YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముగిసిన మంత్రివర్గ భేటీ పలు అంశాలపై ఆమోద ముద్ర

ముగిసిన మంత్రివర్గ భేటీ పలు అంశాలపై ఆమోద ముద్ర

అమరావతి
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే కీలకంగా చర్చించారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను ఎలా అమలు చేయాలి? విధివిధానాలేంటి? అనే అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఎక్కడా జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. సరిపడా పడకలు లేక కొందరు చనిపోతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కొరతను ఎలా అధిగమించాలనే అంశంపైనా చర్చించారు. సుమారు 50 వేల బెడ్ల వరకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పలు చోట్ల ఆక్సిజన్ సమస్యపై చర్చ జరగ్గా.. తగిన ఆక్సిజన్ ఉన్నప్పటికీ రవాణాకు ట్రక్కుల కొరత వేధిస్తోందని, అందుకే సకాలంలో ఆస్పత్రులకు ఆక్సిజన్ అందడంలో జాప్యం జరుగుతున్నట్టు మంత్రులు సీఎంకు తెలిపినట్టు సమాచారం. దీంతో విదేశాల నుంచి కూడా ట్రక్కులు కొనుగోలు చేయాలనే అంశంపైనా చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ అంశంపైనా కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకా వేసేందుకు వీలుగా నిధుల కేటాయింపుపైనా మంత్రులు చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో టీకా కొరత ఉండటంతో భారీగా కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లపైనా చర్చించారు. వీటితో పాటు రెమిడెసివర్ ఇంజెక్షన్ల కొనుగోళ్లపైనా చర్చ జరిగింది. టూరిజం శాఖకు సంబంధించి పలు అంశాలపైనా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. 

Related Posts