
బీజేపీకి మమత షాక్
బెంగాల్, జూలై 10,
బెంగాల్‌లో బీజేపీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు.బీజేపీ నుంచి గెలిచి, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ముకుల్ రాయ్‌కు కీలకమైన ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ప్రభుత్వ ఖాతాలను తనిఖీ చేసే అధికారం ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష ఎమ్మెల్యేను నియమించడం. ఇది సంప్రదాయంగా వస్తుంది. కానీ, దీనికి భిన్నంగా టీఎంసీలో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడంతో బీజేపీకి మింగుడుపడటం లేదు.బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల తృణమూల్‌లో చేరిన ముకుల్ రాయ్‌కు కీలకమైన పీఏసీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించినట్టు అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ ప్రకటించారు. అయితే, ప్రతిపక్ష పార్టీ నేతకు బదులు.. టీఎంసీలో చేరిన వ్యక్తికి దీదీ ఈ పదవి ఇవ్వడానికి కూడా ఓ కారణం ఉంది. ముకుల్ రాయ్ తృణమూల్‌లో చేరినా రాజీనామా చేయకపోవడంతో రికార్డుల ప్రకారం బీజేపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలోని సీనియర్ కావడంతో ఆయనకు పదవి ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. ముకుల్ పేరును తాము సిఫార్సు చేయలేదని, అలాంటప్పుడు ఎలా నియమిస్తారని అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి ప్రశ్నించారు. ఇది కుమ్మక్కు రాజకీయమని ఆయన ఆరోపించారు. సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నేతను పీఏసీ ఛైర్మన్‌గా నియమించాలని, కానీ టీఎంసీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని సువేందు మండిపడ్డారు. దీనికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.అయితే, అంతా నిబంధనల మేరకే జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణనగర్ ఉట్టూరు నుంచి ముకుల్ రాయ్ విజయం సాధించారు. ముకుల్ రాయ్ 2017లో టీఎంసీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరారు. అయితే, ఎన్నికల తర్వాత పరిణామాలతో ఆయన తిరిగి గత నెలలో సొంతగూటికి చేరుకున్నారు.