
విజయవాడ, జూలై 8,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరినీ స్పేర్ చేసే పరిస్థితుల్లో లేరు. గత ఎన్నికల్లోనే సీనియర్ నేతలను పక్కన పెట్టారు. అలాంటిది ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించినా, పనితీరులో వెనకబడినా ఏ మాత్రం ఉపేక్షించరు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అర్థమయింది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో దాదాపు 90 శాతం మంది సొంత బలంతో గెలిచిన వారు కాదు. కేవలం టీడీపీ గుర్తు, కూటమి పార్టీల కలయిక వల్లనే ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయి గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా స్ట్రయిక్ రేటు వచ్చింది. చంద్రబాబు నాయుడులో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. మరోసారి జగన్ ను రానిచ్చేది లేదని చంద్రబాబు పదే పదే చెబుతుండటానికి కారణం కూడా అదే.2029 ఎన్నికల నాటికి ఇక నియోజకవర్గంలో వెనకబడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఉండదు. ఆయనకు కార్యకర్తలు ముఖ్యమని పదే పదే చెబుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును నెలవారీ సమీక్షలు చేస్తానని, అనుకున్న లక్ష్యాలను నెరవేరిస్తేనే తిరిగి టిక్కెట్ అని, లేకుంటే వన్ టైమ్ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తనకు పార్టీ ముఖ్యం. తిరిగి గెలవడమ లక్ష్యం. అంతే కాని కొత్త ముఖాలు అస్సలు ప్రధానం కాదు. ఈ విషయం ఎమ్మెల్యేలకు కూడా తెలియంది కాదు. వార్నింగ్ లు ప్రస్తుతం సుతిమెత్తంగానే హెచ్చరిస్తున్నా అవి రేపు టిక్కెట్ల కేటాయింపు సమయంలో కౌంట్ అవుతాయన్నది అందరూ అంగీకరిస్తున్న మాట.2024 ఎన్నికల్లో సీనియర్ నేతలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. దేవినేని ఉమ వంటి వారికి కూడా టిక్కెట్ లేదు. పొత్తులో భాగంగా అనేక మంది నేతలు టిక్కెట్లు కోల్పోయారు. ఇక ఒక కుటుంబానికి ఒక టిక్కెట్ అన్నది ఖచ్చితంగా అమలు చేశారు. జేసీ, కోట్ల వంటి కుటుంబాలను కూడా కేర్ చేయలేదు. కేవలం ఒక టిక్కెట్ ను మాత్రమే ఇచ్చి దానితో సంతృప్తి పడమన్నారు. అంటే మొన్నటి ఎన్నికల్లోనే చంద్రబాబు ఎఫెన్స్ లో వెళ్లినప్పుడు ఇక వచ్చే ఎన్నికల్లో ఇంకెంత స్పీడ్ గా ఉంటారో వేరే చెప్పాల్సిన పనిలేదు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తారన్నది వాస్తవం. అది కూడా అన్నీ లెక్కలు వేసుకుని మరీ బరిలోకిదింపుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు.ఇది వరకటి టీడీపీ కాదు. ఇప్పుడు చంద్రబాబుకు తోడుగా లోకేశ్ ఉన్నారు. ఇద్దరూ వేగంగా నిర్ణయాలు తీసుకునే నేతలే.పార్టీని గతంలో వీడి వెళ్లిన వారిని కూడా పెద్దగా పార్టీలోకి తీసుకోవడం లేదు. అదే సమయంలో పార్టీ లైన్ ను దాటి వ్యవహరించిన వారిని కూడా ప్రస్తుతం ఏమీ అనకపోయినా నాలుగేళ్ల తర్వాత మాత్రం అది కౌంట్ అవుతుంది. అందుకే ఎమ్మెల్యేలు గతంలో మాదిరిగా చంద్రబాబు మెతక వైఖరితో ఉంటారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన పూర్తిగా మారిపోయారు. అదీ ఆయన గత ఏడాది నుంచి నడుస్తున్న తీరును చూస్తుంటే అర్థమవుతుంది. ఈసారి అనేక మంది కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారు, సీనియర్ నేతలకు కూడా భంగపాటు తప్పేట్లు లేదు.