
వాషింగ్టన్, జూన్ 18,
భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వనాయకుడిగా ఎంపికయ్యారు. గ్లోబల లీడర్స్ ర్యాంకింగ్ కోసం అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా, బ్రిటన్‌తో పాటు 13 దేశాల నాయకులను తోసిరాజని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. మోదీకి వచ్చిన జనాదరణ 100 లో 66 శాతంగా ఉన్నది. అయితే, గత ఏడాది లభించిన ప్రజాదరణ ఈసారి 20 శాతం తక్కువగా ఉండటం విశేషం. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్, భారతదేశంలో దాని చెడు ప్రభావాల తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉన్నదని ఈ సర్వే వెల్లడిస్తున్నది.అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో గ్లోబల్ లీడర్స్ ర్యాంకింగ్‌లో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు సహా 13 దేశాల నాయకులను చేర్చారు. ఈ సర్వేలో భారతదేశానికి చెందిన 2,126 మందిని చేర్చారు. ఇందులో 28 శాతం మంది మోదీ ప్రజాదరణను అంగీకరించలేదు. సర్వేలో కేవలం 3 దేశాల నాయకుల రేటింగ్ 60 శాతం పైన ఉండటం విశేషం. సర్వేలో మోదీ తర్వాత ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో ద్రాగి ఉన్నారు. ఆయన రేటింగ్ 65 శాతం. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో 63 శాతం రేటింగ్‌తో ఉన్నారు.ఈ నెల 7న మోదీ చేసిన ప్రసంగంతో ఆయన రేటింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని పలువురు నిపుణులు వాదిస్తున్నారు. దేశంలోని 18 ఏండ్ల వయసు పైబడిన వారందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు అందజేస్తామని మోదీ చెప్పడంతో ఆయనకు ప్రజల్లో కొంత ఆదరణ పెరిగిందని చెప్పవచ్చునని వారంటున్నారు.
విశ్వనాయకుల రేటింగ్..
నరేంద్ర మోదీ (భారత్) 66%
మారియో ద్రాగి (ఇటలీ) 65%
లోపెజ్ ఒబ్రాడోర్ (మెక్సికో) 63%
స్కాట్ మోరిసన్ (ఆస్ట్రేలియా) 54%
ఏంజెలా మెర్కెల్ (జర్మనీ) 53%
జో బిడెన్ (యూఎస్) 53%
జస్టిన్ ట్రూడో (కెనడా) 48%
బోరిస్ జాన్సన్ (యూకే) 44%
మూన్ జే-ఇన్ (దక్షిణ కొరియా) 37%
పెడ్రో శాంచెజ్ (స్పెయిన్) 36%
జైర్ బోల్సోనారో (బ్రెజిల్) 35%
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్) 35%
యోషిహిడే సుగా (జపాన్) 29%