YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్యేల గుండెల్లో సర్వేల గుబులు కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్

ఎమ్మెల్యేల గుండెల్లో సర్వేల గుబులు కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్

హైదరాబాద్, జూన్ 10, 
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల్లో ప్రభుత్వ తీరుపై 42 శాతం వ్యతిరేకత ఉన్నట్లు నిఘా వర్గాల పరిశీలనలో తేలింది. కరోనా కష్టాలు, ఉపాధి కోల్పోవడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కనిపించకుండా ఉండటం, కిందిస్థాయి అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకతను మూటగట్టుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలపై నాలుగు నెలల కిందటే సర్వే చేయించింది. దీనిపై సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల వ్యవహారంపై సర్వే చేశామని, ప్రజలు అనుకూలంగా ఉన్నారంటూ తేలిందని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గత నెలలో ప్రభుత్వ పథకాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతల అంశాలతో పాటుగా ఓవరాల్గా ప్రభుత్వ విధానంపై నిఘా వర్గాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఈ నెల మొదట్లోనే ఈ పరిశీలన వివరాలను నిఘా వర్గాల నుంచి సీఎం కేసీఆర్కు అందించినట్లు అధికారవర్గాల ద్వారా సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై 60 శాతం మేరకు కొంత అనుకూలతను మెజార్టీగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే మంత్రుల పనితీరు ఎలా ఉందన్న దానిపై మిశ్రమ ఫలితాలు వచ్చాయని, మంత్రుల ఇమేజ్ గతంలో కంటే ఇప్పుడు డౌన్ఫాల్ అయిందని పరిశీలనలో తేలింది. ప్రధానంగా గత ఏడాదితో చూస్తే మంత్రుల పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అయితే కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కారు పనితీరుపై గత సంవత్సరం కంటే కాస్త భిన్నమైన ఫలితం వచ్చినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ను కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కొంత ఆగ్రహంగానే ప్రజలు స్పందించారు. గత సంవత్సరం తీసుకున్న చర్యలతో పోలిస్తే ఈ సంవత్సరం కరోనా కట్టడిలో కాస్త వెనుకబడినట్లు ప్రజల అభిప్రాయం ఉంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు కొనసాగించడంపై మాత్రం ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన ఉంది. ఈ రెండున్నరేండ్ల పాలనను స్థూలంగా చూస్తే సంక్షేమ పథకాలను పక్కన పెడితే అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు అంచనాలను అందుకోలేకపోవడం, అవినీతి రహిత పాలన అందడం లేదనే భావన, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనే అపవాదును కేసీఆర్ మూటగట్టుకుంటుండంతో 42 శాతం మైనస్గా మారిందని తేలింది.మరోవైపు గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏకంగా 101 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తమ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, గ్రామాలకు రావడం లేదని, కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు కనికరం లేకుండా ఉన్నారంటూ కొన్ని వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో తమ ఎమ్మెల్యేలు కనిపించకుండా నెలలు కావస్తుందంటూ తిట్టిపోస్తున్నట్లు వెల్లడైంది.ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత సర్వేకు సీఎం ఆదేశించినట్లు అధికారవర్గాలు చెప్పుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అభివృద్ధి పనులు తదితర అంశాలపై నిఘా వర్గాలు పూర్తిస్థాయి సమాచారాన్ని సీఎంకు అందించినట్లు సమాచారం. ఎంపీల పనితీరుపై మాత్రం ఎక్కువ వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎంపీలు ఎక్కడకు వెళ్లలేదని, కనీసం కార్యకర్తుల, నాయకులను సైతం కలువడం లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఇక కొన్ని జిల్లాల్లో మంత్రుల వైఖరి కూడా ప్రజలకు నచ్చడం లేదు. మంత్రులు అవసరమైన అంశాలను పక్కనపెట్టి, రాజకీయపరమైన అంశాలు, కేవలం కొంతమంది చెప్పితేనే పనులు చేయడంపై సగానికిపైగా శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్లిష్ట సమయాల్లో రాజకీయపరమైన విభేదాలను చూపించడం, రాజకీయ కోణాల్లోనే పనులు చేయడం జిల్లాల్లో నచ్చడం లేదు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, చిన్న జిల్లాలు అయినప్పటికీ అధికారులు అందుబాటులో ఉండటం లేదని, కరోనా సాకుతో పనులేమీ చేయడం లేదంటూ 91 శాతం ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు విభాగాల్లో అవినీతి పెరుగుతుందంటూ నిఘా వర్గాల పరిశీలనలో వెల్లడించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సిబ్బంది పనితీరు అధ్వాన్నంగా మారిందని, గతంతో పోలిస్తే ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ సిబ్బంది పనితీరు మరింత పేలవంగా మారిందని తేలింది. చిన్న జిల్లాలతో ఉన్నతాధికారులు స్థానికంగా ఉంటున్నా… గ్రామస్థాయి సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదనే అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పక్కన పెడితే… గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదంటూ పలు నియోజకవర్గాలు, జిల్లాల్లో ఆరోపణలు వ్యక్తం చేశారు. కనీసం రోడ్ల పనులకు కూడా రూపాయి నిధులు విడుదల చేయడం లేదంటూ వ్యతిరేకతను చూపిస్తున్నారు. కరోనా కాలం అంటూ నిధుల్లేకుండా పాలన సాగిస్తున్నారంటూ ఒక వర్గం వ్యతిరేకతను వెల్లడి చేస్తోంది. దీనితో పాటుగా డబుల్ బెడ్ రూం ఇండ్లపై కూడా దాదాపుగా రాష్ట్రమంతా అసంతృప్తిని వ్యక్తం చేసింది. అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇండ్ల వ్యవహారంపై చాలా మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సీఎంకు నివేదించినట్లు సమాచారం.ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా కొన్ని వర్గాల్లో మొగ్గు ఉందని నిఘా వర్గాల పరిశీలనలో తేలింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరుపై మాత్రమే కాకుండా రాజకీయపరమైన అంశాలపై కూడా నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. కాంగ్రెస్, బీజేపీతో పాటుగా ఆయా పార్టీల పరిస్థితులపై కేసీఆర్ అంచనా వేసుకోవడంలో భాగంగా ఈ వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కంటే సుమారు 8 శాతం కాంగ్రెస్కు కొన్ని ప్రాంతాల్లో బలం పెరుగుతుందంటూ పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఆ తర్వాత బీజేపీ ఉన్నట్లు టాక్.

Related Posts