YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మన ముందున్న దేవుడిని తెలుసుకునేదెలా?!!

మన ముందున్న దేవుడిని తెలుసుకునేదెలా?!!

భగవంతుడు భక్తులకు ఎప్పటికప్పుడు ఏది కావాలో అది అందిస్తూనే ఉంటాడు. అయితే ఆ అందిస్తున్నది సాక్షాత్తూ భగవంతుడేనని, భగవంతుడి సాయాన్ని అందుకొంటున్న భక్తుడు గ్రహించలేడు. ఇదే ఆయన మాయ.  ఆ మాయతోనే ఏ ఒక్క భక్తుడి దగ్గరనో ఉండిపోకుండా, ఆ భక్తుడి భక్తికి మోహంతో మురిసిపోకుండా తాను మాత్రం మాయచేసి మరోచోటికి వెళ్తుంటాడు. ఇదే భగవంతుడి లీల. ఈ విషయాన్నే వివరించి చెబుతోంది మహాభాగవతం దశమ స్కంధం పూర్వార్థంలోని పదకొండో అధ్యాయం.  

ఈ అధ్యాయంలో చిన్ని కృష్ణుడుగా తమ మధ్యన అవతరించింది వైకుంఠవాసుడేనని వ్రజవాసులు తెలుసుకోలేకపోవటంలోనే మాయ కనిపిస్తుంది.  చంటిబిడ్డగా ఉన్న చిన్ని కృష్ణుడి గోలను భరించలేక ఆయనను రోటికి కట్టేసింది యశోదమ్మ. ఆ రోలును అలా అలా మెల్లగా లాక్కుంటూ రెండు మద్దిచెట్ల మధ్యకు వెళ్లాడు బాలకృష్ణుడు. ఆ సమయంలో రేపల్లెలోని చిన్న పిల్లలు తప్ప అక్కడ పెద్దవాళ్లెవరూ లేరు. కృష్ణుడు రెండు చెట్ల మధ్య నుంచి అడ్డం తిరిగిన రోలును లాక్కువెళ్లేసరికి ఆ చెట్లు పిడుగుపాటు ధ్వని చేసుకుంటూ విరిగి నేల మీద పడ్డాయి. ఆ శబ్దం విని పరుగెత్తుకొచ్చిన పెద్దలు చెట్లను ఎవరు పడగొట్టారు అని పిల్లలనడిగితే, అదిగో.. ఆ చిన్ని కృష్ణుడే’ అని చూపించారు.  చెట్ల విరిగినప్పుడు ఎవరో ఇద్దరు దివ్యపురుషులు కూడా వాటి నుంచి వచ్చి కృష్ణుడికి ప్రదక్షిణం చేసి ఎటో వెళ్లిపోయారని వివరించారా పిల్లలు.  అంత చెప్పినా కృష్ణుడి దైవత్వం ఆ పెద్దలకు అర్థం కాలేదు. శాపగ్రస్తులైన కుబేరుడి కుమారులు నలకూబర, మణిగ్రీవులకు శాప విమోచనం కల్పించిన దేవుడు కృష్ణుడు అని అర్థం చేసుకోలేదు. కన్నయ్యను రక్షించుకునేదెలా..?  అంతకు ముందు పూతన, శకటాసురుడు లాంటివారివల్ల బాలకృష్ణుడికి ప్రమాదం కలగబోయింది కనుక అసలా ప్రదేశమే మంచిది కాదని ఆ పెద్దలంతా అనుకున్నారు. దైవకృపవల్ల ఆ ఉత్పాతాల నుంచి కృష్ణుడు బతికి బయటపడ్డారని ఎలాగైనా సరే ఇకమీదట కృష్ణుణ్ణి రక్షించుకోవాలని ఆ పెద్దలంతా ఓ రోజున సమావేశమయ్యారు. వ్రజంలో నానాటికీ ఉత్పాతాలు పెరుగుతున్నాయి. కనుక కృష్ణుడి రక్షణ కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నవారిలో ఉపనందుడు అనే పేరున్న జ్ఞానవయోవృద్ధుడు ఓ చక్కటి సలహా చెప్పాడు. ఆ ఉపనందుడికి బలరామకృష్ణులంటే మరీమరీ ఇష్టం. కనుక ఉపనందుడి మాట జాగ్రత్తగా ఆలకించారు గోపకులంతా.  