు తయారుచేసుకున్న లిక్విడ్‌ ఆక్సిజన్‌ను కోవిడ్‌ రోగుల ప్రాణాలు నిలబెట్టేందుకు 150 టన్నుల వరకు ఆక్సిజన్‌ను మహరాష్ట్రకు ఇవ్వనుంది. ఆక్సిజన్‌ తీసుకెళ్లేందుకు 10 ట్యాంకర్లు  రాత్రికి స్టీల్‌ప్లాంట్‌కు చేరుకుంటాయని వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశంలోని రైల్వే చరిత్రలో రైలుమార్గం గుండా ట్యాంకర్లతో ఆక్సిజన్‌ పంపించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ట్యాంకర్లు వచ్చిన వెంటనే భద్రతను పరిశీలించి ఆక్సిజన్‌ నింపనున్నారు. కొత్తప్లాంట్లలో ఒక్కో ట్యాంకు ఆక్సిజన్‌ నింపడానికి గంటన్నర నుంచి రెండు గంటలు పట్టే అవకాశముంది. బుధవారం ట్యాంకర్లను పంపించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో ఐదు ఆక్సిజన్‌ తయారీ యూనిట్లున్నాయి. రోజుకు 500 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తిచేసే సామర్ద్యం కల్గిన యూనిట్లు మూడు, 850 టన్నులు ఉత్పత్తిచేసే సామర్ద్యం కల్గిన యూనిట్లు రెండు వున్నాయి. ఈ ఐదు యూనిట్ల ద్వారా రోజుకు గరిష్టంగా 3,200 టన్నులు ఉత్పత్తి అవుతోంది. దీంట్లో ప్లాంట్‌ ఉత్పత్తి అవసరాల కోసం 70 శాతం వరకు వినియోగమవుతోంది. మిగిలిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ను ప్లాంట్‌ రిజర్వులో వుంచుతోంది. కోవిడ్‌ తీవ్రత పెరగడంతో రోగుల ప్రాణాలు నిలబెట్టేందుకు ఆక్సిజన్‌ అవసరం పెరిగింది. రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వుండడంతో తమ శక్తి మేరకు స్టీల్‌ప్లాంట్‌ ఆక్సిజన్‌ను సరఫరాచేస్తోంది. 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు ఏడాది కాలంలో సుమారు 8,800 టన్నుల ఆక్సిజన్‌ను కెజిహెచ్‌ సహా రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రులకు సరఫరాచేసింది. ఇప్పుడు రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రులకు రోజుకు వంద టన్నుల ఆక్సిజన్‌ అందిస్తున్నది. ఆక్సిజన్‌ అవసరాన్ని బట్టి రోజుకు 130 టన్నులు సరఫరాచేసిన సందర్భాలులేకపోలేదు.

Related Posts