
లండన్ మే 31
ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లు కోట్ల మంది ప్రాణాలు కాపాడినట్లు తాజాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ లాక్‌డౌన్‌లు బ్యాక్టీరియా రోగాలైన నిమోనియా, మెనింగిటిస్, సెప్సిస్‌లాంటి వాటిని భారీగా తగ్గించగలిగాయని స్పష్టం చేసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని ఒటాగో యూనివర్సిటీ డీన్, అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ డేవిడ్ మర్దోక్‌తో కలిసి ఆక్స్‌ఫర్డ్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ వ్యాధుల సంక్రమణ తగ్గిపోవడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు కూడా నిలిచాయని ఇందులో తేల్చారు. బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ మూడు రోగాల వల్లే ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది చనిపోతుంటారు. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్లిన వారిపై వీటి ప్రభావం ఎక్కువ.కరోనా వైరస్‌లాగే ఈ వ్యాధికారకాలు కూడా శ్వాసకోశ మార్గం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒక్క 2016 ఏడాదిలోనే 3.36 కోట్ల మంది ఈ వ్యాధుల బారిన పడగా.. అందులో 24 లక్‌రల మంది చనిపోయారు. గతేడాది జనవరి నుంచి మే మధ్య ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల సంఖ్య భారీగా తగ్గిందని ఈ అధ్యయనం గుర్తించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే.. సగటును ఒక్కో దేశంలో 6 వేల మేర కేసులు తక్కువగా నమోదైనట్లు తేల్చింది. అయితే ఈ లాక్‌డౌన్లు శ్వాసకోశేతర బ్యాక్టీరియా జాతుల వల్ల కలిగే వ్యాధులను మాత్రం తగ్గించలేదని ఈ అధ్యయనంలో తేలింది.కొవిడ్ లాక్‌డౌన్ విధించిన నాలుగు వారాల్లోనే స్ట్రెప్టోకోకస్ నిమోనియా ఇన్ఫెక్షన్ల సంఖ్య 68 శాతం మేర తగ్గిపోయినట్లు గుర్తించారు. ఈ లాక్‌డౌన్ల కారణంగా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాధి సంక్రమించకపోవడంతో వీటి సంఖ్య భారీగా తగ్గినట్లు అధ్యయనం తేల్చింది. కొవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత ఈ వ్యాధులకు వ్యాక్సిన్లు వేయాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆరు ఖండాల్లోని 26 దేశాల జాతీయ లేబొరేటరీల నుంచి అందిన డేటాను పరిశీలించి రీసెర్చర్లు ఈ అభిప్రాయానికి వచ్చారు.