YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ పై రాములమ్మ లెక్కలు వేరయా

సాగర్ పై రాములమ్మ లెక్కలు వేరయా

నల్గొండ, మే 4, 
తెలంగాణలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన విషయం తెల్సిందే. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ 18,478 ఓట్ల మెజారిటీతో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికలో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ జరిగింది. ఈ ఎన్నికలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఈ ఫలితాలపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుపై ఆ పార్టీ జబ్బలు చరుచుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని ఒక లక్ష 89 వేల పైచిలుకు ఓటర్లలో దాదాపు లక్ష మంది టీఆర్‌ఎస్‌ను వద్దనుకున్నారన్న విషయం రుజువైందని వ్యాఖ్యానించారు. అలానే ఈ గెలుపు కోసం ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఓటర్లను ఒత్తిడికి గురి చేసిన సంగతి సుస్పష్టమవుతుందని ఆరోపించారు. ఇక అటు రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పైన కూడా విజయశాంతి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి , నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఎంతో చేశారంటూ బలమైన ప్రచారం జరిగినా ఆయన ఓటమి పాలు కావటం గమనిస్తే తెలంగాణ ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్‌ని వద్దనుకున్నట్టు ఓటు ద్వారా చెప్పకనే చెప్పారని అన్నారు.ఇక ఈ ఎన్నికలో బీజేపీ ఓటమిని విజయశాంతి వెనకేసుకొచ్చారు. సాగర్ ఉపఎన్నిక అత్యంత ప్రత్యేక పరిస్థితులలో జరగడమే కాక, సానుభూతి పవనాలు కూడా ప్రభావితం చేశాయన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. ఈ మధ్యనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన దుబ్బాక ఎన్నికలోనూ బీజేపీ సాధించిన విజయం… రాబోయే శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి ప్రత్యామ్నాయం కమలదళమేనన్న సంకేతాలు వెలువడ్డాయని అన్నారు.
టీటీడీపీ..అయిపాయె
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఫలితం కమలనాథులకు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపినా డిపాజిట్‌ కూడా దక్కకపోవడం బీజేపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న తరుణంలో సాగర్‌ ఉప ఎన్నిక ఫలితం కమలనాథులకు మింగుడు పడటం లేదు. సాగర్‌ ఎన్నికలో గెలిచి గ్రామీణ తెలంగాణలోనూ పుంజుకుంటున్నామని చెప్పుకోవాలని భావించినా.. అలా జరగకపోవడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి రవినాయక్‌కు 7,676 ఓట్లే రావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డిని కాదని.. లంబాడా సామాజిక వర్గానికి చెందిన రవినాయక్‌ను బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది. అయితే, ఈ ఎన్నికలో గెలుస్తామని లేదా రెండో స్థానంలో నిలుస్తామనే ఆశలు బీజేపీ నాయకత్వంలో మొదటి నుంచీ కనిపించలేదు. కానీ, ఎస్టీ అభ్యర్థిని రంగంలోకి దింపిన నేపథ్యంలో పరువు నిలుపుకునే ఓట్లు వస్తాయని, కనీసం 20వేలకు పైగా సాధిస్తే తాము గెలిచినట్లేనని ఆ పార్టీ నేతలు భావించారు.బీజేపీ ప్రయోగించిన మంత్రం పనిచేయకపోవడంతో రవినాయక్‌ డిపాజిట్‌ కోల్పోవాల్సి వచ్చింది. దుబ్బాక అసెంబ్లీ ఫలితం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న పార్టీకి ఈ ఫలితం షాక్‌ ఇచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సాగర్‌ ఎన్నిక ఒక్కటే పార్టీ భవిష్యత్‌ను తేల్చదని పార్టీ నేతలు కొందరు పేర్కొంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఫలితాలను బట్టి పార్టీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని, ఆ ఫలితాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ తరపున పోటీ చేసిన మువ్వా అరుణ్‌ కుమార్‌ పరిస్థితి మరీ దారుణం. ఆయన కేవలం 1708 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. అరుణ్‌ కుమార్‌ కంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తలారి రాంబాబు(2970) ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. ‘నోటా’కు 498 ఓట్లు వచ్చాయి.

Related Posts