వ్రజానికి సమీపంలో బృందావనం అనే ఓ అద్భుతమైన ప్రదేశం ఉంది. అక్కడ ఓ చక్కని పర్వతం దాని చుట్టూ ఎంతో అందంగా పచ్చపచ్చగా కనిపిస్తూ ఉండే ఎన్నెన్నోరకాల చెట్లు ఉంటాయి. ఆ ప్రదేశంలో ఉన్న పచ్చిక, పక్కనే పారుతున్న స్వచ్ఛమైన యమునా నదీజలాలతో పశుసంపద బాగావృద్ధి చెందుతుంది కూడా అని బృందావన విశేషాలను చక్కగా వివరించాడు ఉపనందుడు. ఆ మాటలు అక్కడున్న నందుడులాంటి గోపాలకులందరికీ బాగా నచ్చాయి. ఎలాంటి ఉపద్రవాలు లేకుండా అక్కడైతే చిన్ని కృష్ణుడు హాయిగా, పెరిగి పెద్దవాడవుతాడని అందరూ అనుకున్నారు. ఉపనందుడి మాటననుసరించి రేపల్లెవాసులంతా తమతమ గృహాలలోని వస్తువులను, స్త్రీలను బండ్లమీద ఎక్కించి బృందావనానికి బయలుదేరారు. పిల్లలు, స్త్రీలు, గృహోపకరణాలు బండ్లమీద ఉన్నాయి. గోపాలకులు ధనుర్బాణాలను పట్టుకొని బండ్లకు కాపలాగా నడుస్తూ ప్రయాణమయ్యారు. గోవులను, దూడలను ముందు భాగాన నడిపిస్తూ వాటివెనుక కొందరు కొమ్మువాద్యాలను, మంగళతూర్యాలను మధురంగా మోగిస్తూ పురోహితులతో కలిసి యమునా తీరంలోని బృందావనానికి చేరి అక్కడ చక్కగా చదునుగా ఉన్న పవిత్రమూ, శుభప్రదమూ అయిన స్థలంలో అర్థచంద్రాకారంలో బండ్లను నిలిపారు.  బృందావనానికి చేరిన దేవదేవుడు పశువుల కోసం, తమ నివాసాల కోసం ఎవరెవరికి ఎంతెంత ప్రదేశం కావాలో అంత ప్రదేశాన్ని ఎంచుకొని దాని మధ్యలో బండ్లను నిలిపారు. బండ్లు నిలిపిన ప్రదేశాలలోనే బృందావనవాసుల గృహాలు నిర్మితమయ్యాయి. అలా రేపల్లె నుంచి బృందావనానికి జగద్రక్షకుడైన కృష్ణుడు చిన్నతనంలో తరలివచ్చాడు. తమ మధ్య ఉన్న పసిబాలుడు భగవంతుడేనన్న విషయాన్ని ఆ స్వామి మాయతోనే నాటి పెద్దలు తెలుసుకోలేకపోయారు. తమను రక్షించటానికి వచ్చిన ఆయనను తామే రక్షించాలనుకోవటం మాయా చిత్రమే. పూతన, శకటాసురుడులాంటి రాక్షసుల చేతిలో మృత్యువాత పడకుండా దేవుడే కృష్ణుడిని రక్షించాడని అనుకోవటమూ మాయవల్లనే జరిగింది. అయితే తమ ఎదురుగా ఉన్నది కృష్ణుడి రూపంలో ఉన్న వైకుంఠవాసుడని ఆనాడు కొంతమంది తెలుసుకోగలిగారు. వారు తెలుసుకోవటానికి, మాయలో పడకపోటానికి కారణం నిరంతరం భగవధ్యానం, ఆర్తభక్తి. ఈ రెంటినీ కలిగిఉన్నవారు ఆనాడైనా, ఈనాడైనా తమ ముందు కూర్చున్న భగవంతుడిని తెలుసుకోగలుగుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు అని వివరిస్తోంది. 

మహాభాగవతంలోనిది ఈ కథ...

Related Posts