
కాంగ్రెస్ ఛీఫ్ గా కమల్ నాధ్..?
న్యూఢిల్లీ, జూలై 15,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్.. ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో సోనియాను కమల్‌నాథ్ కలిశారు. ఈ నేపథ్యంలో కొన్ని రూమార్స్ వ్యాపిస్తున్నాయి. కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మార్పుల అంశం గురించి సోనియా, కమల్‌నాథ్ ఇద్దరూ చర్చిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో కమల్‌నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పార్టీ ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు.
గాంధీ కుటుంబానికి కమల్‌నాథ్ అత్యంత సన్నిహితుడు. మాజీ కేంద్ర మంత్రి కూడా. 9 సార్లు ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో చాన్నాళ్ల నుంచి లుకలుకలు బయటపడుతున్నాయి. నాయకత్వం విషయంలో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగుతున్నా.. కొందరు సీనియర్లలో అసహనం రగులుతున్న విషయం తెలిసిందే.2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. రాహుల్ అధ్యక్ష పదవిని వదులుకున్నారు. ఆ క్షణం నుంచి పార్టీలో రెబల్ గ్యాంగ్ తయారైంది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన సోనియాకు కొందరు నేతలు లెటర్ కూడా రాశారు. కానీ అధ్యక్షుడిని తేల్చకపోవడంతో.. సోనియానే ఆ హోదాలో కొనసాగుతున్నారు.