YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఊపందుకొన్న వరి కోతలు

ఊపందుకొన్న వరి కోతలు

కరీంగనర్, ఏప్రిల్ 22, 
కరీంనగర్‌ రూరల్‌ మండలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. పొలాల్లో ఎటు చూసినా వరికోత యంత్రాలు, ట్రాక్టర్లే దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయడంతో పాటు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. గత యాసంగిలో సుమారు 11,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈసారి 12,900 ఎకరాల్లో సాగు చేశారు. దీనికి తోడు పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు ఉత్సాహంగా సాగు చేస్తున్నారు. కాగా, వానకాలంలో 23 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. యాసంగిలో 24,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో వరికోతలు ఊపందుకోవడంతో ఎటు చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 20 శాతం కోతలు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులు వరి కోయగానే సంబంధిత ఏఈవోల వద్ద పేరు నమోదు చేసుకొని, టోకెన్‌ తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు. కాగా, దుర్శేడ్‌ సింగిల్‌ విండో ఆధ్వర్యంలో దుర్శేడ్‌, చేగుర్తి, మొగ్దుంపూర్‌, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, గోపాల్‌పూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్‌ సింగిల్‌ విండో పరిధిలో బొమ్మకల్‌, చెర్లభూత్కూర్‌, తాహెర్‌ కొండాపూర్‌, ఫకీర్‌పేట, దుబ్బపల్లి, జూబ్లీనగర్‌, నగునూర్‌, సీతారాంపూర్‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, కమాన్‌పూర్‌, నాగులమల్యాల, ఎలగందులలో, ఐకేపీ ఆధ్వర్యంలో బహ్దూర్‌ఖాన్‌పేట, చామనపల్లి, ఎలబోతారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రాల్లో తాగునీరు, శానిటైటర్‌, ఎలక్ట్రానిక్‌ కాంటాలు అందుబాటులో ఉంచుతున్నారు.

Related Posts