YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మోడీతో పవార్ భేటీ

మోడీతో పవార్ భేటీ

ముంబై, జూలై 18, 
ప్రధాని నరేంద్ర మోదీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు, ఎంపీ శరద్ పవార్ శనివారం కలిశారు. ఇరువురూ దాదాపు 50 నిమిషాలపాటు సమావేశమయ్యారు. మోదీతో పవార్ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ వర్గాలు స్పందించాయి. ప్రధాని తన మంత్రివర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ, రైతుల సమస్యలపైనా శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపాయి. మోదీ, పవార్ భేటీ గురించి ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించింది.ఇరువురూ సమావేశమైన ఓ ఫొటోను ట్వీట్ చేసింది. మోదీతో ముఖాముఖి సమావేశంలో నూతన సహకార మంత్రిత్వ శాఖపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు ఓ లేఖను కూడా రాశారు. సహకార బ్యాంకుల రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని పవార్ స్పష్టం చేశారు. ఈ రంగంలో కేంద్రం జోక్యం చేసుకుంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులను కూడా ప్రస్తావించారు.మోదీ మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందు శరద్ పవార్ మాట్లాడుతూ.. సహకార రంగానికి సంబందించిన చట్టాన్ని మహారాష్ట్ర శాసన సభ రూపొందించింది... ఈ చట్టంలో జోక్యం చేసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు అన్నారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం, మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు తలెత్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానితో పవార్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.ఇదిలావుండగా, 2022లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థినంటూ జరుగుతున్న ప్రచారాన్ని శరద్ పవార్ గతవారం తోసిపుచ్చారు. విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవికి అభ్యర్థినని చెప్పడం తప్పు అని స్పష్టం చేశారు. శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పలుమార్లు భేటీ కావడంతో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పోటీచేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి.

Related Posts