
బీజింగ్ జూన్ 15
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీకై ఉంటుందన్న వాదనకు క్రమంగా బలం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ల్యాబ్‌కు చెందిన ప్రముఖ చైనీస్ సైంటిస్ట్ డాక్టర్ షి ఝెంగ్లి నోరు విప్పారు. ఈ విపత్తుకు తన ల్యాబ్‌ను నిందించడం సరి కాదని ఆమె అన్నారు. అసలు ఆధారాలే లేకుండా నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని న్యూయార్క్ టైమ్స్‌కు పంపిన మెయిల్‌లో డాక్టర్ షి అన్నారు. అసలు ల్యాబ్‌లో లీకైందన్న వాదనను ప్రపంచం ఎలా అంగీకరిస్తోందో నాకు అర్థం కావడం లేదు. ఓ అమాయక సైంటిస్టుపై పదే పదే నిందలు మోపుతున్నారు అని ఆమె వాపోయారు.ల్యాబ్ లీకు వాదనతోపాటు అసలు కరోనా మూలాలపై విచారణ జరపాలని ఈ మధ్యే అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనా వచ్చిన తొలి నాళ్ల నుంచి కూడా అది వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందన్న వాదన ప్రారంభమైంది. ఈ ల్యాబ్‌కు చెందిన ముగ్గురు సైంటిస్టులు ఓ గుహలోకి గబ్బిలాల కోసం వెళ్లి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురి కావడం ఈ వాదనకు బలం చేకూర్చింది.రాబోయే కాలంలో ఎలాంటి వైరస్‌లు పుట్టుకొస్తాయి, వాటి బలం ఎంత, ఎలాంటి ప్రభావాలు చూపుతాయి అన్నదానిపై వుహాన్ ల్యాబ్‌లో జరిగిన ప్రయోగాలకు గబ్బిలాల కరోనావైరస్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ షినే నేతృత్వం వహించారని పలువురు సైంటిస్టులు తెలిపారు. అయితే తమ ప్రయోగాలు వైరస్‌ను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి కావని, ఇతర జాతులకు వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించామని తాజా మెయిల్‌లో డాక్టర్ షి చెప్పారు.