
న్యూయార్క్ మే 31
కరోనా వైరస్ వ్యాధి 2019లో మొదటిసారి బయటపడింది. అందుకే దానికి కోవిడ్-19 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది. ఇక అమెరికా సైంటిస్టులు కొత్త వార్నింగ్ ఇచ్చారు. కోవిడ్-26, కోవిడ్-32 కూడా వస్తాయేమో అని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. కోవిడ్-19 ఆనవాళ్లు కనుక్కోలేకపోతే.. వైరస్ విలయాలు తప్పవని అమెరికా శాస్త్‌డవేత్త స్కాట్ గాట్లిబ్ తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా స్కాట్ గాట్లిబ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఫైజర్ కంపెనీ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు. సార్స్ సీవోవీ2 వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీకైనట్లు ఆధారాలు బలపడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు చైనా సహకారం కావాలని, ఎందుకంటే భవిష్యత్తు మహమ్మారులను అడ్డుకోవాలంటే ఈ చర్యలు తప్పవని స్కాట్ తెలిపారు. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదన్న వాదనలకు ఇప్పటి వరకు చైనా ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని కూడా ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఎలా పుట్టిందో తెలియకుండా భవిష్యత్తులో సంభవించే వ్యాధులను పసికట్టలేమని టెక్సాస్ చిల్డ్రన్ హాస్పిటల్ కో డైరక్టర్ పీటర్ హోటెజ్ తెలిపారు. కోవిడ్19 ఆనవాళ్లను గుర్తపట్టనంత వరకు కోవిడ్-26, కోవిడ్-32 వచ్చినా ఆశ్చర్యంలేదని ఆయన అన్నారు. వుహాన్‌లో ఉన్న చేపల మార్కెట్లో నిజానికి తొలుత వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు ఆ వైరస్ సోకి ఉండి ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తల్లో స్వరం మారుతున్నది. వైరస్ ల్యాబ్ నుంచి లీకైనట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వాదన బాటలోనే బైడెన్ ప్రభుత్వం అడుగేసింది. కరోనా పుట్టుకపై లోతైన అధ్యయనం చేయాలని బైడెన్ ప్రభుత్వం ఆదేశించడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లు అయ్యింది. గతంలో ట్రంప్ ఆరోపణలను వ్యతిరేకించిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా ఇప్పుడు మాట మార్చేశారు. ఇక ట్రంప్‌ను ఖండించిన వైట్‌హౌజ్ మీడియా కూడా ఏమీ చెప్పలేని స్థితిలోకి వెళ్లిపోయింది. వుహాన్‌లో పనిచేసే పరిశోధకులకు 2019 నవంబర్ కన్నా ముందే వైరస్ సోకినట్లు ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం రాయడంతో మళ్లీ వైరస్ ఆనవాళ్ల గురించి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.చైనాలో సుదీర్ఘ కాలం పాటు విచారణ చేపట్టేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలని, అక్కడి మనుషులు.. జంతువుల నుంచి రక్త నమోనాలు సేకరించాలని హోటెజ్ తెలిపారు. ఆంక్షలు విధిస్తామని బెదిరించి అయినా ఈ పని చేయాలని ఆయన అన్నారు. సైంటిస్టులు, ఎపిడమాలజిస్ట్‌లు, వైరాలజిస్టులు, బ్యాట్ ఎకాలజిస్ట్ పరిశోధకులు హుబే ప్రావిన్సులో సుమారు ఆరు నెలలు ఉండాలని హోటెజ్ చెప్పారు.