
లక్నో జూలై 10
జనాభా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నది. దీని కోసం ఓ ముసాయిదాను తయారు చేసింది. ఇద్దరి కన్నా ఎక్కువ సంఖ్యలో పిల్లలు కన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోనున్నారు. అలాంటి తల్లితండ్రులకు ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉండదు. ప్రభుత్వం చేపట్టే ఎటువంటి సంక్షేమ సౌకర్యం కూడా అందదు. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వీలు ఇవ్వరు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లోనూ వాళ్లు పోటీపడే ఛాన్సు లేదు. ఇలాంటి ప్రతిపాదనలతో ముసాయిదాను తయారు చేశారు. యూపీ జనాభా బిల్లు 2021పై ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు జూలై 19వ తేదీ వరకు సమయాన్ని కేటాయించారు. ఆ ముసాయిదాతో కేవలం ముస్లింలను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నా.. వచ్చే ఏడాది యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఇది ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బహుభార్యత్వం విషయంలో వేరు వేరు సంతానాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. కేవలం ఇద్దర్నే కనాలన్న దానిపై ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నది. స్వచ్ఛంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నవారికి.. సాధారణ వడ్డీ రేటుతో ఇండ్ల నిర్మాణం కోసం రుణాలు ఇవ్వనున్నారు. నీరు, విద్యుత్తు, ఇంటి పన్నుల్లో రిబేట్ ఇస్తారట. ఒక బిడ్డనే కన్న తర్వాత ఆపరేషన్ చేయించుకున్నవారికి ఉచిత ఆరోగ్య సదుపాయాలు కల్పించనున్నారు. ఆ బిడ్డ 20 ఏళ్ల వచ్చే వరకు బీమా కల్పించనున్నారు. ఐఐఎం, ఏయిమ్స్ లాంటి విద్యాసంస్థల్లో ఆ పిల్లలకు అడ్మిషన్ సులువుగా లభిస్తుందని ముసాయిదాలో పేర్కొన్నారు. ఇద్దరే ముద్దు అన్న విధానాన్ని పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్ల పొందుతారు. ఇక ఒక్క పిల్లవాడే ముద్దు అనుకున్నవాళ్లకు నాలుగు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు ముసాయిదాలో వెల్లడించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ఒక్కరినే కంటే.. ఒకవేళ అబ్బాయితే 80 వేల, అమ్మాయి అయితే లక్ష ఇవ్వనున్నారు.