
న్యూయార్క్ మే 31
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీకైనట్లు తాజాగా కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్లీ వైరస్ జాడ ఆసక్తికరంగా మారింది. బ్రిటన్‌కు చెందిన డెయిల్ మెయిల్ రాసిన కథనంతో అమెరికా మళ్లీ అప్రమత్తమైంది. అయితే ఈ ఘటనపై ఆ దేశ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పాంపియో స్పందించారు. వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో పరిశోధనలతో పాటు ఆ దేశ సైన్యం కూడా ల్యాబ్ పరీక్షల్లో నిమగ్నమైనట్లు పాంపియో ఆరోపించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు ఆ ల్యాబ్ పరీక్షలో భాగస్వామ్యులయ్యారని, వైరస్ పరిశోధనలతో పాటు సైనిక కార్యకలాపాలు కూడా నిగూఢంగా సాగినట్లు ఆయన ఆరోపించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పీఎల్ఏ సైన్యంతో వాళ్లు ఆ ల్యాబ్‌లో ఏం చేశారో చెప్పడానికి ఇష్టంగా లేరని, అసలు ఎలాంటి పరిశోధనలు జరిగాయో కూడా చెప్పడం లేదని, ఆ ల్యాబ్‌కు వెళ్లేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అవకాశం ఇవ్వడం లేదని పాంపియో పేర్కొన్నారు.కరోనా వైరస్ మహమ్మారి ఎలా పుట్టింది.. ఎక్కడ పుట్టింది అన్న దానిపై శాస్త్రవేత్తలు తమ అనుమానాలను వ్యక్తం చేయడంతో.. ఆ వైరస్ ఆనవాళ్లను కనుక్కోవాలని వాదన మళ్లీ ఊపందుకున్నది. దీంతో చైనాపై తీవ్ర వత్తిడి పెరుగుతున్నది. వైరస్ విషయంలో శాస్త్రవేత్తలను చైనా కనికట్టు చేసినట్లు ప్రొఫెసర్ నికోలై పెట్రోస్కీ స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. చైనీస్ ల్యాబ్ నుంచి వైరస్ లీకైనట్లు చాలా మంది నిపుణులు భావిస్తున్నారని, దీంతో చైనా వత్తడికి లోనవుతున్నట్లు ఆయన ఓ షోలో తెలిపారు. పంగోలిన్స్ నుంచి మనుషులకు వైరస్ పాకినట్లు చైనా చెప్పుకొచ్చినా.. దీంట్లో వాస్తవం లేదన్న అభిప్రాయాన్ని ప్రొఫెసర్ పెట్రోస్కీ వ్యక్తం చేశారు. వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేసిన డబ్ల్యూహెచ్‌వో.. ఆ వైరస్ ల్యాబ్ నుంచి లీకైనట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.