
న్యూ ఢిల్లీ జూన్ 16, ఫ్యూజన్ రియాక్టర్‌పై వెయ్యికిపైగా ఇంజినీర్లు, సైంటిస్టులు నిర్విరామ కృషి
ఇప్పుడు ఫ్రాన్స్ లో భూమిపై ఓ సూర్యుడిని సృష్టించే పని జరుగుతోంది. సెంట్రల్ సోలెనాయిడ్‌గా పిలిచే ఈ అయస్కాంతం.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. ఈ సూర్యుడు మనం వాడుతున్న శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయం కానున్నాడు. స్వచ్ఛ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దిశగా ఫ్రాన్స్‌లో ఓ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మిస్తున్నారు. ఈ రియాక్టర్ కోసమే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేశారు. సూర్యుడికి శక్తినిచ్చే ప్రక్రియ ఎలా సాగుతుందో.. ఈ అయస్కాంతం కూడా అలాంటి ప్రక్రియతో రియాక్టర్‌కు శక్తినివ్వనుంది.ఈ అత్యంత శక్తివంతమైన అయస్కాంతాన్ని సెంట్రల్ సోలెనాయిడ్‌గా పిలుస్తున్నారు. ఇది ఎంత శక్తివంతమైనదంటే ఓ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను 6 అడుగుల ఎత్తు వరకూ పైకి లేపగలదు. ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఇంధన ప్రాజెక్ట్‌లో ఇదే ముఖ్యమైన కాంపోనెంట్ కానుంది. జనరల్ అటామిక్స్ దీనిని తయారు చేసింది. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పరిమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) ప్రాజెక్ట్ కోసం ఈ అయస్కాంతాన్ని ఫ్రాన్స్‌కు తరలించనున్నారు.ఐటీఈఆర్ ప్లాస్మాలో శక్తివంతమైన ప్రవాహాన్ని ఈ అయస్కాంతం ప్రేరేపిస్తుంది. ఈ అయస్కాంతం బరువు వెయ్యి టన్నులు కాగా.. 59 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో కనిపిస్తుంది. ఓ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను 6 అడుగుల మేర గాల్లోకి ఎత్తగలిగే ఈ సెంట్రల్ సోలెనాయిడ్ అయస్కాంత క్షేత్ర బలం 13 టెస్లా అని దీనిని తయారు చేసిన సంస్థ వెల్లడించింది. సింపుల్‌గా చెప్పాలంటే మన భూమి అయస్కాంత క్షేత్రం కంటే ఇది 2 లక్షల 80 వేల రెట్లు ఎక్కువ.ఫ్యూజన్ ఆధారిత విద్యుత్తును వాణిజ్య అవసరాల కోసం ఉత్పత్తి చేయడానికి ఈ ఐటీఈఆర్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ప్రపంచంలోని ఇంధన ప్రాజెక్టులలో దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఇండియా సహా చైనా, యురోపియన్ యూనియన్, జపాన్, కొరియా, రష్యా, అమెరికా ఉన్నాయి. ఈ దేశాలన్నీ 35 ఏళ్ల పాటు ఈ ఐటీఈఆర్ ప్రయోగాత్మక పరికరాన్ని నిర్మించి, ఆపరేట్ చేయనున్నాయి. ఫ్యూజన్ రియాక్టర్‌పై వెయ్యికిపైగా ఇంజినీర్లు, సైంటిస్టులు పని చేస్తున్నారు.